Share News

RTC EV Buses Struggle: ఆర్టీసీకి ఈవీ బస్సులతో తిప్పలు!

ABN , Publish Date - Nov 13 , 2025 | 05:11 AM

కాలుష్య రహిత, పర్యావరణహితమైన ప్రయాణ సదుపాయం కోసం, ఇంధన ఖర్చులు తగ్గించుకోవాలనే సదుద్దేశంతో ఆర్టీసీ విద్యుత్‌ బస్సుల...

RTC EV Buses Struggle: ఆర్టీసీకి ఈవీ బస్సులతో తిప్పలు!

  • బ్రేక్‌ డౌన్లు, నిర్వహణ సమస్యలు, ప్రమాదాలు.. ప్రయాణికులు బస్సు కోసం కాదు.. చార్జింగ్‌ కోసం నిరీక్షణ!

హైదరాబాద్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): కాలుష్య రహిత, పర్యావరణహితమైన ప్రయాణ సదుపాయం కోసం, ఇంధన ఖర్చులు తగ్గించుకోవాలనే సదుద్దేశంతో ఆర్టీసీ విద్యుత్‌ బస్సుల(ఈవీ) వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. అయితే, ఆచరణలో మాత్రం ఆశించిన ఫలితాలను పొందలేకపోతోంది. ఈ బస్సులు తరచూ రోడ్లపైనే మొరాయించడం, సాంకేతిక లోపాలు తలెత్తడం, తగినన్ని చార్జింగ్‌ స్టేషన్లు లేకపోవడం వంటి సమస్యలు ప్రయాణికులకు, ఆర్టీసీ సిబ్బందికి పెద్ద తలనొప్పిగా మారాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని వివిధ మార్గాల్లో 260 ఈవీ బస్సులు నడుస్తుండగా, మూడు నెలల్లో మరో 250 కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌కు కేంద్ర ప్రభుత్వం 2 వేల ఈవీ బస్సులు కొత్తగా కేటాయించింది. 2025 చివరి నాటికి 1,850 ఈవీ బస్సులు రోడ్డుపైకి తెచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.ప్రయాణికుల్ని ఆకర్షించేందుకు టిక్కెట్టు ధరల్లో రాయితీలు ప్రకటిస్తున్నా.. ఈవీ బస్సులకు ప్రయాణికుల నుంచి పెద్దగా ఆదరణ లభించడం లేదు. ముఖ్యంగా విజయవాడ మార్గంలో నడుపుతున్న ఈవీ బస్సులను, చార్జింగ్‌ కోసం మార్గమధ్యంలో నిలుపుతుండటంతో ప్రయాణికులు గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. ఇప్పటికే వాడుకలో ఉన్న డీజిల్‌ బస్సులతో, ఈవీ బస్సుల పనితీరును ఆర్టీసీ అధికారులు అంతర్గతంగా బేరీజు వేసుకున్నప్పుడు కూడా.. సర్వీస్‌ విషయంలో డీజీల్‌ బస్సుల పనితీరే మెరుగ్గా ఉన్నట్లు తేలింది.

ప్రమాదాలు ఇలా...

  • సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ డిపోలో చార్జింగ్‌ సమయంలో విద్యుత్‌ షాక్‌ కారణంగా ఈవీ బస్సుకు మంటలు అంటుకున్నాయి.

  • హైదరాబాద్‌-బెంగళూరు మార్గంలో ఈవీ బస్సు బ్రేక్‌ డౌన్‌ కారణంగా గంటల సమయం ప్రయాణికులు వేచి చూడాల్సి వచ్చింది.

  • వర్షంలో వైపర్‌, బ్రేకులు సరిగా పనిచేయకపోవడంతో ఈసీఐఎల్‌ మార్గంలో బస్సు డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

  • బస్సులో ఓవర్‌లోడ్‌ కారణంగా నిర్మల్‌ డిపో ఈవీ బస్సు వెనుక టైర్లు పేలిపోయాయి.

Updated Date - Nov 13 , 2025 | 05:11 AM