Overflowing Rivers: పోటెత్తుతున్న నదులు
ABN , Publish Date - Sep 07 , 2025 | 07:13 AM
దేశంలో నదులు ప్రమాదకరస్థాయిలో పోటెత్తుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలకు తీవ్ర వరద ముప్పు పొంచి ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) హెచ్చరించింది.
పలు రాష్ట్రాలకు తీవ్ర వరద ముప్పు
దేశ వ్యాప్తంగా 22 ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయిలో ప్రవాహం
కేంద్ర జల సంఘం హెచ్చరిక
న్యూఢిల్లీ, సెప్టెంబరు 6: దేశంలో నదులు ప్రమాదకరస్థాయిలో పోటెత్తుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలకు తీవ్ర వరద ముప్పు పొంచి ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) హెచ్చరించింది. సీడబ్ల్యూసీ రోజు వారీ వరద పరిస్థితి నివేదిక ప్రకారం.. 22 నదీ పర్యవేక్షణ కేంద్రాల వద్ద తీవ్ర వరద ప్రవాహం నమోదైంది. ఆ కేంద్రాలు ఎనిమిది చొప్పున బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో, ఒక్కోటి చొప్పున గుజరాత్, ఢిల్లీ, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఉన్నాయి. అస్సాం, జమ్మూకశ్మీర్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్లోని మరో 23 కేంద్రాల వద్ద సాధారణం కంటే ఎక్కువగా నీటి ప్రవాహం ఉంది. కర్ణాటకలో 12, తెలంగాణలో 6, ఆంధ్రప్రదేశ్‌లో 5 ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉంది. ఇతర రాష్ట్రాల్లో కూడా పలు ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో పెరుగుతోంది. వచ్చే రెండు రోజుల పాటు గుజరాత్‌లోని నర్మద, తపతి, దామన్‌గంగ, సబర్మతి నదుల్లో వరద కొనసాగనుంది. రాజస్థాన్‌లోని మహి, సబర్మతి, చంబల్, బనాస్ నదులు పొంగుతున్నాయి. మహారాష్ట్రను కూడా వర్షాలు ముంచెత్తుతున్నాయి. అక్కడి నదుల్లో వరద ఉరకలేస్తోంది. గంగ, యమున తదితర నదులు ఇంకా ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో ఉత్తరప్రదేశ్, బిహార్‌ల్లో వరదలు కొనసాగుతున్నాయి. గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, మహరాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను ఆకస్మిక వరదలు ముంచెత్తే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ హెచ్చరించింది. కృష్ణ, గోదావరి, నర్మద, మహానది, కావేరి నదులపై డ్యామ్‌లు ఇప్పటికే నిండుకుండల్లా ఉన్నందున ఆయా ప్రాజెక్టుల అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.