Telangana Government: 30 నెలల్లో నిర్మాణం.. 15 ఏళ్ల పాటు నిర్వహణ
ABN , Publish Date - Oct 18 , 2025 | 05:09 AM
రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత రోడ్ల దశ మారనుంది. ప్రాంతాల వారీగా దెబ్బతిన్న రోడ్లు సహా పలు రహదారులన్నిటినీ హైబ్రిడ్ యాన్యుటీ మోడ్(హ్యామ్) విధానంలో...
గ్రామీణ రోడ్ల అభివృద్ధి, ఉన్నతీకరణకురూ.6,294 కోట్లతో 7,449 కి.మీ మేర పనులు
ఈ నెల 27 నుంచి టెండర్ల ఆహ్వానం
రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత రోడ్ల దశ మారనుంది. ప్రాంతాల వారీగా దెబ్బతిన్న రోడ్లు సహా పలు రహదారులన్నిటినీ హైబ్రిడ్ యాన్యుటీ మోడ్(హ్యామ్) విధానంలో అభివృద్ధి చేయడంతో పాటు కొన్నిచోట్ల ఉన్నతీకరించనున్నారు. ఈమేరకు ఆయా రోడ్లను పంచాయతీరాజ్ శాఖ అధికారులు గుర్తించారు. దాని ప్రకారం హ్యామ్ విధానంలో రోడ్ల అభివృద్ధి, ఉన్నతీకరణ కోసం ఈ నెల 27 నుంచి టెండర్లను ఆహ్వానించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశలో రూ.6,294.81 కోట్లతో 7,449.50 కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్నారు. టెండర్లను దక్కించుకున్న గుత్తేదారులు ఆయా రోడ్లను 30 నెలల వ్యవధిలో నిర్మించాలని, ఈ తర్వాత 15 ఏళ్ల పాటు నిర్వహణ చేయాలని సూచించారు.
ఉమ్మడి జిల్లాకొకటి చొప్పున 10 రోడ్లు!
రోడ్లు-భవనాల శాఖలో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్(హ్యామ్)లో అభివృద్ధి చేయదలచిన రోడ్ల పనులను త్వరితగతిన పూర్తిచేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశలో 5,566 కి.మీ మేర రోడ్లను రూ.10,547 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించిన మొత్తం 400 పనుల్లో మొదటగా కొన్నిటిని పైలెట్‌గా చేపట్టనున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా జిల్లాకొకటి చొప్పున 10 పనులను ప్రారంభించాలని, త్వరలోనే ఆయా పనులకు సంబంధించిన టెండర్లను ఆహ్వానించాలని నిర్ణయించారు. మొత్తం 32 ప్యాకేజీల పనులకు మూడు వారాల్లోగా టెండర్లను ఆహ్వానించాలని అధికారులు నిర్ణయించారు.