Share News

VC Sajjanar: రహదారి భద్రతకు సేఫ్‌ రైడ్‌ చాలెంజ్‌

ABN , Publish Date - Oct 14 , 2025 | 02:20 AM

రహదారి భద్రతపై అవగాహన పెంచడానికి, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడాన్ని ఒక ట్రెండ్‌గా మార్చడానికి హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌....

VC Sajjanar: రహదారి భద్రతకు సేఫ్‌ రైడ్‌ చాలెంజ్‌

  • సోషల్‌ మీడియాలో ప్రారంభించిన సీపీ సజ్జనార్‌

  • సీట్‌బెల్ట్‌ ధరించి ముగ్గురికి చాలెంజ్‌ ఇవ్వాలన్న సీపీ

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): రహదారి భద్రతపై అవగాహన పెంచడానికి, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడాన్ని ఒక ట్రెండ్‌గా మార్చడానికి హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ‘సేఫ్‌ రైడ్‌ చాలెంజ్‌’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సేఫ్‌రైడ్‌ చాలెంజ్‌ను సోషల్‌ మీడియాలో సోమవారం ప్రారంభించారు. యువతలో ట్రాఫిక్‌ రూల్స్‌, సురక్షితమైన డ్రైవింగ్‌ పద్ధతులపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని సజ్జనార్‌ వెల్లడించారు. ప్రతి ఒక్కరి ప్రయాణం భద్రతతో కూడిన నిర్ణయంతోనే మొదలవుతుందని పేర్కొన్నారు. నగర పౌరులంతా ఈ చాలెంజ్‌లో ఉత్సాహంగా పాల్గొని, ఒకరి నుంచి మరొకరు స్ఫూర్తి పొంది, రహదారి భద్రతను 2025లో ఒక ట్రెండ్‌గా మారుద్దామని ఆయన ఆకాంక్షించారు. సీటు బెల్ట్‌ తప్పనిసరిగా పెట్టుకోవడం, హెల్మెట్‌ కచ్చితంగా ధరించడం, ఇతరులకు స్ఫూర్తినివ్వడం వంటి మూడు ముఖ్యమైన సూత్రాలను ఈ కార్యక్రమం గుర్తు చేస్తుందని చెప్పారు. ఈ డిజిటల్‌ చాలెంజ్‌ ద్వారా హైదరాబాద్‌ నగరంలో భద్రత, బాధ్యతతో కూడిన ప్రయాణ సంస్కృతిని నిర్మించాలని సీపీ సజ్జనార్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు.

చాలెంజ్‌ స్వీకరించడం ఎలా?

వాహనదారులు తమ ప్రయాణం ప్రారంభించే ముందు హెల్మెట్‌ ధరించడం, సీట్‌ బెల్ట్‌ పెట్టుకోవడం వంటి ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తున్నట్లుగా ఒక చిన్న ఫొటో లేదా వీడియో తీసుకోవాలి. ఆ ఫొటోను సోషల్‌ మీడియాలో ‘సేఫ్‌రైడ్‌ చాలెంజ్‌’ అనే హ్యాష్‌ ట్యాగ్‌తో పోస్టు చేయాలి. ముగ్గురు స్నేహితులకు లేదా బంధువులకు ఈ చాలెంజ్‌ను స్వీకరించాలని ట్యాగ్‌ చేయాలి. అలా ప్రతి ఒక్కరూ తమ స్నేహితులు ఇచ్చిన చాలెంజ్‌ను స్వీకరించి వైరల్‌ చేయాలి.

Updated Date - Oct 14 , 2025 | 02:20 AM