Land Acquisition: ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్ మార్పుతో ఎనిమిది జిల్లాల రైతులకు నష్టం
ABN , Publish Date - Dec 29 , 2025 | 01:32 AM
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) అలైన్‌మెంట్ మార్పుతో 8 జిల్లాల పరిధిలో సన్న, చిన్నకారు రైతులు భూములు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు
గ్రామాల మధ్య నుంచి రోడ్డెలా వేస్తారు?
5న బాధిత రైతులతో రౌండ్‌టేబుల్ భేటీ: కవిత
తలకొండపల్లి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) అలైన్‌మెంట్ మార్పుతో 8 జిల్లాల పరిధిలో సన్న, చిన్నకారు రైతులు భూములు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ జాగృతి తరఫున దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. చిన్న రైతులకు అన్యాయం జరిగితే తాము చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం జంగారెడ్డిపల్లిలో ఆదివారం ‘జాగృతి జనం బాట’లో భాగంగా కవిత పర్యటించారు. ఆర్‌ఆర్‌ఆర్ కోసం భూములు కోల్పోతున్న రైతులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొందరి లాభం కోసం అలైన్‌మెంట్‌ను మార్చారని రైతులు కవిత దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణానికి తొలిసారి ఉపగ్రహం సాయంతో అలైన్‌మెంట్ రూపొందించినప్పుడు.. ఎక్కువ శాతం ప్రభుత్వ భూములు, గుట్టల ప్రాంతంలోనే ఉందని తెలిపారు. కొందరు పెద్ద వాళ్ల కోసం మూడు, నాలుగు సార్లు అలైన్‌మెంట్ మార్చారని ఆరోపించారు. ఫలితంగా చిన్న రైతులు భూములు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. గ్రామాలు, మునిసిపాలిటీల మధ్య నుంచి సెన్స్ లేకుండా ఎలా నిర్మిస్తారని నిలదీశారు. శాస్త్రీయంగా రూపొందించిన తొలి అలైన్‌మెంట్‌కే ప్రభుత్వం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. భూములు కోల్పోతున్న 8 జిల్లాల రైతులతో జనవరి 5న రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.