RTC Recruitment: ఆర్టీసీలో కొలువుల జాతర
ABN , Publish Date - Oct 08 , 2025 | 04:56 AM
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీలో కొలువుల జాతర మొదలైంది. రెగ్యులర్ పోస్టుల భర్తీలో భాగంగా డ్రైవర్, శ్రామిక్ పోస్టులకు సంబంధించి బుధవారం....
1743 పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు
ఎస్సీ అభ్యర్థులకు కొత్త ఫార్మాట్ సర్టిఫికెట్ తప్పనిసరి
హైదరాబాద్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో కొలువుల జాతర మొదలైంది. రెగ్యులర్ పోస్టుల భర్తీలో భాగంగా డ్రైవర్, శ్రామిక్ పోస్టులకు సంబంధించి బుధవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మొత్తం 1743 పోస్టులను (1,000 డ్రైవర్, 743 శ్రామిక్) భర్తీ చేసేందుకు రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు ఈ ప్రక్రియను చేపట్టింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 28 సాయంత్రం 5 గంటల వరకు గడువు ఇచ్చింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఎస్సీ (షెడ్యూల్డ్ కులాల) అభ్యర్థులకు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు కీలక సూచన చేశారు. ఎస్సీ అభ్యర్థులు తప్పనిసరిగా కొత్త ఫార్మాట్‌లో ఉన్న ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని దరఖాస్తుకు జత చేయాలని తెలిపారు. దీనిని మీ సేవ కేంద్రాలు లేదా సంబంధిత తహసీల్దార్ల నుంచి పొందవచ్చు. దరఖాస్తు సమయంలో కొత్త సర్టిఫికెట్ అందుబాటులో లేకపోతే, అభ్యర్థులు పాత సర్టిఫికెట్‌ను జత చేయవచ్చు. కానీ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో మాత్రం తప్పనిసరిగా కొత్త ఫార్మాట్‌లో ఉన్న ఎస్సీ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో వారి దరఖాస్తులను తిరస్కరిస్తామని శ్రీనివాసరావు పేర్కొన్నారు. మరోవైపు కొత్తగా వాడుకలోకి వస్తున్న విద్యుత్ బస్సుల్లో (ఈవీ బస్సులు) కూడా డ్రైవర్ల నియామకాలు జరుగుతున్నాయి. ఈ బస్సులను నడిపేందుకు ప్రైవేటు ఏజెన్సీలు చర్యలు చేపట్టాయి. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ డిపోల వారీగా అర్హులైన వారిని డ్రైవర్ పోస్టులకు ఎంపిక చేస్తున్నారు.