Affordable Meals for All: ఆకలి లేని హైదరాబాదే లక్ష్యం!
ABN , Publish Date - Sep 30 , 2025 | 04:26 AM
పేదరిక నిర్మూలనకు కృషిచేసిన ఇందిరా గాంధీ స్ఫూర్తితో, ఆకలి బాధలు లేని హైదరాబాద్ లక్ష్యంగా ఇందిరమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర మంత్రి పొన్నం....
రూ.5కే అల్పాహారం, భోజనం
ఇందిరమ్మ క్యాంటీన్ ప్రారంభోత ్సవంలో మంత్రి పొన్నం
త్వరలో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 150 క్యాంటీన్లు : మేయర్
ఖైరతాబాద్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): పేదరిక నిర్మూలనకు కృషిచేసిన ఇందిరా గాంధీ స్ఫూర్తితో, ఆకలి బాధలు లేని హైదరాబాద్ లక్ష్యంగా ఇందిరమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సోమవారం ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్, మోతీనగర్‌లలో ఈ క్యాంటీన్లను మంత్రి ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం ఆయన స్వయంగా జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు భోజనం వడ్డించి, వారితో కలసి అల్పాహారం రుచి చూశారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఇప్పటివరకు నగరంలో అమలులో ఉన్న రూ.5 మధ్యాహ్న భోజనం పథకానికి బదులుగా, ఇకపై ఈ కొత్త ఇందిరమ్మ క్యాంటీన్లలో ఉదయం రూ.5కే పలు రకాల అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పేదలు అక్కడే కూర్చుని భుజించే సదుపాయం కూడా కల్పించామని పేర్కొన్నారు. వాస్తవానికి అల్పాహారం తయారీకి రూ.19, మధ్యాహ్న భోజనానికి రూ.30 ఖర్చవుతున్నా.. పేదలకు కేవలం రూ.5కే అందిస్తున్నామని వివరించారు. హైదరాబాద్ వ్యాప్తంగా 150 వరకు ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభిస్తామని గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతలను స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు.
ఆరు రకాల అల్పాహారాలు..
జీహెచ్‌ఎంసీ, హరే కృష మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ సహకారంతో ఈ క్యాంటీన్లు నడుస్తున్నాయి. తొలి రోజున మిల్లెట్ ఇడ్లీ, ఉప్మా, పొంగల్, పూరీ వంటి ఆరు రకాల రుచికరమైన అల్పాహారం అందించారు.