Bhatti Vikramarka: 365 కోట్ల ఉపకార వేతన బకాయిల విడుదల
ABN , Publish Date - Dec 23 , 2025 | 04:15 AM
వివిధ సంక్షేమ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఉపకార వేతనాలకు సంబంధించి ప్రభుత్వం రూ.365.84 కోట్లను విడుదల చేసింది...
ఆర్థిక ఇబ్బందులున్నా.. విద్యపై రాజీ లేదు: భట్టి
హైదరాబాద్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): వివిధ సంక్షేమ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఉపకార వేతనాలకు సంబంధించి ప్రభుత్వం రూ.365.84 కోట్లను విడుదల చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారులు సోమవారం ఈ నిధులను విడుదల చేశారు. గత ప్రభుత్వ కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదల చేశామని భట్టి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. విద్య విషయంలో ప్రభుత్వం రాజీపడబోదని స్పష్టం చేశారు. కేవలం విద్యతోనే సమాజంలో సమూల మార్పులు వస్తాయని చెప్పారు. ఆర్థిక, సంక్షేమ శాఖల అధికారులతో భట్టి సమీక్ష నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన రూ.21.62 కోట్లు, ఎస్సీ సంక్షేమ శాఖకు సంబంధించి రూ.191.63 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి రూ.152.59 కోట్లను విడుదల చేశారు.