Share News

Record Land Auction in Telangana: ఎకరానికి 177 కోట్లు!

ABN , Publish Date - Oct 07 , 2025 | 02:41 AM

ప్రభుత్వ వేలం బంగారమైంది. హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం మరోసారి రికార్డులు తిరగ రాసింది. ఓల్డ్‌ బాంబే హైవేకు, దుర్గం చెరువుకు మధ్య రాయదుర్గం ఐటీపార్క్‌లో భాగంగా ఉన్న కొండపై ఏడున్నర ఎకరాల భూమి రాష్ట్ర చరిత్రలోనే ఎరుగనంత రికార్డు స్థాయి ధరకు అమ్ముడు పోయింది..

Record Land Auction in Telangana: ఎకరానికి 177 కోట్లు!

  • రాష్ట్ర స్థిరాస్తి రంగ చరిత్రలో సరికొత్త రికార్డు

  • 7.67 ఎకరాల భూమి రూ.1357 కోట్లు.. దుర్గంచెరువు పక్కనే కొండపై భూమి

  • వేలంలో కొన్న ఎంఎ్‌సఎన్‌ రియాల్టీ.. ఎకరం 1.5 టన్నుల బంగారంతో సమానం

  • 11 ఎకరాలు రూ.1,556 కోట్లకు కొన్న ప్రెస్టీజ్‌.. ప్రభుత్వానికి 3,135 కోట్ల ఆదాయం

  • మూడేళ్ల కిందట ఎకరం వంద కోట్లు.. నాడు రాజపుష్ప కొనుగోలు చేసిందే రికార్డు

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వేలం బంగారమైంది. హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం మరోసారి రికార్డులు తిరగ రాసింది. ఓల్డ్‌ బాంబే హైవేకు, దుర్గం చెరువుకు మధ్య రాయదుర్గం ఐటీపార్క్‌లో భాగంగా ఉన్న కొండపై ఏడున్నర ఎకరాల భూమి రాష్ట్ర చరిత్రలోనే ఎరుగనంత రికార్డు స్థాయి ధరకు అమ్ముడు పోయింది.. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీజీఐఐసీ) నిర్వహించిన వేలంలో ఈ భూమిఏకంగా ఎకరానికి రూ.177 కోట్లు పలికింది. మొత్తం 7.67 ఎకరాలకు రూ.1,357 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ వేలంతో తెలంగాణ భూమి విలువ కొత్త మైలురాయి నమోదుచేసింది. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో 2022లో నిర్వహించిన కోకాపేట్‌లోని నియోపోలిస్‌ వేలంలో ఎకరానికి రూ.100.75 కోట్ల ధర పలికింది. అప్పట్లో గండిపేట వ్యూతో ఆ భూమికి అంతధర పలికింది. ఇప్పుడు దుర్గంచెరువు వ్యూతో ఉండే ఈ భూమి ఆ రికార్డును చెరిపేసింది. 2017లో ఇదే రాయదుర్గం ప్రాంతంలో ఎకరానికి రూ.42.59 కోట్లకు పలకగా, ఎనిమిదేళ్లలో నాలుగు రెట్లు పెరగడం గమనార్హం. ఇప్పుడు కొనుగోలు చేసిన భూమి ప్రస్తుత బంగారం ధరతో పోలిస్తే 1475 కిలోల బంగారం ధరతో సమానం. టీజీఐఐసీ సోమవారం నిర్వహించిన వేలంలో ప్రముఖ జాతీయ, ప్రాంతీయ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు పాల్గొన్నాయి. ఐటీ కారిడార్‌ ప్రాంతం కావడం రవాణాపరంగా అత్యంత సమీపంలోనే మెట్రో సదుపాయం ఉండటంతో 7.67 ఎకరాల ప్రభుత్వ భూమిని దక్కించుకునేందుకు స్థిరాస్తి సంస్థలు పోటీ పడ్డాయి. చివరకు ఎంఎ్‌సఎన్‌ రియాల్టీ సంస్థ అత్యధిక ధరకు మొత్తం భూమిని దక్కించుకుంది. 2022లో కోకాపేటలోని నియోపోలి్‌సలో హెచ్‌ఎండీఏ నిర్వహించిన వేలంలో ఎకరం ధర రూ.100.75 పలికినపుడు ఆ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అప్పట్లో రాజపుష్ప ఈ భూమిని కొనుగోలు చేసింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ప్రముఖ వాణిజ్య ప్రాంతంలోనూ ఇంత ధర లేదని అప్పట్లో స్తిరాస్థి నిపుణులు విశ్లేషించారు. దీనిపై అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీడియా సమావేశంలో ప్రస్తావించారు. ఈ ధర తెలంగాణ అభివృద్ధికి, రియల్‌ ఎస్టేట్‌ రంగం వేగవంతమైన ఎదుగుదలకు ఉదాహరణగా పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు అంతకుమించి ఎకరానికి రూ.77 కోట్లు అదనంగా అమ్ముడు పోయింది. రాష్ట్రంలోనే కాదు దేశ రియల్‌ ఎస్టేట్‌ రంగంలోనే ఇదో కొత్త మైలురాయి అని స్థిరాస్తి రంగం నిపుణులు పేర్కొంటున్నారు. రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలోని మొత్తం 18.67 ఎకరాలను రెండు భాగాలుగా విభజించి టీజీఐఐసీ వేలం వేసింది. ఇందులో ఒకటి 7.67 ఎకరాలు కాగా మరోటి 11 ఎకరాలు. ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ రంగం సంస్థ ప్రెస్టీజ్‌ 11ఎకరాలను రూ.1556 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ లెక్కన ఇందులో ఎకరానికి రూ.141.45 కోట్ల ధర పలికింది. ఈ భూములతో ప్రభుత్వానికి రూ.2913 కోట్ల ఆదాయం సమకూరింది. రిజిస్ట్రేషన్‌ చార్జీలు, స్టాంప్‌ డ్యూటీ కలుపుకుంటే సర్కారుకు మొత్తం రూ.3,135 కోట్ల ఆదాయం సమకూరుతోంది.


