Share News

Rising Mental Health Concerns: బాధను పంచుకొనే తోడు కోసం

ABN , Publish Date - Dec 30 , 2025 | 05:48 AM

మనసులోని బాధను పంచుకునే తోడు కోసం మనిషి ఆరాటపడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ వైఫల్యాలు, పరీక్షల ఒత్తిళ్లు, కాలేజీల్లో ర్యాగింగ్‌లు..

Rising Mental Health Concerns: బాధను పంచుకొనే తోడు కోసం

  • ప్రజల్లో పెరిగిపోతున్న మానసిక కుంగుబాటు సమస్యలు

  • తమ బాధను ఓపికగా వినేవారికోసం బాధితుల ఆరాటం

  • 1లైఫ్‌ హెల్ప్‌లైన్‌కు ఒక్క ఏడాదిలో 38,437 ఫోన్‌కాల్స్‌

  • ఆర్థిక సమస్యలు, ప్రేమ వైఫల్యాల కేసులే అధికం

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): మనసులోని బాధను పంచుకునే తోడు కోసం మనిషి ఆరాటపడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ వైఫల్యాలు, పరీక్షల ఒత్తిళ్లు, కాలేజీల్లో ర్యాగింగ్‌లు.. సమస్య ఏదైనా తమ గుండె లోతుల్లోని బాధను అర్థం చేసుకొని, ఆప్యాయంగా స్వాంత్వన మాటలు చెప్పేవారి కోసం ఎంతోమంది తపనపడుతున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా చెప్పుకోలేని కొన్ని బాధలను ఓర్పుగా విని, మంచి మార్గం చూపేవారికోసం వెదుకుతున్నారు. గుండెలపై ఉన్న మానసిక వే ధన అనే కొండత భారాన్ని గతంలో చాలామంది మౌనంగా భరించటమో.. జీవితాలను ముగించటమో చేసేవారు. ఇప్పుడు అలాంటివారు తమ బాధను విని అర్థం చేసుకొనే హెల్ప్‌లైన్‌ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్‌ కేంద్రం గా పనిచేస్తున్న మానసిక ఆరోగ్య అవగాహన, ఆత్మహత్యల నివారణ హెల్ప్‌లైన్‌ ‘1 లైఫ్‌’ సంస్థను సంప్రదించిన ఇలాంటివారిని గమనిస్తే ఈ విష యం అర్థమవుతుంది. ఈ ఏడాదిలో తమకు వచ్చిన కాల్స్‌ వివరాలను 1 లైఫ్‌ సంస్థ సోమవారం విడుదల చేసింది. ఈ సంస్థను సంప్రదించినవారిలో ఆరి ్థక ఒత్తిడి, ప్రేమ బంధాలు చెడిపోవడం, చదువు, పరీక్షల ఒత్తిడి, ఉద్యోగ సమస్యలు, ర్యాగింగ్‌, వ్యా పార నష్టాలు తదితర కారణాలతో ఆత్మహత్య ఆలోచనలతో బాధపడుతున్నవారే అధికంగా ఉన్నారు.


నెలకు 4 వేలమందికి పైగానే కాల్స్‌...

మానసిక ఒత్తిడితో బాధపడుతున్నవారు ఇటీవలి కాలంలో భారీగా పెరిగారని 1లైఫ్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబరు మధ్య వరకు 1 లైఫ్‌ హెల్ప్‌లైన్‌కు మొత్తం 38,437 మంది ఫోన్లు చేశారు. జనవరిలో 2,224గా ఉన్న నెలవారీ కాల్స్‌, సెప్టెంబరులో గరిష్ఠంగా 4,134కు చేరాయి. కాల్స్‌ సంఖ్య 86 శాతం పెరిగింది. జూలై నుంచి అక్టోబరు వరకు నెలకు దాదాపు 4,000 కాల్స్‌ వచ్చాయి. ఈ పెరుగుదల సీజనల్‌గా వచ్చింది కాదని.. ప్రజల్లో భావోద్వేగ, మానసిక సమస్యలు వేగంగా పెరుగుతున్నాయనేందుకు ఈ గణాంకాలే నిదర్శనమని 1 లైఫ్‌ ప్రతినిధులు తెలిపారు. ఏడాది మొత్తంలో బాధితులకు మద్దతు ఇవ్వటానికి ఈ సంస్థ వ లంటీర్లు 1,838 గంటలు కేటాయించారు. బాధితలు మాట్లాడే సగటు ఫోన్‌కాల్‌ వ్యవధి కూడా పెరిగింది. 1 లైఫ్‌ హెల్ప్‌లైన్‌ను సంప్రదించినవారిలో ఎక్కువ మంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నవారే. ఆ తర్వాత విద్యార్థుల నుంచి వచ్చిన కాల్స్‌ అధికంగా ఉన్నాయి.

ఒక్కొక్కరి బాధ ఒకలా...

  • బెంగళూరుకు చెం దిన 27 ఏళ్ల వ్యక్తి ఆన్‌లైన్‌ పెట్టుబడులు, స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌లో భారీగా నష్టపోయి ఇంటిని, భార్య ఆభరణాలను తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఆ పరిస్థితి అతడిని తీవ్ర నిరాశలోకి, ఆత్మహత్య ఆలోచనల్లోకి నెట్టింది. అతడు 1 లైఫ్‌ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాడు. అతడి బాధను 1లైఫ్‌ వలంటీర్‌ సానుభూతితో విని జీవితంపై అతడికి మళ్లీ నమ్మకం తీసుకొచ్చినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

  • మరో ఘటనలో ఢిల్లీకి చెందిన మహిళ(32) ఓ వ్యక్తితో తన ఆరేళ్ల ప్రేమ విఫలం కావటంతో మానసికంగా కుంగిపోయింది. ఆమె 1 లైఫ్‌ను సంప్రదించి కోలుకునేందుకు మద్దతు కోరారు.

  • పశ్చిమబెంగాల్‌కు చెందిన 23 ఏళ్ల ట్రాన్స్‌ జెండర్‌.. సమాజధోరణి తనను ఒంటరిగా, నిరుత్సాహంగా మార్చిందని తెలిపారు. ఎంబీఏ పూర్తిచేసి ఐటీ రంగంలో పనిచేస్తున్నా, తరచూ అవహేళనలు ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోయారు. ఆమెకు 1లైఫ్‌ మద్దతుగా నిలిచింది. ఇలా తమకు వచ్చే ప్రతి ఫోన్‌కాల్‌ వెనుక బాధ, అయోమయం, ఒంటరితనానికి సంబంధించిన కథలున్నాయని 1 లైఫ్‌ కౌన్సెలింగ్‌ సైకాలజిస్టు రెబెక్కా మారియా తెలిపారు. చాలామంది తమ భావోద్వేగాలను, బాధలను చెప్పుకొనే ఒక భద్రమైన మార్గం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. తమను సంప్రదించేవారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతున్నామని వివరించారు. ఎవరికీ తమ బాధ వినేవారు లేరన్న భావన రాకుండా చూడడానికే 1 లైఫ్‌ పనిచేస్తోందని ఆ సంస్థ డైరెక్టర్‌ టీ. శ్రీకర్‌ రెడ్డి తెలిపారు.

Updated Date - Dec 30 , 2025 | 05:48 AM