Share News

Sleeper Buses in India: కదిలే శవపేటికలు..!

ABN , Publish Date - Oct 25 , 2025 | 05:41 AM

నిన్న రాజస్థాన్‌లో.. నేడు కర్నూలులో.. స్లీపర్‌ బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. పదుల సంఖ్యలో ప్రజలు సజీవ దహనం అయ్యారు....

Sleeper Buses in India: కదిలే శవపేటికలు..!

  • స్లీపర్‌ బస్సుల నిర్మాణంలోనే లోపాలు.. సౌకర్యాలు ఘనం.. భద్రత శూన్యం

  • ప్రమాదం జరిగితే బయటపడడం కష్టమే

  • స్లీపర్‌ బస్సులను నిషేధించాలంటున్న నిపుణులు

హైదరాబాద్‌/సిటీ, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): నిన్న రాజస్థాన్‌లో.. నేడు కర్నూలులో.. స్లీపర్‌ బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. పదుల సంఖ్యలో ప్రజలు సజీవ దహనం అయ్యారు. ఈ నేపథ్యంలో స్లీపర్‌ బస్సుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. వారాంతం వచ్చిందంటే చాలు.. హైదరాబాద్‌ నుంచి విజయవాడ, విశాఖపట్నం, బెంగళూ రు.. ఇలా 300-1000 కిలోమీటర్ల దూరాలకు స్లీపర్‌ బస్సు ల్లో ప్రయాణించేవారు ఎంతో మంది. హైదరాబాద్‌ నుంచి వెళ్లే ప్రతి పది ట్రావెల్స్‌ బస్సుల్లో 8 స్లీపర్‌లే ఉంటున్నాయి. వాటిలోనూ సీటర్‌ కమ్‌ స్లీపర్‌ బస్సులే ఎక్కువ. అలసట లేకుండా ఎంత దూరమైనా ప్రయాణించవచ్చనే కారణంతో ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. కానీ, నిపుణులు మాత్రం ఈ బస్సులను ‘నడిచే శవపేటికలు’గా అభివర్ణిస్తున్నారు. మన రోడ్ల డిజైన్‌కు ఏ మాత్రం సరిపడని మల్టీ యాక్సిల్‌ బస్సులే కాదు, స్లీపర్‌ బస్సుల డిజైనింగ్‌ లోపాలు ప్రయాణికులకు శాపాలని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా పలు స్వచ్ఛంద సంస్థలు, నిపుణులు ఈ తరహా బస్సులను నిషేధించాలని డిమాండ్‌ చేస్తే.. బెదిరింపులు, ఛీత్కారాలు తప్ప ఫలితం లేదని ఆరోపిస్తున్నారు. అధిక శాతం బస్సుల నిర్వాహకులకు రాజకీయ నాయకుల అండదండలు ఉండడమో, వారే ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నిర్వాహకులు కావడమో దీనికి ప్రధాన కారణం. చైనా, జర్మనీలాంటి దేశాలు ఈ విషయంలో ఆదర్శనీయమని అంటున్నారు. మన దేశంలో ఉన్న పరిస్థితులే చైనాలోనూ ఉన్నాయని, స్లీపర్‌ క్లాస్‌ బస్సు ల నియంత్రణలో వారు అనుసరించిన విధానం ఆచరణీయమని చెబుతున్నారు.


