Police Encounter: రియాజ్ ఎన్‌కౌంటర్
ABN , Publish Date - Oct 22 , 2025 | 05:35 AM
నిజామాబాద్‌లో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్‌పై కత్తితో దాడికి పాల్పడి హత్య చేసిన రియాజ్ 24 పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు...
కానిస్టేబుల్ ప్రమోద్ హత్యకేసు నిందితుడు పోలీసు కాల్పుల్లో హతం
ఆస్పత్రిలో కానిస్టేబుల్ వద్ద తుపాకీ లాక్కొని ట్రిగ్గర్ నొక్కేందుకు ప్రయత్నించిన రియాజ్
ఆత్మరక్షణ కోసం పోలీసుల కాల్పులు.. రియాజ్ మృతి.. నిజామాబాద్ సీపీ వెల్లడి
రియాజ్‌ను పట్టుకునే క్రమంలో కత్తిపోట్లకు గురైన ఆసిఫ్‌ను పరామర్శించిన డీజీపీ
ఆయన చికిత్సకయ్యే ఖర్చునంతా ప్రభుత్వమే భరిస్తుందని హామీ
నిజామాబాద్/హైదరాబాద్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిజామాబాద్‌లో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్‌పై కత్తితో దాడికి పాల్పడి హత్య చేసిన రియాజ్(24) పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్.. అక్కడ డ్యూటీలో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ వద్ద తుపాకీ లాక్కుని తప్పించుకునే ప్రయత్నం చేశాడని, దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతి చెందాడని నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్‌ను శుక్రవారం హత్య చేసి పరారైన రియాజ్ ఆదివారం మధ్యాహ్నం నగర శివారులోని సారంగాపూర్ ప్రాంతంలో పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. పోలీసులకు దొరకకుండా పారిపోయే ప్రయత్నంలో అతడిని పట్టుకోవడానికి యత్నించిన ఆసిఫ్ అనే వ్యక్తిపై రియాజ్ కత్తితో దాడి చేయగా, ఇద్దరి మధ్య జరిగిన పెనుగులాటలో రియాజ్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో రియాజ్‌ను జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలోని నాలుగో అంతస్తులో ఖైదీలను ఉంచే రూమ్ నంబర్ 407లో ఉంచారు. కాగా, సోమవారం ఆస్పత్రి గదిలో అద్దాలు పగులగొట్టి, డోర్‌ను కొడుతూ గొడవ చేస్తుండడంతో విధుల్లో ఉన్న ఆస్పత్రి సిబ్బంది, ఏఆర్ కానిస్టేబుళ్లు రియాజ్‌ను బెడ్‌పై పడుకోబెట్టే ప్రయత్నం చేశారని కమిషనర్ సాయిచైతన్య తెలిపారు. ఈ క్రమంలో రియాజ్ కానిస్టేబుల్ వద్ద ఉన్న తుపాకీని లాక్కుని ట్రిగ్గర్ నొక్కే ప్రయత్నం చేయగా.. తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు కాల్పులు జరిపారని, దీంతో రియాజ్ మృతి చెందాడని వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం రియాజ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించడంతో అంత్యక్రియలు పూర్తి చేశారు. పోలీసు కాల్పుల్లో రియాజ్ మరణించిన విషయాన్ని డీజీపీ శివధర్‌రెడ్డి ప్రకటించారు. కాగా, రియాజ్ మృతిపై జిల్లా కేంద్ర ఆస్పత్రిలో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసినట్లు తెలుస్తోంది. రియాజ్ మృతి పట్ల కానిస్టేబుల్ కుటుంబం సంతోషం వ్యక్తం చేశారు.
ప్రమోద్ కుటుంబానికి కోటి ఎక్స్‌గ్రేషియా..
