Share News

Families Left Struggling After Accidents: ప్రయాణికులకు పరిహారమేది

ABN , Publish Date - Nov 04 , 2025 | 02:59 AM

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)కు చెందిన బస్సుల్లో ప్రయాణిస్తూ అనుకోకుండా ప్రమాదం జరిగితే.. బాధిత కుటుంబాలకు ఎటువంటి భరోసా లేకుండా పోతోంది...

Families Left Struggling After Accidents: ప్రయాణికులకు పరిహారమేది

  • సేఫ్టీ సెస్‌ పేరిట వసూలు చేస్తున్న ఆర్టీసీ.. ప్రతి ప్రయాణికుడి నుంచి రూ.1 వసూలు

  • అయినా ప్రయాణికులకు దక్కని బీమా ధీమా

  • బాధిత కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు

హైదరాబాద్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)కు చెందిన బస్సుల్లో ప్రయాణిస్తూ అనుకోకుండా ప్రమాదం జరిగితే.. బాధిత కుటుంబాలకు ఎటువంటి భరోసా లేకుండా పోతోంది. బస్సు ప్రమాదాల్లో ప్రయాణికులు మరణించడం ఒక విషాదమైతే.. బాధిత కుటుంబాలకు పరిహారం అందించడమన్నది ప్రహసనంగా మారింది. ఆర్టీసీలో ప్రయాణికులకు బీమా లేకపోవడమే ఇందుకు కారణం. ప్రమాదాలు జరిగి ఎవరైనా మృతి చెందితే.. అప్పటికప్పుడు ఎంతో కొంత పరిహారం చెల్లిస్తున్నారు. అదికూడా పెనువిషాదం జరిగితే రూ.5 లక్షలు, పెద్దగా వెలుగులోకిరాని ఘటనల్లో రూ.2 లక్షలు, రూ.3 లక్షలు మాత్రమే ఉంటోంది. అదే సమయంలో ఆర్టీసీ మాత్రం సేఫ్టీ సెస్‌ పేరుతో ప్రతి ప్రయాణికుడి నుంచి రూ.1 వసూలు చేస్తుంది. కానీ, బీమా విషయంలో ప్రయాణికుడికి ధీమా కల్పించేందుకు మాత్రం ఆ సొమ్మును వినియోగించడం లేదు. అదే రైల్వేలో అయితే ప్రతి ప్రయాణికుడికీ కచ్చితంగా రూ.8 లక్షల బీమా ఉంటుంది. ప్రమాదవశాత్తూ రైలు ప్రమాదం జరిగి చనిపోతే రూ.8 లక్షల బీమా పరిహారం వస్తుంది. దాంతోపాటు ప్రభుత్వం చెల్లించే పరిహారం బాధిత కుటుంబానికి అందుతుంది. బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వడంలో ఆర్టీసీకీ ప్రణాళిక ఉండాలని అనేక సంఘటనలు చెబుతున్నా.. సంస్థ ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ప్రయాణికులకు ఎలాంటి బీమా సదుపాయం కల్పించడం లేదు. ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్న సమయంలో పరిహారం ప్రకటించి చేతులు దులుపుకొంటున్నారు. నాడు కొండగట్టు ఘాట్‌రోడ్డులో బస్సు బోల్తాపడి 65 మంది ప్రయాణికుల మృతి, పలువురు గాయపడిన సందర్భంలో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడ్డవారికి రూ.2.50 లక్షలు పరిహారంగా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. కానీ, పరిహారం కోసం బాధిత కుటుంబాలు ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. తాజా ప్రమాదంలోనూ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడ్డవారికి రూ.2 లక్షలు పరిహారం ప్రకటించింది. అయితే ఈ పరిహారాన్ని పేరుకు ప్రభుత్వం ప్రకటించినా.. ఆ మొత్తం ఆర్టీసీ నుంచే చెల్లిస్తారు. ఇలా పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వం స్పందించి పరిహారం ప్రకటిస్తున్నా.. తరచూ జరిగే ప్రమాదాల్లో ఒకరు, ఇద్దరు మృతి చెందితే వారికి అందే పరిహారం కూడా నామమాత్రంగానే ఉంటోంది. ఫలితంగా అయిన వారిని కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక భరోసా లేకుండా పోతోంది.


ప్రయాణికుల నుంచి సేఫ్టీ సెస్‌ వసూలు..

తరచూ ఎక్కడో ఒకచోట జరుగుతున్న ప్రమాదాల కారణంగా మృతుల కుటుంబాలు, బాధితులకు అందించే పరిహారాన్ని ఆర్టీసీ ప్రయాణికుల నుంచే వసూలు చేస్తోంది. గతంతో పోలిస్తే ఆర్టీసీ ప్రమాదాల సంఖ్య పెరగడం, పరిహారం చెల్లింపు సంస్థకు ఆర్థికభారంగా మారడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ప్రతి లక్ష కిలోమీటర్లకు 0.6 శాతంగా ఉన్న ప్రమాదాల తీవ్రత.. ఐదేళ్లుగా క్రమంగా పెరుగుతోంది. 2022లో ప్రతి లక్ష కిలోమీటర్లకు 0.7 శాతానికి పెరిగింది. 2022లో ఆర్టీసీ బస్సు ప్రమాదాల్లో మృతి చెందినవారి కుటుంబాలు, గాయపడ్డ వారికి సంస్థ 24.21 కోట్ల పరిహారం చెల్లించింది. ఇలా ఏటా పరిహారం చెల్లింపు ఆర్టీసీకి అదనపు భారంగా మారడంతో ప్రయాణికుల నుంచే ఆ మొత్తాన్ని రాబడుతోంది. ఇందుకోసం ప్రతి ప్రయాణికుడి నుంచి సేఫ్టీ సెస్‌ పేరుతో డబ్బులు వసూలు చేస్తోంది. 2022 మార్చిలో అప్పటి ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఇందుకు సంబంధించి సర్క్యులర్‌ జారీ చేశారు. అప్పటి నుంచి గత నాలుగేళ్లుగా ఈ సేఫ్టీ సెస్‌ను వసూలు చేస్తున్నారు. అయితే ఈ విషయం బస్సు టికెట్‌పై ప్రత్యేకంగా ఎక్కడా పేర్కొనరు. అన్ని ఆర్టీసీ బస్సుల్లో సగటున ప్రతి రోజూ 6 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఈ లెక్కన రోజూ రూ.6 లక్షల చొప్పున ఏడాదికి రూ.21.90 కోట్లు ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నారు.ప్రమాదాలు జరిగి మృతి చెందినవారి కుటుంబాలతోపాటు గాయపడ్డ వారికి పరిహారాన్ని ఈ మొత్తం నుంచే చెల్లిస్తున్నారు.

Updated Date - Nov 04 , 2025 | 02:59 AM