Nizamabad: 2 ఏటీఎంల నుంచి 39 లక్షలు చోరీ
ABN , Publish Date - Dec 28 , 2025 | 05:59 AM
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు ఏటీఎంలను గ్యాస్ కట్టర్‌లతో కట్ చేసి వాటిలోని నగదును దోచుకెళ్లారు.
గ్యాస్ కట్టర్‌లతో ఏటీఎంలు తెరిచిన దొంగలు
నిజామాబాద్‌లో ఉదయం 3-4 గంటల మధ్య..
ఒక ఏటీఎం నుంచి 13 లక్షలు, మరొక దాని నుంచి 26 లక్షలు చోరీ
ఐదు ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు
నిజామాబాద్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు ఏటీఎంలను గ్యాస్ కట్టర్‌లతో కట్ చేసి వాటిలోని నగదును దోచుకెళ్లారు. శనివారం తెల్లవారుజామున 3-4 గంటల మధ్య చోటు చేసుకున్న ఈ ఘటనలు సంచలనంగా మారాయి. 18 నుంచి 20 నిమిషాల వ్యవధిలోనే రెండు ఏటీఎంల నుంచి దొంగలు రూ.39 లక్షలు ఎత్తుకెళ్లినట్టు తెలుస్తోంది. నగరంలోని 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి వర్ని చౌరస్తాలోని ఎస్‌బీఐ ఏటీఎం నుంచి సుమారు రూ.13లక్షలు, 4వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి పాంగ్రా ప్రాంతంలోని డెవల్‌పమెంట్ క్రెడిట్ బ్యాంకు ఏటీఎం నుంచి రూ.26 లక్షల నగదును దోచుకెళ్లినట్టు సమాచారం. గ్యాస్ కట్టర్‌లతో ఏటీఎంలను కట్ చేయడంతో మిషన్‌లు కాలిపోయాయి. అయితే నోట్లున్న క్యాసెట్‌లకు మాత్రం ఏమీ జరగకుండా దొంగలు జాగ్రత్త పడినట్టు తెలుస్తోంది.
పక్కా ప్రణాళిక ప్రకారం..!
దొంగలు పక్కా ప్రణాళిక ప్రకారం ఈ ఏటీఎంల చోరీలకు పాల్పడినట్టు తెలుస్తోంది. తమను గుర్తించకుండా ఉండటానికి వారు ముఖాలకు మాస్కులు ధరించారు. అలాగే చేతులకు గ్లౌజులు వేసుకున్నారు. కిలోమీటరునర నుంచి రెండు కిలో మీటర్ల దూరం ఉన్న ఏటీఎంలను ఎంచుకున్నారు. మరోవైపు దొంగలు నకిలీ నంబర్ ప్లేట్ గల కారులో వచ్చి దొంగతనానికి పాల్పడినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లలో కనిపించింది. ఆర్మూర్ ప్రాంతం నుంచి వచ్చి అటువైపే వెళ్లినట్లు సీసీ కెమెరాలలో రికార్డయింది. మాక్లూర్ మండలం గుత్పా అపురూప వెంకటేశ్వర ఆలయం వద్ద ఉన్న సీసీ కెమెరాలలో కారు ఆనవాళ్లు లభించాయి. అయితే అంకాపూర్ వద్ద సీసీ కెమెరాలలో వాహనం ఆచూకీ లభ్యంకాకపోవడంతో ఆ మధ్యే ఇతర మార్గం ద్వారా వెళ్లారా లేక కంటైనర్ లాంటి వాహనంలో కారును దాచారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన స్థలాలను ఇన్‌చార్జ్ సీపీ, కామారెడ్డి ఎస్పీ రాజేష్‌చంద్ర పరిశీలించారు. రెండు బ్యాంకుల మేనేజర్‌లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. జిల్లాలోకి రాకపోకలు సాగించే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మరోవైపు దొంగలను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఇన్‌చార్జ్ సీపీ తెలిపారు.