CM Revanth Reddy Warns Govt Employees: తల్లిదండ్రులను పట్టించుకోకపోతే..జీతంలో కోత
ABN , Publish Date - Oct 19 , 2025 | 04:03 AM
ఉద్యోగులూ.. తల్లిదండ్రులను సంరక్షించుకోవడం.. పుట్టి పెరిగిన ఊరును అభివృద్ధి చేసుకోవడం మన బాధ్యత. రక్తం చెమటగా...
10-15% కట్ చేసి వారి ఖాతాలో వేస్తా.. ఈ మేరకు త్వరలో చట్టం కూడా తీసుకొస్తాం
ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం హెచ్చరిక.. త్వరలో గ్రూప్-3, 4 ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడి
783 మందికి గ్రూప్-2 నియామక పత్రాల అందజేసిన రేవంత్‌రెడ్డి
ప్రభుత్వం వచ్చి రెండేళ్లైనా కొందరి పనిలో మార్పు లేదు.. ఏ దశలోనూ ఫైళ్లు ఆగిపోవద్దు
సీఎస్, ముఖ్య కార్యదర్శులతో సమీక్షలో ముఖ్యమంత్రి అసంతృప్తి
హైదరాబాద్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ‘‘ఉద్యోగులూ.. తల్లిదండ్రులను సంరక్షించుకోవడం.. పుట్టి పెరిగిన ఊరును అభివృద్ధి చేసుకోవడం మన బాధ్యత. రక్తం చెమటగా మార్చి మిమ్మల్ని ఇంతవాళ్లను చేసిన తల్లిదండ్రులను మరిచిపోవద్దు. ఉద్యోగులు ఎవరైనా వారి తల్లిదండ్రులను పట్టించుకోకపోతే.. వారి జీతంలో నుంచి 10-15 శాతం కోత విధిస్తా. ఆ మొత్తాన్ని వారి తల్లిదండ్రుల ఖాతాలో వేస్తా. ఒకటో తేదీన మీకు జీతం ఎలా వస్తుందో.. అలాగే ఆ మొత్తం మీ తల్లిదండ్రుల ఖాతాలో కూడా ఒకటో తేదీనే పడుతుంది. ఈ మేరకు త్వరలో చట్టం తీసుకొస్తాం’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ మీరు సామాన్యులని, ఈరోజు నుంచి అధికారులని, బాధ్యతను సమర్థంగా నిర్వహించి ‘రైజింగ్ తెలంగాణ 2047’ విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా నిలపాలని నిర్దేశించారు. నిస్సహాయులకు సహాయం చేయాలని, పేదలకు అండగా నిలవాలని ఉద్బోధించారు. గ్రూప్-2కు ఎంపికైన 783 మందికి శిల్పకళా వేదికలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడారు. ‘‘హాస్టళ్లలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయితే బీఆర్‌ఎస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారు. సెంటిమెంట్‌తో మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ప్రమాద ఘటనలు జరగకుండా.. ఫుడ్ పాయిజన్‌తో ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా చూడాలి. సమర్థంగా పని చేసి ఆదర్శంగా నిలవాలి’’ అని దిశానిర్దేశం చేశారు.
అల్లుడిని అంబానీ.. బిడ్డను బిర్లా
పదేళ్లు అధికారంలో ఉండి ఆ పెద్ద మనిషి (కేసీఆర్) చేసిన పాపాల పుట్ట పగులుతోందని సీఎం రేవంత్ అన్నారు. ఆయన కుటుంబం, బంధు వర్గమంతా ఆగర్భ శ్రీమంతులు కావాలని, సంపదలో నిజాం నవాబుతో పోటీ పడాలన్న లక్ష్యంతో కేసీఆర్ పని చేశారని, అల్లుడిని అంబానీ, బిడ్డను బిర్లా చేయాలని కలలు కంటూ.. పదేళ్ల పాలన కొనసాగించారని ధ్వజమెత్తారు. వాళ్ల దోపిడీ గురించి తాము చెప్పడం లేదని, వాళ్ల కుటుంబ సభ్యులే చెబుతున్నారని వ్యాఖ్యానించారు. నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసినందున గత ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఒక్కో రేవంత్ అయ్యారని, అందుకే, బీఆర్‌ఎస్ ఓటమి పాలైందని తెలిపారు. ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు కేసులు వేసిన గతపాలకులు.. అక్రమ సంపాదనతో ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియా వ్యవస్థతో తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ఎనిమిదేళ్ల క్రితమే జరగాల్సింది..
