Private School Fees: పట్టణ ప్రాంతాల్లో రూ.31,782
ABN , Publish Date - Nov 10 , 2025 | 03:38 AM
ప్రభుత్వ విద్యాసంస్థలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.వేల కోట్ల ప్రజాధనం ఖర్చు చేస్తున్నా.. కుటుంబాలపై ఆర్థిక భారం ఏమాత్రం తగ్గట్లేదని కేంద్ర ప్రభుత్వం తాజాగా...
ప్రైవేటు బడుల్లో ఏడాదికి ఒక్కో విద్యార్థిపై ఫీజు భారమిది!
పల్లెల్లో రూ.19,554.. దేశవ్యాప్త సగటు రూ.25 వేలు
ప్రభుత్వ, ప్రైవేటు.. బడి ఏదైనా 30ు మంది ట్యూషన్లకు!
ఏటికేడాదీ గణనీయంగా పెరుగుతున్న విద్యా వ్యయం
‘కేంద్ర గణాంకాల శాఖ 2025 సర్వే’లో వెల్లడి
హైదరాబాద్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ విద్యాసంస్థలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.వేల కోట్ల ప్రజాధనం ఖర్చు చేస్తున్నా.. కుటుంబాలపై ఆర్థిక భారం ఏమాత్రం తగ్గట్లేదని కేంద్ర ప్రభుత్వం తాజాగా చేసిన అధ్యయనంలో తేలింది. దేశవ్యాప్తంగా పిల్లల చదువుల కోసం కుటుంబాలు చేస్తున్న ఖర్చుపై కేంద్ర గణాంకాల శాఖ ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్యలో సర్వే గణాంకాల ప్రకారం.
దేశంలో ఒక్కో కుటుంబం ఒక విద్యార్థిపై సగటున ఏటా రూ. 25002 ఖర్చు చేస్తోంది. ఇది పట్టణాల్లో రూ. 31782, గ్రామాల్లో రూ.19554.
దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా వ్యవస్థల మధ్య వ్యత్యాసం క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికీ ఎక్కువమంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నా, పట్టణాల్లో మాత్రం ప్రైవేటు సంస్థల వైపు ఆకర్షణ ఎక్కువగా ఉంది.
గ్రామీణ ప్రాంతాల్లో 66ు మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతుండగా, 34ు మంది ప్రైవేటు బడులను ఎంచుకుంటున్నారు. పట్టణాల్లో 75.7ు మంది ప్రైవేటులోనే చదువుతుండగా, కేవలం 24.3ు మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు.
దేశంలో 56ు మంది విద్యార్థులు ప్రభుతబడుల్లో, 44ు మంది ప్రైవేటు బడుల్లో చదువుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నామమాత్రపు ఫీజులు ఉన్నా, అవి చెల్లిస్తున్న విద్యార్థుల సంఖ్య చాలా తక్కువ. దేశంలోని సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థుల్లో 26.7ు మంది మాత్రమే ఫీజు చెల్లిస్తున్నారు. మిగతా 73.3 శాతం మంది విద్యార్థులు ఎలాంటి చెల్లింపులూ చేయట్లేదు.
ప్రైవేటు విద్యాసంస్థల్లో ఇందుకు పూర్తి భిన్నమైన దృశ్యం కనిపిస్తోంది. పట్టణాల్లో 98 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 96 శాతం మంది ‘ప్రైవేటు’ విద్యార్థులు క్రమం తప్పకుండా ఫీజులు చెల్లిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి చదువు కోసం ఒక కుటుంబం ఏడాదికి సగటున రూ.2,863 ఖర్చు చేస్తోంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో రూ. 2,639 కాగా, పట్టణాల్లో రూ.4,128గా ఉంది.
ట్యూషన్లపై ఆధారపడుతున్న విద్యార్థులు
ప్రభుత్వ పాఠశాల,ప్రైవేటు బడి.. ఎక్కడ చదువుతున్న విద్యార్థులైనా ట్యూషన్‌కు వెళ్తున్నవారి సంఖ్య గణనీయంగానే ఉంటోంది. దేశవ్యాప్తంగా మొత్తం విద్యార్థుల్లో 27 శాతం మంది ట్యూషన్లకు వెళ్తున్నారు. ఐదేళ్ల క్రితం ఇది 20శాతం లోపే ఉండేది. పట్టణ ప్రాంతాల్లో ఈ సగటు 30.7 శాతం కాగా.. గ్రామీణ ప్రాంతాల్లో 25.5 శాతంగా నమోదైంది.
ప్రాథమిక పాఠశాలలో సుమారు 20ు మంది ట్యూషన్‌కెళ్తుండగా.. మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లో ఈ సంఖ్య 40 శాతానికి చేరింది.
ఉన్నత పాఠశాల విద్యార్థుల ట్యూషన్ ఖర్చు కూడా గణనీయమే. పట్టణ విద్యార్థులు ఏడాదికి సగటున రూ.9,950.. గ్రామీణ విద్యార్థులు రూ.6,384 చొప్పున ఖర్చు చేస్తున్నారు.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో తక్కువ ఫీజులు, వసతులు ఉన్నా వాటిని వాడుకోవడంలో చాలామంది ఆసక్తి చూపించట్లేదు. అదే సమయంలో.. ప్రైవేటు బడులు విద్యను వ్యాపారంగా మార్చి మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర భారం మోపుతున్నాయి. ఈ నేపథ్యంలో.. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వ పాఠశాలల నాణ్యతను పెంపొందించడం, తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచడం అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు.