Crimes Against Women: బంధువులే రాబందులు
ABN , Publish Date - Oct 04 , 2025 | 03:28 AM
రాష్ట్రంలో మహిళల పాలిట భర్త, అతని బంధువులే రాబందులుగా మరారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో...
మహిళలపై అఘాయిత్యాల్లో రెండో స్థానంలో తెలంగాణ
817 అత్యాచారం, సామూహిక అత్యాచార కేసుల నమోదు
ఆత్మహత్యల్లో 6, ఎస్సీ, ఎస్టీలపై దాడుల్లో ఐదో స్థానం
ఆహార కల్తీ కేసుల నమోదులో దేశంలోనే అగ్రస్థానం
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాలు
హైదరాబాద్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మహిళల పాలిట భర్త, అతని బంధువులే రాబందులుగా మరారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) తాజాగా విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించి 2022లో 22,065 కేసులు నమోదైతే.. 2023లో అవి 23,679 కేసులకు పెరిగాయి. దేశవ్యాప్తంగా మహిళలపై జరిగిన అఘాయిత్యాల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని వెల్లడైంది. ప్రతి లక్ష మంది మహిళల్లో 189.6 మందిపై అఘాయిత్యాలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించిన జాతీయ సగటు 66.2 మాత్రమే. అంటే, తెలంగాణలో మూడింతలు ఎక్కువ కావడం గమనార్హం. భర్త, అతని బంధువుల వేధింపుల కారణంగా 10,518 కేసులు నమోదైతే.. మహిళల మర్యాదను, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడడానికి సంబంధించి 5,024 కేసులు, మహిళలను కిడ్నాప్ చేసి హింసించారంటూ 2,152 కేసులు నమోదయ్యాయి. పోక్సో చట్టం కింద 3,128 కేసులు నమోదైతే.. వాటిలో హైదరాబాద్‌లోనే 508 కేసులు నమోదు కావడం గమనార్హం. ఇక, 817 రేప్ కేసులు నమోదు కాగా.. వాటిలో 14 హత్య, సామూహిక అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఇక చార్జ్‌షీట్ రేటు చూసుకుంటే 88.1 శాతంగా ఉండగా, ఇది జాతీయ సరాసరి 77.6 శాతం కంటే ఎక్కువని నివేదిక వెల్లడించింది.
ప్రతి లక్ష జనాభాకు 27.7 ఆత్మహత్యలు
తెలంగాణలో 2023లో మొత్తం 10,580 ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయని ఎన్‌సీఆర్‌బీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం 1,71,418 ఆత్మహత్యల్లో తెలంగాణ వాటా 6.2 శాతంగా ఉంది. ఆత్మహత్యలకు సంబంధించి 2022లో 9,980 కేసులు నమోదవగా, 2023లో మరింత పెరిగాయి. ప్రతి లక్ష జనాభాకు 27.7 ఆత్మహత్యలు జరుగుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇది దేశ సగటు 12.3 కంటే రెట్టింపు స్థాయిలో ఉంది. పెద్ద రాష్ట్రాల వారీగా చూస్తే.. మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళ తర్వాత తెలంగాణ ఆరో స్థానంలో నిలిచింది. ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణం కుటుంబ సమస్యలేనని తెలుస్తోంది. మొత్తం కేసుల్లో 4,680 మంది అంటే 44.2 శాతం ఈ కారణంగానే ప్రాణాలు తీసుకున్నారని తెలుస్తోంది. ఇది దేశ సగటు 31.9 శాతం కంటే ఎక్కువ. ఆత్మహత్య చేసుకున్న వారిలో రోజువారీ కూలీలు 4,835, స్వయం ఉపాధి చేసుకునే వారు 1,705, వ్యవసాయ కార్మికులు 564, విద్యార్థులు 582 కేసులుగా గణాంకాలు నమోదయ్యాయి. ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడులు, దురాగతాల్లో బిహార్, యూపీ, ఒడిసా, పంజాబ్ తర్వాత తెలంగాణ ఐదో స్థానంలో ఉందని గణాంకాలు చెబుతున్నాయి.
ఆహార కల్తీ కేసుల్లో అగ్రస్థానం
ఆహార భద్రతకు సంబంధించి తెలంగాణలో ఆందోళనకర వాస్తవాలు వెలుగుచూశాయి. ఎన్‌సీఆర్‌బీ 2023 నివేదిక ప్రకారం.. ఆహార కల్తీ కేసుల విషయంలో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. 382 ఆహార, ఔషధ కల్తీ ఘటనల్లో 387 మంది బాధితులు. ఈ కేసుల్లో ఒక్క హైదరాబాద్‌లోనే 218 కేసులు నమోదయ్యాయి. విశేషం ఏమిటంటే.. వీటిలో ఒక్కటి కూడా ఆహార కల్తీ నిరోధక చట్టం-1954 కింద నమోదు కాలేదు. అంటే చట్టం ఉన్నా అమలు ఏ రీతిన ఉందో స్పష్టమవుతోంది. 2022లో ఈ సంఖ్య మరింత ఎక్కువ. ఆ సంవత్సరంలో 1,631 కేసులు నమోదయ్యాయి.