సౌకర్యాలున్నాయ్‌.. భద్రతే లేదు..: స్లీపర్‌ క్లాస్‌ బస్సులన్నీ కూడా రెండతస్తుల తరహాలో ఉంటాయి. ఒక్కో బస్సులో కనీసం 30 నుంచి 42 సీట్ల వర కూ ఉంటున్నాయి. కొన్నింటిలో ఎక్కువే ఉంటాయి. ఒకప్పు డు మనకంటే అధికంగా స్లీపర్‌ బస్సులు కలిగిన చైనా ఇప్పుడు వాటిని వదిలించుకోవడానికి కారణం భద్రతా లోపాలే. 2013కు ముందు చైనాలో దాదాపు 37 వేల స్లీపర్‌ బస్సులు ఉండేవి. కానీ, ఇప్పుడు కొత్తగా ఒక్క స్లీపర్‌ బస్సు రోడ్డెక్కడం లేదు. ఆ బస్సుల్లోని భద్రతా లోపాలపై కఠిన చర్యలు తీసుకోవడమే దీనికి కారణం. ఈ బస్సుల్లో ఛాసిస్‌ కిందకు ఉండడం, బెడ్స్‌ డిజైన్‌లో లోపాలు, గ్యాంగ్‌ వే(ప్రయాణికు లు నడిచే మార్గం) ఇరుకుగా ఉండడం, అత్యవసర ద్వారాలు తక్కువగా ఉండడం వంటివి ప్రధాన సమస్యలుగా గుర్తించారు. దీనికి తోడు ఈ బస్సుల ఎత్తు ఎక్కువగా ఉండడం, 100-120 కి. మీ. వేగంతో వెళ్లడం, ఏదైనా ఘటన జరిగితే గురుత్వాకర్షణ(సెంటర్‌ ఆఫ్‌ గ్రావిటీ) సమస్యల కారణంగా బస్సులోని ప్రయాణికులు విసిరివేసిన ట్లు పడిపోవడం వంటి ఎన్నో సమస్యలను గుర్తించారు. ఈ బస్సుల్లో అత్యవసర ద్వారాలు లేకపోవడం వల్ల ప్రమాదాల బారిన పడినప్పుడు ప్రయాణికులను కాపాడడం కష్టమే. ఇక ఈ బస్సు లు దాదాపు 3 మీటర్ల ఎత్తున ఉండడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు లోపల ఉన్నవారు బయటకు దూకడం కూ డా కష్టంగానే ఉంటుంది. చైనా దశల వారీగా నిషేధం విధించిన తర్వాత భారత్‌లో కూడా ఆటోమోటివ్‌ రిసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఏఆర్‌ఏఐ) 2016లో స్లీపర్‌ బస్సులకు సంబంధించి కొన్ని నిబంధనలు, ప్రమాణాలను తీసుకొచ్చింది. ఏఆర్‌ఏఐ మార్గదర్శకాల ప్రకారం.. 2+1 లేఔట్‌ను స్లీపర్‌ బస్సుల్లో అనుమతించింది. దేశంలో దాదాపు 80ు స్లీపర్‌ లేదంటే హైబ్రిడ్‌ బస్సులు ఈ లేఔట్‌లోనే ఉన్నాయి. కానీ, నిర్దేశిత ప్రమాణాల ప్రకారం లేవన్నది ఎక్కువ మంది వాదన. మన దేశంలో ఈ బస్సులు సాధారణంగా 12 మీటర్‌, 13.5, 15 మీటర్‌ పరిమాణంలో వస్తుంటా యి. స్లీపర్‌ బస్సుల్లో బెర్త్‌ కచ్చితంగా 70.8 అంగుళాల పొడ వు ఉండాలి. అలాగే 12 మీటర్లలోపు పొడవు కలిగిన బస్సుల్లో కనీసం నాలుగు అత్యవసర ద్వారాలుండాలి. 12 మీటర్లు దాటితే 5 ఉండాలి. వాటిని ప్రతి ఒక్కరూ గుర్తు పట్టేలా ఏర్పాటు చేయాలి. ప్రతి సీటు పక్కన సుత్తిని కూడా ఫిట్‌ చేసి ఉంచాలి. కానీ, వాటిలో ఏ ఒక్కటీ అమలు కావడం లేదని, పర్యవేక్షణ కూడా లేదని చెబుతున్నారు.


ఇతర దేశాల్లో ఎలా ఉందంటే..

జర్మనీలో 2006లోనే స్లీపర్‌ కోచ్‌లను నిషేధించారు. ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు బయటకు విసిరేసినట్లు పడడం, సీటు బెల్టు పెట్టుకునే అవకాశాలు లేకపోవడం వంటి వాటిని కారణాలుగా చెప్పారు. 2010లో ఈయూ చట్టాన్ని ఉల్లంఘించిందంటూ ఓ ఆపరేటర్‌ కోర్టుకు ఆశ్రయించాడు. అతని అప్పీల్‌ను కోర్టు తిరస్కరించింది. యూరోపియన్‌ దేశాల్లో కూడా స్లీపర్‌ బస్సులు కనిపించవు. అక్కడ విస్తృత రైల్‌ నెట్‌వర్క్‌తోపాటు నిబంధనలు కఠినంగా ఉండడం తో స్లీపర్‌ బస్సులు ఉండవు. అమెరికాలో కూడా స్లీపర్‌ బస్సు లు కనిపించవు. అమెరికన్లు బస్సుల్లో ప్రయాణించడానికి పెద్దగా ఇష్టపడరు. స్లీపర్‌ బస్సులో ప్రయాణించడం కంటే విమానంలో వెళ్లడమే తక్కువ ఖర్చని భావిస్తారు.

Updated Date - Oct 25 , 2025 | 05:41 AM