రియాజ్ చేతిలో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. పోలీసు భద్రత వెల్ఫేర్ బోర్డుల నుంచి రూ.24 లక్షలతో పాటు ప్రమోద్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం, ఉద్యోగ విరమణ కాలం వరకు పూర్తిస్థాయి వేతనం అందించనున్నట్లు తెలిపారు. కాగా, కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని డీజీపీ శివధర్‌రెడ్డి మంగళవారం సాయంత్రం పరామర్శించారు. ప్రమోద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మరోవైపు నిందితుడు రియాజ్‌ను పట్టుకునే క్రమంలో కత్తిపోట్లకు గురైన సయ్యద్ ఆసి్‌ఫను అబిడ్స్‌లోని మల్లారెడ్డి ఆస్పత్రిలో డీజీపీ శివధర్‌రెడ్డి, శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ మహేష్ భగవత్, హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ మంగళవారం పరామర్శించారు. కత్తిపోట్లతో చేతికి తీవ్రగాయాలు కావడంతో అత్యంత క్రిటికల్ పరిస్ధితుల్లో ఆసిఫ్ ఆస్పత్రికి వచ్చాడని, చేతి ఎముక మాత్రమే కనిపిస్తోందని, వైద్యులు ఆపరేషన్ చేసి చేతిని మళ్లీ యథా రూపానికి తీసుకొచ్చారని చెప్పారు. ఆసిఫ్ ఆరోగ్య పరిస్ధితి ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆయన చికిత్సకు అయ్యే ఖర్చునంతా ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించారు. నేరగాడి చేతిలో కత్తి ఉన్నప్పటికీ ధైర్యంగా అతడ్ని పట్టుకోవడానికి ఆసిఫ్ చేసిన ప్రయత్నం అభినందనీయమన్నారు. ఆసిఫ్ కోలుకోవడానికి రెండు, మూడు నెలలు పట్టవచ్చని తెలిపారు. అప్పటివరకు, ఆ తర్వాత కూడా ఆసిఫ్ కుటుంబాన్ని ఆదుకుంటామని డీజీపీ హామీ ఇచ్చారు. రియాజ్‌పై ప్రకటించిన రూ.50 వేల రివార్డును ఆసిఫ్ కుటుంబానికి అందజేశారు. కాగా, రియాజ్ ఎన్‌కౌంటర్ విషయమై మానవ హక్కుల సంఘం నోటీసులిచ్చిన విషయాన్ని ప్రస్తావించగా.. కేసు విచారణలో ఉండగా మాట్లాడడం సరికాదన్నారు.
డాన్ అవ్వాలనుకొని..!
పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన రియాజ్ చిన్నచిన్న దొంగతనాలతో తన నేర ప్రవృత్తిని ప్రారంభించాడు. అవసరాలకు దొంగతనం చేసే స్థాయి నుంచి పెద్దపెద్ద నేరాలు చేసే స్థాయికి ఎదిగాడు. డాన్ కావాలనుకుని.. నేరాలు చేసి పోలీసుల చేతిలో హతమయ్యాడు. రియాజ్ తొలుత గత ఏడాది ఎడపల్లి వద్ద హత్య గురైన పాత నేరస్థుడు ఆరి్‌ఫకు అనుచరుడిగా ఉన్నాడు. ఆరిఫ్ మరణం తర్వాత సమద్ గ్యాంగ్‌లో చేరాడు. రియాజ్‌పై 61 కేసులు ఉన్నట్లు, వీటిలో 41 కేసుల విచారణకు అతడు హాజరైనట్లు తెలుస్తోంది. మరో 20 కేసులకు సంబంధించి రియాజ్ కోసం పోలీసులు కొద్దిరోజులుగా గాలిస్తున్నారు. మొత్తం కేసుల్లో 50 కేసులు బైకులు, బుల్లెట్ వాహనాల దొంగతనానికి సంబంధించినవి కాగా, ఐదు చైన్ స్నాచింగ్ కేసులు, రెండు దోపిడీ కేసులు, మూడు హత్యాయత్నం కేసులు, ఒక హత్య కేసు ఉన్నాయి. మహారాష్ట్రలో మరో 6 కేసులు రియాజ్‌పై నమోదయ్యాయి. రియాజ్ ముఖ్యంగా బైకులు, బుల్లెట్ వాహనాలను చోరీ చేసి.. వాటి ఇంజన్ నంబర్లు మార్చి మహారాష్ట్రలో అమ్మేవాడు. కాగా, రియాజ్‌ను సీసీఎస్ పోలీసులు గతంలో పోలీసుస్టేషన్‌లో ఇబ్బందులకు గురిచేసినట్లు తెలిసింది. దీంతో మళ్లీ ఇబ్బందులకు గురిచేస్తారనే భయంతో కానిస్టేబుల్‌ను కత్తితో పొడిచి పరారైనట్లు ప్రచారం జరుగుతోంది.