Sammakka Sagar Project: సమ్మక్క సాగర్ అనుమతికి 2 నెలలు ఆగాల్సిందే!
ABN , Publish Date - Sep 25 , 2025 | 05:22 AM
సమ్మక్కసాగర్ తుపాకులగూడెం ప్రాజెక్టుకు అనుమతుల కోసం మరికొంత సమయం పట్టొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు...
ప్రాజెక్టుపై నేడు ఢిల్లీలో సీడబ్ల్యూసీ భేటీ
హైదరాబాద్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): సమ్మక్కసాగర్ (తుపాకులగూడెం) ప్రాజెక్టుకు అనుమతుల కోసం మరికొంత సమయం పట్టొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపైనిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) జారీ చేయడానికి ఛత్తీ్‌సగఢ్ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినప్పటికీ.. ప్రాజెక్టు వల్ల కలిగే గరిష్ఠ ముంపుపై ఐఐటీ-ఖరగ్‌పూర్ ఇచ్చే నివేదిక ఆధారంగానే ఆ రాష్ట్రం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ కారణంగా ఛత్తీ్‌సగఢ్‌లో ముంపునకు గురయ్యే 170 ఎకరాలకు గాను.. ఎకరానికి రూ. 20 లక్షల చొప్పున పరిహారం చెల్లించడానికి తెలంగాణ ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసింది. మరో వైపు, గురువారం న్యూఢిల్లీలో సమ్మక్క సాగర్ ప్రాజెక్టు ఇరిగేషన్ ప్లానింగ్‌పై కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) సమావేశం కానుంది. ఈ భేటీలో సీడబ్ల్యూసీ లేవనెత్తే అనుమానాలన్నీ నివృత్తి చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది. దాంతో నెల రోజుల్లో ముంపు పరిహారం తేలితే.. మరో నెలరోజుల్లో సీడబ్ల్యూసీలోని వివిధ డైరెక్టరేట్లతో పాటు సాంకేతిక సలహామండలి(టీఏసీ) అనుమతి లభించేందుకు మార్గం సుగమం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.