Share News

Sadabainama Regularization Progress Disappointing: సాదాబైనామాలకు సుస్తీ

ABN , Publish Date - Dec 23 , 2025 | 04:10 AM

రాష్ట్రంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీ క్షేత్రస్థాయిలో ....

Sadabainama Regularization Progress Disappointing: సాదాబైనామాలకు సుస్తీ

  • సర్వేనంబర్లు 11 లక్షలు.. పరిష్కరించినవి 112 !

  • 32 జిల్లాల్లో 20 జిల్లాల్లో జీరో.. 12 జిల్లాల్లో అరకొరగా పరిష్కారం

  • అఫిడవిట్ల సాకుతో అధికారుల నిర్లక్ష ్యం

  • కార్యాలయాల చుట్టూ దరఖాస్తుదారుల ప్రదక్షిణలు

హైదరాబాద్‌, డిసెంబరు 22 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్రంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీ క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. దీంతో లక్షలాది మంది దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. తెల్ల కాగితాలపై క్రయవిక్రయాల ఒప్పందాలు చేసుకుని భూములు కొనుగోలు చేసినవారికి , భూభారతి చట్టం అమల్లోకి వచ్చాక సమస్య తీరుతుందని ఆశించినా.. ఫలితం కనిపించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల పరిఽధిలో సాదాబైనామాల క్రమబద్ధీకరణ కోసం 11.49లక్షల సర్వే నంబర్లకు సంబంధించి 9 లక్షల దరఖాస్తులు రాగా, ఇప్పటి వరకు పరిష్కారం లభించింది కేవలం 112 సర్వే నంబర్లకు మాత్రమే అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సీసీఎల్‌ఏ నుంచి అదనపు కలెక్టర్లకు రోజువారీ పంపుతున్న పురోగతి నివేదికలో ఈ గణాంకాలు వెల్లడయ్యాయి. జిల్లాల వారీగా పురోగతిని పరిశీలిస్తే.. 20 జిల్లాల్లో ఒక్క సర్వే నంబరుకి కూడా ఆమోదం తెలపని పరిస్థితి. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా కొన్ని దరఖాస్తులు ఆమోదం పొందినా, అవి కూడా నామామాత్రంగానే ఉన్నాయి. భూమిపై హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకున్న రైతులను అధికారులు రకరకాల సాకులతో తిప్పించికుంటున్నారు. ప్రభుత్వ భూములు ఉన్నాయని కొన్ని చోట్ల.. చలానా రశీదు లేదని మరికొన్ని చోట్ల.. అఫిడవిట్‌ సమర్పించలేదనే చిన్న చిన్న సాంకేతిక కారణాలు చూపుతూ, అధికారులు దరఖాస్తులను పెండింగ్‌లో పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.

నిజామాబాద్‌లో 66 సర్వే నంబర్లకు పరిష్కారం

రాష్ట్ర వ్యాప్తంగా సాదాబైనామా దరఖాస్తుల పురోగతిని పరిశీలిస్తే ఒక్క నిజామాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 66 సర్వే నంబర్ల ఆమోదం పొంది అగ్రస్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 25,365 దరఖాస్తులు రాగా వాటి పరిధిలో ఉన్న సర్వే నంబర్లు 30,442. ఆ తరువాత మెదక్‌ జిల్లాలో 16 సర్వే నంబర్లను అధికారులు ఆమోదించారు. నల్గొండ జిల్లాలో 8, కరీంనగర్‌ 5, జగిత్యాల 3, ములుగు 3, జయశంకర్‌ భూపాలపల్లి 3, జనగాం, యాదాద్రి భువనగిరి, ఖమ్మం జిల్లాల్లో 2 సర్వే నంబర్ల చొప్పున సూర్యాపేట, నారాయణ పేట జిల్లాల్లో 1 సర్వే నంబరు చొప్పున ఆమోదం పొందాయి. నారాయణ పేట జిల్లాలో 2,075 దరఖాస్తులకు సంబంధించి 2,674 సర్వే నంబర్లు ఉన్నాయి. వాటిలో ఇప్పటి వరకు ఒక సర్వే నంబరుకే అధికారులు ఆమోదం తెలిపారు.

Updated Date - Dec 23 , 2025 | 04:10 AM