Rural Voters: రాజధానిలో పల్లెపోరు
ABN , Publish Date - Dec 07 , 2025 | 06:52 AM
భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని ఓ పంచాయతీలో దాదాపు 2 వేల ఓట్లు ఉన్నాయి. ఈ ఓటర్లలో దాదాపు 400 మంది హైదరాబాద్‌లో నివాసముంటున్నారు.
హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో పల్లె ప్రజానీకం.. పంచాయతీ ఎన్నికల్లో వారి ఓట్లు కీలకం
ఓటర్ల కోసం నగరంలోని ఫంక్షన్ హాళ్లలో ఆత్మీయ సమ్మేళనాలు
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని ఓ పంచాయతీలో దాదాపు 2 వేల ఓట్లు ఉన్నాయి. ఈ ఓటర్లలో దాదాపు 400 మంది హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. ఆ పంచాయతీ సర్పంచ్‌గా నామినేషన్ వేసిన ఓ అభ్యర్థి ఆ 400 మందిని ప్రసన్నం చేసుకునేందుకు ఎల్‌బీనగర్‌లోని ఓ కన్వెషన్ హాల్‌లో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఫారుఖీనగర్ మండల పరిధిలోని ఓ గ్రామ పంచాయతీకి చెందిన 300మందికిపైగా ఓటర్లు హైదరాబాద్‌లో ఉంటున్నారు. సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఈ 300 మంది కోసం తమ అనుచరులతో కలిసి హైదరాబాద్‌కు చేరారు. ఓ అభ్యర్థి తమ గ్రామానికి చెందిన 80 మందికి అత్తాపూర్‌లో ఓ హోటల్‌లో గురువారం రాత్రి విందు ఇచ్చారు.
పల్లెల నుంచి హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడిన వారిలో చాలామందికి స్వగ్రామంలోనే ఓట్లు ఉంటాయి. ఈ ఓట్లు ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు కీలకంగా మారాయి. దీంతో అభ్యర్థులు హైదరాబాద్‌లో ఉంటున్న తమ ఊరి ప్రజలను వెతుక్కుంటూ వస్తున్నారు. అభ్యర్థులు లేదా వారి తరఫున ఇతర వ్యక్తులో నగరానికి వచ్చి తమ ఊరి ఓటర్ల ఇంటింటికి వెళ్లి ఓటు కోసం తలుపు తడుతున్నారు. కొందరు అభ్యర్థులు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తుండగా, మరికొందరు తమ గ్రామ ఓటర్లను ఏదో ఒక హోటల్‌కి తీసుకెళ్లి చుక్క, ముక్కతో ప్రసన్నం చేసుకుంటున్నారు. కొందరు అభ్యర్థులు ఫోన్లు చేసి ఓటు కోసం అభ్యర్థిస్తున్నారు. సూర్యపేట జిల్లా కోదాడ మండలంలోని ఓ గ్రామంలో ఒక వార్డులో 150ఓట్లు ఉండగా.. అందులో 41 మంది ఓటర్లు హైదరాబాద్‌లో ఉన్నారు. వారి కోసం సర్పంచ్ అభ్యర్థి, వార్డు మెంబర్ అభ్యర్థి తరపున కొందరు వ్యక్తులు ప్రచారానికి రాజధానికి వచ్చారు.
చుక్క, ముక్క
ఎల్‌బీనగర్, కొంపల్లి, అల్వాల్, బోడుప్పల్, సంతోష్ నగర్, జగద్గీరిగుట్ట, అత్తాపూర్, హబ్సీగూడ, కాప్రా తదితర ప్రాంతాల్లోని ఫంక్షన్‌హాల్స్‌లో గత ఆదివారం ఆత్మీయ సమ్మేళనాలు జరిగాయి. నేడు కూడా పలు చోట్ల జరగనున్నాయి. సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు ఈ సమ్మేళనానికి హాజరైన వారిని తమకే ఓటెయ్యాలని కోరుకుంటున్నారు. ఆత్మీయ సమ్మేళనాల్లో మధ్యాహ్నం మాంసాహార భోజనాలనే వడ్డిస్తున్నారు. అనంతరం కుటుంబ యజమానులకు సాయంత్రం అదే ఫంక్షన్‌హాల్‌లో మందు పార్టీలు ఇస్తున్నారు. మరికొందరు అభ్యర్థులు కులాల వారీగా ప్రత్యేకంగా విందులు ఇస్తున్నారు. కొంపల్లిలోని ప్రముఖ హోటల్‌లో సిద్దిపేట జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన సామాజిక వర్గం వారికి ఓ అభ్యర్థి విందు ఇచ్చారు. ఆ విందుకు ఓ ఎమ్మెల్యే హాజరైనట్టు తెలిసింది.
వాహనాల్లో తరలించేందుకు ప్లాన్
హైదరాబాద్‌లోని ఓటర్లను పోలింగ్‌కు తరలించేందుకు అభ్యర్థులు ప్రత్యేక వాహనాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మహబూబ్‌బాద్ జిల్లాలోని ఓ గ్రామ పంచాయతీకి చెందిన దాదాపు 300మంది ఓటర్లు యూసు్‌ఫగూడ ప్రాంతంలో ఉన్నారు. వారందరినీ ఓటింగ్‌కు తరలించేందుకు సర్పంచ్ అభ్యర్థి బస్సులు ఏర్పాటు చేశారు. తమ బస్సులో వచ్చే ఓటరుకు రూ.500తో పాటు టిఫిన్, భోజనం అందిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ఓ గ్రామానికి చెందిన 600 మంది ఓటర్లు హైదరాబాద్‌లో ఉన్నారు. సర్పంచ్ అభ్యర్థి తనయుడు వారికి ఫోన్లు చేసి మాట్లాడడమే కాక ఓటుకు రూ.వెయ్యి చొప్పున ఫోన్‌పే, గూగుల్ పే చేస్తున్నారని సమాచారం. ఇక, సొంత వాహనాల్లో వస్తే ఖర్చులు తాము భరిస్తామంటూ ఓటర్లకు మరికొందరు హామీలిస్తున్నారు.