Share News

సాగర్‌ నీటిమట్టం 558.70 అడుగులు

ABN , Publish Date - Jul 17 , 2025 | 12:30 AM

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద రాక నిలకడగా కొనసాగుతోంది.

సాగర్‌ నీటిమట్టం 558.70 అడుగులు

నాగార్జునసాగర్‌/మిర్యాలగూడ/కేతేపల్లి/సూర్యాపేటరూరల్‌, జూలై 16(ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద రాక నిలకడగా కొనసాగుతోంది. బుధవారం ఎగువ నుంచి 65,900 క్యూసెక్కుల వరద రాగా, సాగర్‌ నీటిమట్టం 558.70 అడుగులకు చేరింది. సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు)కాగా, బుధవారం సాయంత్రం 558.70 అడుగులు (229.3671 టీఎంసీలు) సాగర్‌ నుంచి ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1,650 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌ నుంచి కుడి, ఎడమ, వరద కాల్వలకు, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రానికి ఎలాంటి నీటి విడుదల లేదు.

18 నుంచి మూసీ కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల

మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ఆయకట్టులోని 30వేల ఎకరాల్లో వానాకాలం పంటల సాగుకు ఈ నెల 18నుంచి నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు డీఈ చంద్రశేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18నుంచి నాలుగు విడతలుగా ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయడానికి షెడ్యూలు సిధ్ధం చేశామన్నారు. మొదటి విడత 25రోజుల పాటు మిగిలిన మూడు విడతలు 15రోజుల చొప్పున కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల ఉంటుందని వివరించారు. కాల్వలకు విడుదలైన నీటితో కేవలం ఆయకట్టు రైతులు మినుములు, పొద్దుతిరుగుడు, వేరుశనగ వంటి ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయాలని సూచించారు. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల మొదటి జోన్‌లో ఉన్న 1687ఎకరాల్లో మాత్రమే వరి సాగుకు అనుమతులు ఉన్నాయన్నారు. ఆయకట్టు భూములకు కాకుండా ఆయకట్టేతర భూములకు కాల్వల నీటిని తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. డీఈ విడుదల చేసిన షెడ్యూలు మేరకు నీటి విడుదల తేదీలు ఇలా ఉన్నాయి.

మొదటి తడి ఈ నెల 18నుంచి ఆగస్టు 12వరకు 25రోజులు... 15రోజుల విరామం

రెండవ తడి ఆగస్టు 27నుంచి సెప్టెంబర్‌ 11వరకు 15రోజులు.. 15రోజుల విరామం

మూడో తడి సెప్టెంబరు 26నుంచి అక్టోబరు 11వరకు 15రోజులు.. 15రోజుల విరామం

నాలుగో తడి అక్టోబరు 26నుంచి 15రోజులు/ప్రాజెక్టులో నీరు అందుబాటులో ఉన్నంత వరకు

దీంతో నీటి విడుదల, విరామం కలిపి మొత్తంగా 115రోజుల పాటు ఆయకట్టుకు కాల్వల ద్వారా నీరు విడుదలకానుంది.

18న ఎడమకాల్వకు నీటి విడుదల

నాగార్జునసాగర్‌ ఎడమకాల్వకు ఈ నెల 18న నీరు విడుదల చేస్తామని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులతో వరి నారు మడులు ఎండవేడిమికి చనిపోతున్నా యన్నారు. ఆయకట్టు రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎన్‌ఎస్పీ అధికారులతో చర్చించి నారుమడులు తడుపుకునేందుకు, భూగర్భ జలాల పెంపునకు వారం నుంచి పది రోజులు పాటు ఎడమకాల్వకు నీటిని విడుదల చేసేందుకు నిర్ణయించిందన్నారు. కాగా మెయిన్‌ కెనాల్‌పై తడకమళ్ల వద్ద గేట్లకు దిగువన కాల్వ మరమ్మతుల పనులు జరుగుతున్నందున అక్కడి వరకు నీటివిడుదల చేయాలని యోచిస్తున్నట్లు తెలి పారు. రైతుల అవసరాలు తీర్చే విధంగా ప్రభుత్వం పని చేస్తోందని ఆయన అన్నారు.

Updated Date - Jul 17 , 2025 | 12:30 AM