Tummidihatti Barrage: తుమ్మిడిహెట్టి బ్యారేజీకి 5,373 కోట్లు
ABN , Publish Date - Sep 20 , 2025 | 05:23 AM
ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి రూ.5,373 కోట్లు వ్యయం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది....
లింక్-1లో బ్యారేజీ, ఇతర పనులకు కలిపి 22,210 కోట్ల వ్యయం!
ప్రాజెక్టుకు ఇప్పటికే 7 రకాల అనుమతులు
డీపీఆర్ తయారీకి కసరత్తు
హైదరాబాద్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి రూ.5,373 కోట్లు వ్యయం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. దీనితోపాటు లింక్-1 (తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు) కెనాల్, పంపుహౌస్, ఇతర పనులకు మరో రూ.16,837 కోట్లు అవుతాయని లెక్క వేసింది. 150 మీటర్లతో బ్యారేజీ కడితే 1,467 ఎకరాల భూమి ముంపునకు గురవుతుందని.. అదే 148 మీటర్ల ఎత్తుతో కడితే ముంపు 288.01 ఎకరాల మేర ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇక 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మిస్తే జరిగే ముంపులో 11.82 ఎకరాల అటవీ భూమి ఉంటోందని గుర్తించారు. ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకానికి సంబంధించి గత ప్రభుత్వం నిలిపివేసిన పనులు/కాంపోనెంట్లను మళ్లీ చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణం కోసం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలాగైనా ఒప్పించాలని, అవసరమైతే ముంపునకు గురయ్యే 1,467 ఎకరాల భూములకు గరిష్ఠ పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకానికి సంబంధించి డీపీఆర్ తయారీ కోసం కసరత్తు ప్రారంభించింది.