Justice P.S. Narasimha: నచ్చిన తీర్పులు రావాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయ్
ABN , Publish Date - Dec 30 , 2025 | 06:33 AM
కోర్టుల్లో తమకు అనుకూలంగా తీర్పులు వచ్చేలా చూడాలంటూ హైప్రొఫైల్ క్లయింట్లు, ప్రభుత్వం నుంచి న్యాయవాదులపై ఒత్తిళ్లు వస్తున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ అభిప్రాయపడ్డారు.
లాయర్లపై ఒత్తిడి తెస్తున్న ‘ హైప్రొఫైల్ క్లయింట్లు’
ఈ ఒత్తిడి నుంచి న్యాయవ్యవస్థ స్వతంత్రతను
కాపాడుకోవాల్సిన అవసరం ఉంది: జస్టిస్ పీఎస్ నరసింహ
తెలంగాణ లా అకాడమీ ఏర్పాటుకు సహకరిస్తామని వెల్లడి
హైదరాబాద్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కోర్టుల్లో తమకు అనుకూలంగా తీర్పులు వచ్చేలా చూడాలంటూ హైప్రొఫైల్ క్లయింట్లు, ప్రభుత్వం నుంచి న్యాయవాదులపై ఒత్తిళ్లు వస్తున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ అభిప్రాయపడ్డారు. ఈ ఒత్త్లిళ్లను తట్టుకొని న్యాయవ్యవస్థ స్వతంత్రతను, వృత్తిపరమైన స్వతంత్రతను న్యాయవాదులు కాపాడాల్సిన అవసరం ఉందని సూచించారు. సోమవారం హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైప్రొఫైల్ క్లయింట్ల డిమాండ్లు, కోరికలు బాగా పెరిగిపోయాయని, వారు తాము కోరుకున్న విధంగానే జరగాలని పట్టుబడుతున్నారని తెలిపారు. తాము కోరుకున్న విధంగా చేయాలంటూ న్యాయవాదులపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం కూడా అతిపెద్ద క్లయింట్ అని గుర్తుచేశారు. ఈ ఒత్తిడిని తట్టుకుని, తాను ఇంతవరకు మాత్రమే చేయగలమని చెప్పే ధైర్యం లాయర్లకు లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇలాంటి పరిస్థితిని న్యాయవాది ఒంటరిగా ఎదుర్కోలేడని, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్‌లు అండగా ఉండాలని పేర్కొన్నారు. న్యాయవాదుల కన్నా క్లయింట్లే తాజా సమాచారాన్ని అధికంగా సేకరించుకుంటున్నారని తెలిపారు. అందువల్ల న్యాయవాదులు కూడా తమ నైపుణ్యాలను అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం తెలంగాణ లా అకాడమీ ఏర్పాటు ఆవశ్యకత ఎంతైనా ఉందని, ఈ విషయమై తాను సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఒత్తిడిని తట్టుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొత్త హైకోర్టులో జిమ్ కూడా ఉండాలని సూచించారు. ఏఐ సాంకేతికను న్యాయవాదులు అందిపుచ్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, ఇతర న్యాయమూర్తులు, ఏజీ ఏ. సుదర్శన్‌రెడ్డి, ఏఏజీ తేరా రజనీకాంత్‌రెడ్డి, సొలిసిటర్లు నరసింహశర్మ, భుజంగరావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్‌రావు, హెచ్‌సీఏఏ అధ్యక్షుడు ఏ.జగన్, ఉపాధ్యక్షుడు రాజేశ్వర్‌రెడ్డి, కార్యదర్శులు విజారత్ అలీ, ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.