తెలంగాణకు గర్వకారణం

రాయదుర్గం వేలం విజయం తెలంగాణకు గర్వకారణమని టీజీఐఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.శశాంక పేర్కొన్నారు. తొమ్మిది ఏళ్ల వ్యవధిలో రాయదుర్గం భూమి ధర నాలుగు రెట్లు పెరగడం హైదరాబాద్‌ స్థిరమైన అభివృద్థి దిశలో కొనసాగుతున్న వేగాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోందని వ్యాఖ్యానించారు. ఎకరానికి 177 కోట్ల రికార్డు ధర హైదరాబాద్‌ దీర్ఘకాలిక సామర్థ్యానికి సూచిక అని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబుల నాయకత్వంలో పారదర్శక, వ్యాపారానుకూల వాతావరణం ఏర్పడిందని ఈ విజయంతో స్పష్టమైందన్నారు.

ఎందుకింత ధర?

బహుళ జాతి కంపెనీలు, ప్రపంచ సామర్థ్య కేంద్రాలకు ప్రాధాన్యత గల నగరంగా నిలువడంతో ప్రపంచ దేశాలు హైదరాబాద్‌ వైపు చూస్తున్నాయి. ఐటీ, ఐఈఈఎస్‌, ఫార్మా, ఏరోస్పెస్‌, ఏవియేషన్‌, ఆటోమొబైల్‌, ఎలక్ర్టికల్‌ వాహనాలు, ఏఐ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానముండడంతో ఆఫీసు స్పేస్‌కు, నివాస, వాణిజ్య భవనాలకు డిమాండ్‌ ఉన్నది. ప్రధానంగా ఐటీ కారిడార్‌లో ప్రస్తుతం భూములు, స్థలాలు దొరకడమే గగనంగా మారిన పరిస్థితుల్లో ఈ స్థాయి ధరలు పలుకుతున్నాయనిరియల్టీ వర్గాలు అంటున్నాయి.

Updated Date - Oct 07 , 2025 | 02:41 AM