Hyderabad RTC: అదనపు ఆదాయంపై ఆర్టీసీ దృష్టి
ABN , Publish Date - Nov 20 , 2025 | 05:43 AM
అదనపు ఆదాయం సమకూర్చుకోవడంపై ఆర్టీసీ దృష్టి సారించింది. ఇప్పటికే బస్సు సీట్లు, సిటీ బస్సుల్లో హ్యాండిళ్లపై ప్రకటనలు ఇస్తుండగా..
బస్సులు, టికెట్లపైనా వాణిజ్య ప్రకటనలు
ప్రస్తుతం అమల్లో ఉన్న కాంట్రాక్టు విధానానికి స్వస్తి
యాడ్ ఏజెన్సీల నుంచి ప్రకటనల స్వీకరణకు కసరత్తు
హైదరాబాద్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): అదనపు ఆదాయం సమకూర్చుకోవడంపై ఆర్టీసీ దృష్టి సారించింది. ఇప్పటికే బస్సు సీట్లు, సిటీ బస్సుల్లో హ్యాండిళ్లపై ప్రకటనలు ఇస్తుండగా.. కొత్తగా బస్సుల బయటి వైపు ప్రకటనలతో ఆదాయం పొందేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం అనుసరిస్తున్న కాంట్రాక్టు పద్ధతిలో ప్రకటనలకు సంబంధించిన మొత్తాలను ఆయా సంస్థలు సకాలంలో ఆర్టీసీకి చెల్లించడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని యాడ్ ఏజెన్సీల నుంచి ప్రకటనలు స్వీకరించాలని అధికారులు భావిస్తున్నారు. ఆయా ప్రకటనలకు సంబంధించిన మొత్తాన్ని ముందుగానే తీసుకొని, సదరు యాడ్ ఏజెన్సీకి కమీషన్ చెల్లించాలని యోచిస్తున్నారు. ఈ మేరకు బస్సుల బయటి వైపు ప్రకటన బోర్డుల ఏర్పాటుకు సంబంధించిన నమూనాను సంస్థ ఎండీ వై.నాగిరెడ్డి బస్‌భవన్‌లో బుధవారం పరిశీలించారు. అలాగే, బస్సుల్లో ఇస్తున్న టికెట్ వెనుక భాగంపైనా ప్రకటనలు ముద్రించడం ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తున్నారు. మరోవైపు.. దూర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లోని ప్రయాణికులు భోజనం, టిఫిన్ చేసేందుకు ఆయా మార్గాల్లోని దాబాలు, హోటళ్ల వద్ద ఆపుతున్న విషయం తెలిసిందే. ఆయా హోటళ్లు, దాబాల నుంచి గుడ్ విల్ పొందే విషయంపైనా సమాలోచనలు చేస్తున్నారు. ఎంపిక చేసిన దాబాలు, హోటళ్లలో ఆహారం నాణ్యత, శుచి, శుభ్రత వంటి అంశాలను అధికారుల బృందం పరిశీలించి, అంతా ఓకే అనుకున్న తర్వాత వారితో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. కాగా, సోషల్ మీడియా ద్వారా ప్రయాణికులకు మరింత చేరువ కావాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. వేర్వేరు స్థాయి అధికారులు వినియోగించే ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఖాతాల్లో సమాచారం అప్‌డేట్ అయ్యేలా చూస్తున్నారు. ఇందుకోసం ఆయా స్థాయిల్లో ప్రత్యేకంగా అవగాహన, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని బస్‌భవన్ అధికారులు నిర్ణయించారు.