Road Development: 4 కొత్త వంతెనలు.. 30 రోడ్ల ఉన్నతీకరణ
ABN , Publish Date - Sep 18 , 2025 | 05:09 AM
రాష్ట్రంలో 30 రహదారుల అభివృద్ధి, ఉన్నతీకరణతో పాటు ఓ నాలుగు చోట్ల బ్రిడ్జిలను నిర్మించేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది....
రూ.868 కోట్లతో 422 కి.మీ మేర రోడ్ల అభివృద్ధి
మానేరుపై హైలెవల్ బ్రిడ్జి.. నిధులిచ్చిన కేంద్రం
హైదరాబాద్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 30 రహదారుల అభివృద్ధి, ఉన్నతీకరణతో పాటు ఓ నాలుగు చోట్ల బ్రిడ్జిలను నిర్మించేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. రాష్ట్ర వ్యాప్తంగా రూ.868 కోట్లతో 422 కి.మీ, మేర రోడ్లను అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన 34 పనుల కోసం సెంట్రల్ రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్‌ఐఎఫ్) కింద కేంద్రం నిధులను మంజూరు చేసింది. ఆయా రోడ్ల వివరాలను రాష్ట్రానికి పంపింది. మొత్తం 34 పనుల్లో 4 చోట్ల నాలుగు హై లెవల్ వంతెనలు రానుండగా, మిగిలిన 30 చోట్ల రోడ్ల వెడల్పు, అభివృద్ధి చేయనున్నారు. వీటిలో కరీంనగర్ జిల్లా పరిధిలోని మానేరు నదిపై ఒక హైలెవల్ బ్రిడ్జిని రూ.77కోట్లతో నిర్మించేందుకు ఆమోదం తెలిపింది. మంచిర్యాల జిల్లా పరిధిలో టేకుమట్ల గ్రామానికి దగ్గర్లో ఉన్న ఇందారం-కుందారం రోడ్డుపై ఒకటి, కుందారం ఎస్సీ కాలనీ దగ్గర ఒకటి, కిష్టాపూర్ దగ్గర మరొకటి కలిపి మొత్తం నాలుగు బ్రిడ్జిలను మంజూరు చేసింది. వీటి కోసం రూ.20కోట్టు ఖర్చవనుంది. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి మండలంలోని అర్నకొండ నుంచి మల్యాల క్రాస్‌రోడ్ వరకు ఉన్న రోడ్డును రూ.50 కోట్లతో వెడల్పు చేసి ఉన్నతీకరించనుంది. నల్గొండ జిల్లాలోని కనగల్ క్రాస్ రోడ్డు నుంచి నాగార్జున సాగర్ క్రాస్ రోడ్డు వరకు 13.2 కి.మీ మేర రోడ్డును రూ.50 కోట్లతో ఉన్నతీకరించనుంది. కాగా, ఇటివల రాష్ట్ర ప్రభుత్వం ఈ 34 పనులను మంజూరు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో తాజాగా కేంద్రం వాటిని మంజూరు చేసింది.