Share News

kumaram bheem asifabad- పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సులు

ABN , Publish Date - Jul 06 , 2025 | 10:57 PM

ఆదాయాన్ని రాబట్టి లాభాల బాట పట్టేలా అన్ని మార్గాలను ఆర్టీసీ యాజమాన్యం అన్వేషిస్తోంది. గతంలో ప్రయాణికుల సమస్యలను అంతగా పటించుకొని ఆర్టీసీ నేడు ప్రయాణికులకు చేరువయ్యేందుకు వినూత్న సేవలను ప్రవేశపెట్టడానికి ప్రణాళిక రూపొందించుకుంది.

kumaram bheem asifabad- పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సులు
ఆసిఫాబాద్‌ బస్టాండు

- ఆదాయం పెంపునకు అధికారుల చర్యలు

ఆసిఫాబాద్‌రూరల్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ఆదాయాన్ని రాబట్టి లాభాల బాట పట్టేలా అన్ని మార్గాలను ఆర్టీసీ యాజమాన్యం అన్వేషిస్తోంది. గతంలో ప్రయాణికుల సమస్యలను అంతగా పటించుకొని ఆర్టీసీ నేడు ప్రయాణికులకు చేరువయ్యేందుకు వినూత్న సేవలను ప్రవేశపెట్టడానికి ప్రణాళిక రూపొందించుకుంది. ఈ నేపథ్యంలో ఆసిఫాబాద్‌ డిపో కేంద్రం నుంచి వినోద, విహరయాత్రలకు ప్రత్యేక బస్సులను నడిపించే చర్యల్లో నిమగ్నమైంది. ఆదాయానికే పరిమితం కాకుండా ప్రయాణికుల కుటుంబాల సైతం వినోదం, విహరయా త్రలను పంపించేందుకు ప్రత్యేకంగా బస్సులను కేటాయించింది. ఇది వరకే ప్రయాణి కులను అదరించేలా ప్రతి శుక్రవారం డిపోలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నిత్యం విధులతో తీరికలేకుండా గడిపే వారికి కాలక్షేపం కోసం, తీర్థయాత్రలపై ఆసక్తి ఉన్నవారి కోసం ఆసిఫాబాద్‌ ఆర్టీసీ డిపో నుంచి ‘విహర వినోద యాత్ర’ పేరుతో బస్సు నడిపేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రయాణికులు ఎక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారన్నది తెలుసుకొని ఈ యాత్ర ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆసిఫా బాద్‌ డిపోలో మొత్తం 82 బస్సులు ఉన్నాయి. ప్రతి రోజు 78 బస్సులు ఆయా రూట్లలో 33వేల కిలో మీటర్లు తిరుగుతున్నాయి. ప్రతిరోజు 45వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. డిపోకు ప్రతిరోజు రూ. 20 లక్షల ఆదాయం సమకూరుతోంది.

- యాత్ర సాగేదిలా..

ప్రయాణికుల సౌకర్యర్థం ఆసిపాబాద్‌ ఆర్టీసీ డిపో నుంచి విహర వినోద యాత్రకు ప్రత్యేక బస్సులు వేయనున్నారు. డిపో నుంచి ఉదయం 8 గంటలకు బస్సు బయలు దేరు తుంది. యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయం చేరుతుంది. స్వామివారి దర్శనం అనంతరం బయలుదేరి స్వర్ణగిరికి చేరుతుంది. అక్కడ వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకోవచ్చు. తర్వాత రమానుజం విగ్రహం సందర్శనకు తీసుకువెళ్తారు. రాత్రి బస చేయిస్తారు. ఉదయం చిలుకూరి బాలాజీ ఆలయం చేరుకుంటుంది. దర్శనం అనంతరం తిరుగు పయనమై సాయంత్రం 4 గంటలకు ఆసిఫాబాద్‌కు చేరుకుంటుంది. ప్రతిచోట గంట, రెండు గంటల సమయాన్ని కేటాయిస్తూ ఆలయాల్లో దర్శనం అనంతరం బయలు దేరేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రయాణికులతోనే బస్సు ఉండడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మొత్తం 800 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. పెద్దలకు రూ. 2,110, పిల్లలకు రూ. 1,060 టికెట్‌ ధరలు నిర్ణయించారు. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి వెళ్లేందుకు పెద్దలకు రూ. 240, పిల్లలకు రూ. 370, గంగాపూర్‌, జోడేఘాట్‌లకు పెద్దలకు రూ. 280, పిల్లలకు రూ. 140గా నిర్ణయించారు.

ప్రయాణికులు సద్వినియోగం చేసుకొవాలి:

- రాజశేఖర్‌, డిపో మేనేజర్‌, ఆసిఫాబాద్‌

విహర వినోద యాత్రను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుతం మూడు రూట్లలో బస్సులు నడపడానికి ప్రణాళికలు రూపొందించాం. గంగాపూర్‌, జోడేఘాట్‌కు పల్లెవెలుగు, వేములవాడ, కొండగట్టు, ధర్మపురిలకు ఎక్స్‌ప్రెస్‌, యాదాద్రి, స్వర్ణగిరి, రమానుజం విగ్రహం సందర్శన, చిలుకూరి బాలాజీలకు సూపర్‌ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేశాం. గంగాపూర్‌, వేముల వాడ ప్రాంతాలకు ఒక రోజు ప్రయాణం ఉంటుంది. యాదాద్రి మాత్రం రెండు రోజుల ప్రయాణం ఉంటుంది.

Updated Date - Jul 06 , 2025 | 10:57 PM