Share News

Hawala Cash Seized : సీట్ల కింద.. స్టెప్నీ టైరులో.. రూ.4.50 కోట్లు!

ABN , Publish Date - Dec 06 , 2025 | 05:38 AM

మోసం కేసులో ఇద్దరు నిందితులు పారిపోతుండగా.. బోయిన్‌పల్లి పోలీసులు వారి కారును వెంబడించారు. 125 కిలోమీటర్లు చేజ్‌ చేసి వారిని పట్టుకున్నారు...

Hawala Cash Seized : సీట్ల కింద.. స్టెప్నీ టైరులో.. రూ.4.50 కోట్లు!

  • కారులో భారీగా హవాలా సొమ్ము

  • మోసం కేసులో నిందితులను వెంబడిస్తే..

  • హవాలా డబ్బు దొరికిన వైనం

  • 125 కి.మీ. చేజింగ్‌.. ఇద్దరు అరెస్టు

అడ్డగుట్ట/బోయిన్‌పల్లి, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మోసం కేసులో ఇద్దరు నిందితులు పారిపోతుండగా.. బోయిన్‌పల్లి పోలీసులు వారి కారును వెంబడించారు. 125 కిలోమీటర్లు చేజ్‌ చేసి వారిని పట్టుకున్నారు. వారి కారును తనిఖీ చేసి విస్తుపోయారు. కారులో ఎక్కడ వెతికినా డబ్బులే!! సీట్ల కింద.. డోర్ల అరల్లో.. స్టెప్నీ టైర్‌లో.. ఇలా గుట్టుగా నోట్ల కట్టలు పెట్టేశారు. ఏకంగా రూ.4.50 కోట్ల హవాలా సొమ్మును తరలిస్తున్నారు. ఇలా ఒక కేసులో నిందితులను వెంబడిస్తే మరో కేసు బయటపడింది. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను నార్త్‌జోన్‌ డీసీపీ రష్మీ పెరుమాళ్‌ శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 2024 డిసెంబరు 7న నాగోల్‌కు చెందిన విశ్వనాథచారికి పరిచయస్తులైన గుజరాత్‌కు చెందిన ప్రకాశ్‌ మోతిబాయి ప్రజాపత్‌(30), ప్రగ్నేశ్‌ కీర్తిబాయి ప్రజాపత్‌(28)లు వ్యాపారంలో పెట్టుబడి పెడితే అదనంగా సొమ్ములు ఇస్తామని వల వేశారు. రూ.50 లక్షలు పెట్టుబడి పెడితే అదనంగా 10 లక్షలు ఇస్తామని నమ్మించారు. విశ్వనాథ్‌ వారికి రూ.50 లక్షలు ఇచ్చారు. లాభంగా ఇస్తామన్న 10 లక్షలు కలిపి మొత్తం రూ.60 లక్షలు బ్యాంకు ఖాతాకు ఆర్టీజీఎస్‌ చేస్తామని చెప్పినవారు తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన విశ్వనాథ్‌ వెంటనే బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోసం కేసు నమోదు చేసిన పోలీసులు.. డబ్బు తీసుకెళ్లిన నిందితులపై నిఘా పెట్టారు. వారు హైదరాబాద్‌ వస్తున్నారన్న సమాచారంతో పథకం వేయగా.. నిందితులు శామీర్‌పేట్‌ నుంచి ఓఆర్‌ఆర్‌ మీదుగా నగరం దాటేశారు. ఇది గమనించిన పోలీసులు.. వారి కారును వెంబడించారు. ఎట్టకేలకు మహబూబ్‌నగర్‌ జిల్లాలో నిందితులను పట్టుకున్నారు. కారులో తనిఖీ చేయగా.. రూ.4.50 కోట్ల హవాలా డబ్బు దొరికింది. ఈ డబ్బును నాగ్‌పుర్‌ నుంచి బెంగుళూరుకు తరలిస్తున్నట్లు తేలింది. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. స్వాధీనం చేసుకున్న డబ్బును ఆదాయపు పన్ను అధికారులకు అప్పగిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. హవాలా డబ్బును, నిందితులను చాకచక్యంగా పట్టుకున్న బోయిన్‌పల్లి పోలీసులను డీసీపీ రష్మి అభినందించారు.

Updated Date - Dec 06 , 2025 | 05:38 AM