Share News

Jangaon District: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

ABN , Publish Date - Nov 17 , 2025 | 06:06 AM

జనగామ జిల్లాలో ఆదివారం తెల్లవారుజమున ఘోర రోడ్డు ప్రమా దం జరిగింది. మరమ్మతుకు గురై రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఓ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

Jangaon District: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

  • ఇద్దరు ప్రయాణికుల మృతి.. ఆరుగురికి గాయాలు

  • జనగామ జిల్లా నిడిగొండ వద్ద ప్రమాదం

రఘునాథపల్లి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): జనగామ జిల్లాలో ఆదివారం తెల్లవారుజమున ఘోర రోడ్డు ప్రమా దం జరిగింది. మరమ్మతుకు గురై రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఓ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సులోని ఇద్దరు ప్రయాణికులు మరణించగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద వరంగల్‌ -హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నుంచి ఇసుక లోడుతో హైదరాబాద్‌ వెళ్తున్న ఓ లారీ మరమ్మతుకు గురై నిడిగొండ వంతెన దిగిన తర్వాత బస్టాండ్‌ సమీపంలో నిలిచిపోయింది. లారీ ఆగిపోయిన కొద్ది నిమిషాల వ్యవధిలో హన్మకొండ నుంచి హైదరాబాద్‌కు 16మంది ప్రయాణికులతో ఆర్టీసీ రాజధాని బస్సు అటుగా వచ్చింది. అతివేగంతో వచ్చిన ఆ బస్సు రోడ్డు మీద ఆగి ఉన్న ఇసుక లారీ వెనుక భాగాన్ని ఢీ కొట్టింది. దీంతో బస్సు ముందు భాగంలో కూర్చోని ఉన్న హైదరాబాద్‌ దోమలగూడకు చెందిన పూలమాటి ఓంప్రకాష్‌ (75), హన్మకొండ బాలసముద్రంకు చెందిన నవజీత్‌ సింగ్‌(52) ప్రాణాలు కోల్పోయారు.గుర్రపు రవికిరణ్‌, గుర్రపు స్వరాజ్యలక్ష్మి, నంద కిషోర్‌, మురళికృష్ణ, హర్షవర్ధన్‌, మరో ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అంబులెన్స్‌ల్లో జనగామ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వాహనాన్ని రోడ్డు మీదే నిలిపేసిన లారీ డ్రైవర్‌, అతి వేగంతో ఆర్టీసీ బస్సును నడిపిన డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Nov 17 , 2025 | 06:06 AM