‘‘పదేళ్లు అధికారంలో ఉండి నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేదు. నిద్ర పోయే ముందు ఒక్క క్షణమైనా గుండెల మీద చేయి పెట్టుకుని రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య వంటి వారిని గుర్తుచేసుకుంటే.. ఈ నియామకాలు ఏడెనిమిది సంవత్సరాల కిందటే జరిగి ఉండేవి’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయిన కూతురికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన కేసీఆర్.. కుటుంబ సభ్యులందరికీ ఏదో ఒక పదవిని అప్పచెప్పారని, కానీ, రాష్ట్రం కోసం పోరాడిన నిరుద్యోగులను నట్టేట ముంచారని మండిపడ్డారు. 2015లో ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్‌ను 2025 వరకూ పూర్తి చేయలేదంటే.. నిరుద్యోగుల పట్ల గత ప్రభుత్వ ప్రాధాన్యం ఏమిటో తెలుస్తుందని విమర్శించారు. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో 2011లో గ్రూప్-1 నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత మేం వచ్చేంత వరకూ భర్తీ (2025లో) చేయలేదు. ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? పదేళ్లపాటు నియామకాలు జరగలేదు. దీంతో, నిరుద్యోగుల గుండెలు పగిలినా గత పాలకులు పట్టించుకోలేదు’’ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత పాలకుల హయాంలో ప్రశ్న పత్రాలు పల్లీ బటానీల్లా జిరాక్స్ సెంటర్లలో వెలుగుచూశాయని తప్పుబట్టారు. ‘‘రూ.3 కోట్లు తీసుకుని గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చారని గత పాలకులు ఆరోపించారు. పేదింటి బిడ్డలు రూ.3 కోట్లు ఇచ్చి ఉద్యోగం కొనగలరా!? కష్టపడి చదివిన వారిని అవమానించేలా మాట్లాడారు’’ అని మండిపడ్డారు. దీనిపై ఉద్యోగాలు పొందిన వారు తమ ఆర్థిక పరిస్థితిని వివరించారని, కనీసం ఉండేందుకు పక్కా ఇల్లు లేని నిరుపేదలు ఈసారి గ్రూప్-1కి ఎంపికయ్యారని తెలిపారు. రాజకీయంగా చౌకబారు ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు చాలా ఆవేదన కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతపాలకులు నీళ్లు, నిధులు, నియామకాల గురించి చిత్తశుద్ధితో పని చేసి ఉంటే.. కాళేశ్వరం కూలేశ్వరం అయ్యేది కాదని మండిపడ్డారు. లక్ష కోట్లు గోదావరిలో పోసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును కట్టడం, కూలడం మూడేళ్లలోనే జరిగిపోయిందని, ఇలాంటి పరిస్థితి దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఏ దేశంలోనూ లేదని ధ్వజమెత్తారు. ఫాం హౌ్‌సలో పంటలతో ఎకరానికి రూ.కోటి సంపాదించానని చెప్పిన కేసీఆర్.. ఆ విద్యను రాష్ట్ర రైతులకు ఎందుకు చెప్పలేదని తప్పుబట్టారు. 64 కళల్లో చోర కళ కూడా ఒకటని కేసీఆర్ ద్వారా తెలిసిందని, ఆ విషయాన్ని ఆయన నిరూపించారని విమర్శించారు.
త్వరలో గ్రూప్-3, గ్రూప్-4 ఫలితాలు
ఉద్యోగాలను భర్తీ చేయడమే ప్రధాన లక్ష్యంగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. దసరాకు ముందు 562 మందికి గ్రూప్-1 నియామక పత్రాలు అందించామని, ఇప్పుడు దీపావళికి ముందు 783 మందికి గ్రూప్-2 నియామక పత్రాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ పరీక్ష రాసిన 2 లక్షల మందిలో ఎంపికైన మీరంతా మట్టిలో మాణిక్యాలని, తెలంగాణ పునర్నిర్మాణంలో అంకితభావంతో శ్రమించాలని పిలుపునిచ్చారు. ఖాళీలు మిగలకూడదని ముందుగా గ్రూప్-1 ఫలితాలు ఇచ్చి.. ఇప్పుడు గ్రూప్-2 ఫలితాలు విడుదల చేశామని, త్వరలోనే గ్రూప్-3, గ్రూప్-4 ఫలితాలనూ విడుదల చేస్తామని వెల్లడించారు. ఇవన్నీ కలిపితే 11 వేల ఉద్యోగాలు అవుతాయని, తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని వివరించారు.