Rohingyas Allegedly Working Illegally: పటాన్‌చెరులో రోహింగ్యాలు
ABN , Publish Date - Nov 13 , 2025 | 04:40 AM
పటాన్‌చెరులో అక్రమంగా ఆవాసం ఏర్పాటు చేసుకొని వందలమంది రోహింగ్యాలు స్థానిక పరిశ్రమలు, ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు సమాచారం....
బెంగాల్‌లోకి చొరబడుతున్న వారిని పరిశ్రమల్లో పనిచేయించేందుకు తరలింపు
స్థానిక కార్మికులకు ఇచ్చేదాంట్లో సగం వేతనానికే పని.. వారికి ఆధార్, బీసీ సర్టిఫికెట్లు.. సహకరిస్తున్న అధికారులు
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుడారాల్లో ఆవాసం.. పటాన్‌చెరు మార్కెట్ ప్రాంతంలో రోహింగ్యాలు ఉంటున్నట్లు ప్రచారం
పటాన్‌చెరు, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): పటాన్‌చెరులో అక్రమంగా ఆవాసం ఏర్పాటు చేసుకొని వందలమంది రోహింగ్యాలు స్థానిక పరిశ్రమలు, ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్‌లోకి అక్రమంగా ప్రవేశించిన రోహింగ్యాలను పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లోని లేబర్ కాంట్రాక్టర్లు గుట్టుగా పటాన్‌చెరుకు తరలిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండేందుకు రోహింగ్యాల్లో కొందరికి కాంట్రాక్టర్లు స్థానికంగా ఆధార్ కార్డులు తయారుచేయిస్తున్నారని, ఇందుకు కొందరు రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలో. రెండు వేల పైచిలుకు కంపెనీలున్నాయి. వీటిల్లో సుమారు లక్ష పైచిలుకు కార్మికులు పని చేస్తున్నారు. కార్మికులకు డిమాండ్ ఉండటంతో వివిధ రాష్ట్రాల నుంచి వారిని తీసుకొచ్చే బాధ్యతను కంట్రాక్టర్లకు అప్పగిస్తారు. ఈ మేరకు బిహార్, యూపీ, ఒడిసా, చత్తీ్‌సగఢ్ అసోం, బెంగాల్ నుంచి కార్మికులను తీసుకొస్తున్నారు. కార్మికులు కంపెనీల్లో చేరగానే వారి మొదటి వేతనంలో కొంత మొత్తాన్ని కాంట్రాక్టర్‌కు ఇస్తారు. కార్మికులకు నివాసం, భోజన సౌకర్యాలు కల్పిస్తారు. కార్మికులతో యాజమాన్యం 12 గంటలు పనిచేయించుకుంటే, ఎనిమిది గంటల వేతనమే వారి ఖాతాల్లోకి వెళుతుంది. మిగిలిన నాలుగు గంటల తాలూకు వేతనాన్ని వారిని పనిలోకి చేర్చిన కాంట్రాక్టరే తీసుకుంటాడు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులకు నెలకు రూ.14వేలు చెల్లిస్తున్నారు. ఇందులో సగం వేతనానికే పని చేయించుకోవడానికి వీలుగా బెంగాల్‌లోకి అక్రమంగా ప్రవేశించిన రోహింగ్యాలను పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోకి కంట్రాక్టర్లు తరలిస్తున్నారు. ప్రధానంగా పటాన్‌చెరు, పాశమైలారం, రుద్రారం, గడ్డపోతారం, ఖాజిపల్లి, ఐడీఏబొల్లారం, బొంతపల్లి పారిశ్రామికవాడల్లోని రసాయన, రబ్బరు పరిశ్రమల్లో రోహింగ్యాలు పనిచేస్తున్నట్లు సమాచారం. రోహింగ్యాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుడారాల్లో ఉంచుతున్నారు. పటాన్‌చెరు మార్కెట్ ప్రాంతంలోని ఓ భవనంలో పెద్దఎత్తున రోహింగ్యాలు నివాసం ఉంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. రోహింగ్యాలకు స్థానిక ముసుగు తొడిగేందుకు ఓ ఆర్‌ఐ వారికి ఇష్టారీతిన బీసీ సర్టిఫికెట్లు మంజూరు చేస్తున్నట్లు, కంపెనీ యజమాని ఇచ్చిన చిరునామా ఆధారంగా ఆన్‌లైన్‌విధానంలో ఆధార్‌కార్డులను పుట్టిస్తున్నట్లు తెలుస్తోంది. పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే వరకు బెంగాల్‌లోని మారుమూల గ్రామానికి చెందిన ఆధార్‌కార్డును రోహింగ్యాలు వెంట ఉంచుకుంటున్నారు. పోలీసులు తనిఖీ చేసినా ఆ గ్రామం పేరు రావడంతో వాహనాన్ని వదులుతున్నారు. ఇక్కడికి రాగానే కొత్త ఆధార్ కార్డులు పొంది స్థానికులుగా చెలామణి అవుతున్నారు. ఇటీవల బెంగాల్‌లోని ఓ చెరువులో వేల సంఖ్యలో నకిలీ ఆధార్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.