RWS DE K Sandhyarani was caught by ACB: రూ.10వేలు లంచం తీసుకుంటూ..ఏసీబీకి చిక్కిన ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ
ABN , Publish Date - Nov 22 , 2025 | 04:38 AM
కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ కె.సంధ్యారాణి ఏసీబీకి పట్టుబడింది. ఆమెతోపాటు మరో ఉద్యోగిపైనా అధికారులు కేసు నమోదు చేశారు....
పాలకుర్తి, నవంబరు21(ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ కె.సంధ్యారాణి ఏసీబీకి పట్టుబడింది. ఆమెతోపాటు మరో ఉద్యోగిపైనా అధికారులు కేసు నమోదు చేశారు. ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ శుక్రవారం వివరాలు వెల్లడించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన కాంట్రాక్టర్ కమ్మగాని సురేష్ దేవరుప్పుల మండలంలోని చిన్నమడూరు, పెద్దమడూరు, కోలుకొండ, అప్పిరెడ్డిపల్లి గ్రామాల్లో మిషన్ భగీరథ పథకంలో పైపులైన్ పనులు చేపట్టారు. అవి పూర్తయి ఆరేళ్లు గడిచినా బిల్లుల చెల్లింపులో అధికారులు జాప్యం చేశారు. బిల్లులు మంజూరవడానికి ఎంబీ రికార్డు చేయాల్సి ఉంది. ఈమేరకు కాంట్రాక్టర్ పలుమార్లు ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ కె.సంధ్యారాణిని కోరారు. చివరకు రూ.10వేలు ఇస్తేనే రూ.1.05లక్షల బిల్లులకు అనుమతిస్తానని డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు వరంగల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శుక్రవారం సంధ్యారాణి చెప్పిన మేరకు కార్యాలయంలోని ప్రైవేటు ఉద్యోగి మహేందర్‌కు లంచం సొమ్ము ఫోన్‌పే చేసి స్ర్కీన్‌షాట్‌ను ఆమెకు పంపారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు సంధ్యారాణిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె సెల్‌ఫోన్‌తోపాటు ప్రైవేటు ఉద్యోగి మహేందర్ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.