Highway After Deadly Accident: ఎట్టకేలకు రోడ్డు విస్తరణ షురూ
ABN , Publish Date - Nov 06 , 2025 | 02:31 AM
హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిలో తెలంగాణ పోలీసు అకాడమీ నుంచి మన్నెగూడ వరకు ప్రమాదకరంగా మారిన 46 కి.మీ. మేర విస్తరణ పనులు బుధవారం...
హైదరాబాద్-బీజాపూర్ హైవేలో 46 కి.మీ. మేర విస్తరణ
చేవెళ్ల, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిలో తెలంగాణ పోలీసు అకాడమీ నుంచి మన్నెగూడ వరకు ప్రమాదకరంగా మారిన 46 కి.మీ. మేర విస్తరణ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ రహదారిలో మీర్జాగూడ వద్ద సోమవారం ఆర్టీసీ బస్సును కంకర టిప్పర్ ఢీకొన్న ఘోర ప్రమాదంలో 19 మంది మృతిచెందగా 34 మంది గాయపడిన విషయం తెలిసిందే. రోడ్డు విస్తరణ జరగకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఇరుకైన మార్గంలో నిత్యం ఎక్కడో అక్కడ ప్రమాదాలు జరుగుతుండడంతో రాకాసి రహదారిగా పేరు పొందింది. తాజాగా ఘోర ప్రమాదంతో స్థానికుల నుంచి విమర్శలు రావడంతో అధికారులు రోడ్డు విస్తరణ పనులు మొదలయ్యేందుకు చర్యలు తీసుకున్నారు. నిర్మాణ పనులు దక్కించుకున్న మేఘా సంస్థ పోలీసు అకాడమీ నుంచి మొయినాబాద్, చేవెళ్ల, మన్నెగూడ వరకు 20 యంత్రాలతో పనులు ప్రారంభించింది. బీటీ రోడ్డుకు ఇరువైపులా ముళ్ల చెట్లను తొలగించి, చదును చేస్తున్నారు. దీంతో రోడ్డు విశాలంగా కనిపిస్తోంది.
పదేళ్ల క్రితమే మొదలైనా..
ఈ రహదారి విస్తరణకు ఆమోదం లభించి పదేళ్లైనా నిర్మాణ పనులు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్లు సాగుతున్నాయి. తెలంగాణ పోలీసు అకాడమీ నుంచి మన్నెగూడ వరకు 46 కి.మీ. మేర నాలుగు లేన్లుగా రహదారి విస్తరణకు కేంద్రం రూ.956 కోట్లు మంజూరు చేసింది. ఈ పనుల టెండరును ‘మేఘా’ ఇన్‌ఫ్రా సంస్థ రూ.786 కోట్లకు దక్కించుకుంది. భూ సేకరణను దాదాపు పూర్తి చేసి కొన్నిచోట్ల పనులు మొదలుపెట్టారు. అయితే రోడ్డు పక్కన ఉన్న వృక్షాలను తొలగిస్తుండడంపై పర్యావరణ ప్రేమికులు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ను ఆశ్రయించడంతో పనులు ఆగిపోయాయి. ఇటీవల 765 మర్రి వృక్షాలను రక్షించేలా రహదారి అలైన్‌మెంట్ మార్పు చేసి మరో 150 వృక్షాలను వేరేచోటుకు తరలించేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో ‘సేవ్ బన్‌యాన్స్ ఆఫ్ చేవెళ్ల’ సంస్థ కేసు ఉపసంహరించుకుంది. దీంతో ఎన్జీటీ ఇటీవల స్టే ఎత్తివేసి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.