Minister Jupalli: బాసర అభివృద్ధికి రూ.190 కోట్లు
ABN , Publish Date - Sep 11 , 2025 | 05:43 AM
నిర్మల్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని...
బాసర, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): నిర్మల్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.190 కోట్లు మంజూరు చేయనున్నారని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు బాసరలోని సరస్వతీ దేవీని బుధవారం దర్శించుకున్నారు. ఆ తర్వాత రూ.5.75 కోట్లతో బాసరలో చేపట్టిన 30 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ ప్రకారం బాసర ఆలయాన్ని అభివృద్ధి చేసి ఈ క్షేత్రాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అనంతరం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో వరద ముంపునకు గురైన బాసర మండలంలోని పొలాలను మంత్రి పరిశీలించారు.