No Objection Certificate: సమ్మక్క సాగర్‌కు ఎన్‌వోసీ
ABN , Publish Date - Sep 23 , 2025 | 07:14 AM
సమ్మక్క సాగర్ (తుపాకులగూడెం) ప్రాజెక్టుకు నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) జారీ చేయడానికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ నెల 25న ఈ ప్రాజెక్టుపై కేంద్ర జలవనరుల సంఘం...
సూత్రప్రాయంగా ఛత్తీ్‌సగఢ్ ఓకే
ఆ రాష్ట్ర సీఎంతో మంత్రి ఉత్తమ్ సంప్రదింపులు ఫలప్రదం
సీడబ్ల్యూసీ భేటీలోపే ఎన్‌వోసీ!
హైదరాబాద్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): సమ్మక్క సాగర్ (తుపాకులగూడెం) ప్రాజెక్టుకు నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) జారీ చేయడానికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ నెల 25న ఈ ప్రాజెక్టుపై కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) సమావేశం ఉండటంతో ఈలోగా ఆ రాష్ట్రంతో సంప్రదింపులకు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి రంగంలోకి దిగారు. సోమవారం ఛత్తీస్‌గఢ్ రాజధాని న్యూ రాయ్‌పూర్‌లో ఆ రాష్ట్ర సీఎం విష్ణుదేవ్ సాయిని కలుసుకున్నారు. ముంపు భూములకు 2013 భూసేకరణ చట్టం లేదా గంపగుత్తగా పరిహారం అందించే జీవోల ఆధారంగా ముందస్తుగా పరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఉత్తమ్ తెలిపారు. ఛత్తీస్‌గఢ్ అభ్యంతరాల వల్ల కీలక ప్రాజెక్టు డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ క్లియర్ చేయడం లేదని నివేదించారు. ఎన్‌వోసీ ఇస్తేనే క్లియరెన్స్ వస్తుందని తెలిపారు. ముంపు భూములకు సముచితంగా పరిహారం ఇస్తామని, పునరావాసం, పునర్నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో సమ్మక్క సాగర్ ప్రాజెక్టు గురించి ఉత్తమ్ వివరించారు. 83 మీటర్ల ఎత్తుతో 6.7 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీని కట్టామని, పూర్వ నల్గొండ, వరంగల్ జిల్లాలో 2.64 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు రామప్ప-పాకాల లింక్‌లో 30 వేల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించడం ప్రాజెక్టు లక్ష్యమని చెప్పారు. ఈ ప్రాజెక్టుతో తాగు, సాగునీటి అవసరాలు తీరతాయని, కరువు ప్రాంతాలకు మేలు జరుగుతుందని తెలిపారు. దశాబ్దాలుగా వ్యవసాయంలో అనిశ్చితితో సతమతం అవుతున్న రైతులకు జీవనోపాధి కల్పించడంతో పాటు వ్యవసాయ దిగుబడులను పెంచడంలో ప్రాజెక్టు కీలకమని వివరించారు.
రాష్ట్రంలోని అత్యంత వెనకబడిన ప్రాంతాల్లోని లక్షలాది మందికి ఈ ప్రాజెక్టు జీవధారగా మారుతుందని తెలిపారు. బ్యారేజీకి గరిష్ఠ వరదతో కలిగే ముంపుపై ఐఐటీ ఖరగ్‌పూర్ నివేదిక అందించిందని, దాని ప్రకారం పరిహారం అందిస్తామని చెప్పారు. అదీ ముందస్తుగా ఎన్‌వోసీ ఇచ్చే సమయంలోనే ఇస్తామని హామీ ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్ సీఎం స్పందిస్తూ ముంపు ప్రభావిత ప్రాంతాలకు పరిహారం ఇస్తే.. ఎన్‌వోసీ ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. సీడబ్ల్యూసీ ఈ నెల 25న సమ్మక్క సాగర్‌పై తెలంగాణ అధికారులతో సమావేశం కానుంది. ఆలోపే ఛత్తీస్‌గఢ్ నుంచి ఎన్‌వోసీ అందే అవకాశాలు ఉన్నాయి.