Share News

Recovery for Heart Attack Patients: గుండెపోటు రోగుల రికవరీలో రోబోటిక్‌ రిహాబిలిటేషన్‌ కీలకం

ABN , Publish Date - Nov 12 , 2025 | 02:49 AM

గుండెపోటు అనంతరం రోగులు తక్కువ ఖర్చుతో కోలుకోవడానికి అధునాతన రోబోటిక్‌ రిహాబిలిటేషన్‌ను మిళితం చేయాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు తెలిపారు...

Recovery for Heart Attack Patients: గుండెపోటు రోగుల రికవరీలో రోబోటిక్‌ రిహాబిలిటేషన్‌ కీలకం

  • అడ్వాన్స్‌ రోబోటిక్స్‌ ఇన్‌ రిహాబ్‌ రికవరీపై చర్చాగోష్ఠిలో వైద్య నిపుణులు

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): గుండెపోటు అనంతరం రోగులు తక్కువ ఖర్చుతో కోలుకోవడానికి అధునాతన రోబోటిక్‌ రిహాబిలిటేషన్‌ను మిళితం చేయాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు తెలిపారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడలో హెచ్‌సీఏహెచ్‌ సెంటర్‌లో ‘అడ్వాన్స్‌ రోబోటిక్స్‌ ఇన్‌ రిహాబ్‌ రికవరీ’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్ఠిలో పలువురు వైద్య నిపుణులు మాట్లాడుతూ.. ఆరోగ్య సంరక్షణలో అత్యంత నిర్లక్ష్యం ఉన్నా.. చికిత్స అనంతర కీలకాంశాల్లో పోస్ట్‌- స్ట్రోక్‌ రిహాబిలిటేషన్‌ ఒకటని తెలిపారు. 50 మందికి పైగా ప్రముఖ న్యూరాలజిస్టులు, న్యూరో సర్జన్లు, రిహాబిలిటేషన్‌ నిపుణులు చర్చాగోష్టిలో పాల్గొన్నారు. వృద్దుల వైకల్యానికి ప్రధాన కారణాల్లో ఒకటైన గుండెపోటు రోగులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయిన తర్వాత వైద్యుల జోక్యం, పర్యవేక్షణ ముగుస్తుందన్న నిపుణులు.. ఆయా అవయవాల పనితీరులో రికవరీ ప్రక్రియ చికిత్స అనంతరమే ప్రారంభమవుతుందని చెప్పారు. యశోదా ఆస్పత్రి సీనియర్‌ కన్సల్టెంట్‌ న్యూరో సర్జన్‌ డాక్టర్‌ బీఎ్‌సవీ రాజు మాట్లాడుతూ ‘అత్యవసర చికిత్సలో భారత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ప్రావీణ్యం సంపాదించింది. కానీ రిహాబిలిటేషన్‌ అంటే జీవితాలను నిజంగా పునర్నిర్మించే ప్రదేశమని గుర్తించాల్సిన ఆవశ్యకత ఉంది’ అని చెప్పారు. గుండెపోటుకు గురైన రోగి కోలుకోవడంలో ప్రతి రోజూ కీలకమేనని.. త్వరిగతిన గైడెడ్‌ రిహాబిలిటేషన్‌ ప్రారంభంతో రోగి సాధారణ జీవన స్థితికి వచ్చే అవకాశాలు ఎక్కువని పేర్కొన్నారు. చికిత్సకు ఖచ్చితత్వాన్ని, తీవ్రతను రోబోటిక్‌ రిహాబిలిటేషన్‌ జోడిస్తుందని బీఎ్‌సవీ రాజు చెప్పారు. హెచ్‌సీసీహెచ్‌ సహ వ్యవస్థాపకుడు డాక్టర్‌ గౌరవ్‌ తుక్రాల్‌ మాట్లాడుతూ.. ఇటీవలే తాము తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్‌ రిహాబిలిటేషన్‌ ల్యాబ్‌ను ప్రారంభించినట్లు చెప్పారు. ఇందులో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) శక్తితో పని చేసే ఎక్సోస్కెలిటన్లు, మోషన్‌ ట్రాకింగ్‌ వ్యవస్థలు ఉన్నాయని తెలిపారు. ముందుగా చికిత్సను ప్రారంభిస్తే రోగులు వేగంగా కోలుకుంటారన్న డాక్టర్‌ గౌరవ్‌ తుక్రాల్‌.. గుండెపోటు రోగులకు అందించే చికిత్సలో ‘పోస్ట్‌ స్ట్రోక్‌ రిహాబిలిటేషన్‌’ను ప్రామాణికంగా మార్చాలని హితవు చెప్పారు.

Updated Date - Nov 12 , 2025 | 02:49 AM