Telangana High Court: ఆ భూముల సేల్‌డీడ్స్ రద్దు చెల్లదు
ABN , Publish Date - Oct 19 , 2025 | 03:39 AM
నిషేధిత జాబితాలో లేని భూముల సేల్ డీడ్స్‌ను సబ్‌రిజిస్ట్రార్ రద్దు చేయడం కుదరదని హైకోర్టు పేర్కొంది. సదరు భూములు తమవేనని ప్రభుత్వం భావిస్తే..
నిషేధిత జాబితాలో లేకపోతే రద్దు కుదరదు
ప్రభుత్వ భూములనుకుంటే టైటిల్ నిరూపించుకొనిచట్టబద్ధంగా స్వాధీనం చేసుకోవచ్చు: హైకోర్టు
రంగారెడ్డి జిల్లా బహదూర్‌గూడ గ్రామంలోని..భూముల సేల్‌డీడ్స్ రద్దుపై ధర్మాసనం తీర్పు
హైదరాబాద్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): నిషేధిత జాబితాలో లేని భూముల సేల్ డీడ్స్‌ను సబ్‌రిజిస్ట్రార్ రద్దు చేయడం కుదరదని హైకోర్టు పేర్కొంది. సదరు భూములు తమవేనని ప్రభుత్వం భావిస్తే.. సివిల్ సూట్లు, అప్పీళ్ల ద్వారా టైటిల్ నిరూపించుకోవచ్చని, తర్వాత చట్టబద్ధంగా ఆ భూములను స్వాధీనం చేసుకోవచ్చని తెలిపింది. అంతే తప్ప.. సేల్‌డీడ్స్‌ను రద్దు చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడ గ్రామంలోని భూముల సేల్‌డీడ్స్‌ను కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా సబ్‌రిజిస్ట్రార్ రద్దు చేయడాన్ని తప్పుబడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది. బహదూర్‌గూడలో సర్వే నంబర్లు 38, 54, 55, 56లోని దాదాపు 38 ఎకరాల భూములకు సంబంధించిన 17 సేల్‌డీడ్స్‌ను రద్దు చేయాలంటూ 2017లో జిల్లా కలెక్టర్ లేఖ రాయగా.. సబ్‌రిజిస్ట్రార్ సదరు సేల్‌డీడ్స్‌ను రద్దు చేస్తూ క్యాన్సలేషన్ డీడ్స్ రిజిస్ట్రేషన్ చేశారు. అయితే తమకు నోటీసు ఇవ్వకుండా ఇలా ఏకపక్షంగా పాత సేల్‌డీడ్స్ రద్దు చేయడం చెల్లదంటూ ముస్తాంగ్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్, టీవీ రత్నారావు, పి.ధీరజ్ రంగారెడ్డి తదితరులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ కె.శరత్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదిస్తూ.. సేల్ డీడ్స్ రద్దు చేసేందుకు, క్యాన్సలేషన్ డీడ్స్ ప్రజెంట్ చేసేందుకు తహసీల్దార్‌కు అర్హత లేదన్నారు. తహసీల్దార్ కాంపిటెంట్ అథారిటీ కాదని పేర్కొన్నారు. ఎలాంటి కోర్టు డిక్రీ లేదా ప్రభుత్వ ఆదేశాలు లేకుండా క్యాన్సలేషన్ డీడ్స్ రిజిస్ర్టేషన్ చేసే అధికారం సబ్‌రిజిస్ర్టార్‌కు లేదని తెలిపారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలివ్వడం, తహసీల్దార్ క్యాన్సలేషన్ డీడ్స్ ప్రజెంట్ చేయడం, వాటిని సబ్‌రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేయడం ఏకపక్షమని, ఎలాంటి అథారిటీ లేకుండా ఈ ప్రక్రియ చేపట్టారని పేర్కొన్నారు. ఎంపిక చేసుకుని మరీ తమ సేల్ డీడ్స్‌ను రద్దు చేశారని ఆరోపించారు. అవే సర్వే నంబర్లలో డ్రీమ్ ఇండియా అనే కంపెనీ పేరిట 148 ఎకరాలు ఉందని, కానీ, ఆ సేల్‌డీడ్స్‌ను మాత్రం రద్దు చేయడానికి అధికారులకు ధైర్యం రాలేదని తెలిపారు.
నిషేధిత జాబితాలో ఉంటేనే..
రెవెన్యూ శాఖ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ప్రభుత్వ రెవెన్యూ రికార్డులు, సప్లిమెంటరీ సేత్వార్, న్యూ విలేజ్ మ్యాప్ ప్రకారం బహదూర్‌గూడ గ్రామంలోని సర్వే 28 నుంచి 62 వరకు ఉన్న 650 ఎకరాల భూములు ప్రభుత్వ భూములని పేర్కొన్నారు. అందుకే 17 సేల్‌డీడ్స్‌ను రద్దు చేయాలని కోరినట్లు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. రిజిస్ట్రేషన్ యాక్ట్ -1908 సెక్షన్ 22ఏ (నిషేధిత జాబితా)లో ఉన్న భూము ల సేల్‌డీడ్స్‌ను మాత్రమే రద్దు చేయాలని కోరే అధికారం రెవెన్యూ అధికారులకు ఉంటుందని పేర్కొంది. ప్రస్తుత కేసుల్లోని భూములు నిషేధిత జాబితాలో లేవన్న విషయాన్ని అధికారులు మరచిపోయారని వ్యాఖ్యానించింది. ఈ మేరకు పిటిషన్లను అనుమతించిన ధర్మాసనం.. సేల్‌డీడ్స్ రద్దు చేస్తూ రిజిస్టర్ చేసిన క్యాన్సలేషన్ డీడ్స్‌ను కొట్టేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం లేదా కలెక్టర్, రెవెన్యూ అధికారులు ఆ భూములపై టైటిల్ నిరూపించుకోవడానికి చర్యలు తీసుకోవచ్చని, సివిల్ సూట్లు, అప్పీళ్లు కొనసాగించవచ్చని పేర్కొంటూ తీర్పు ఇచ్చింది.