Rice Prices Drop: సన్నన్నం మస్త్ సుమీ
ABN , Publish Date - Sep 11 , 2025 | 04:14 AM
సన్నబియ్యం కొనుగోలుదారులకు గొప్ప ఊరట. బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధరలు తగ్గుముఖం పట్టాయి...
మార్కెట్లో తగ్గిన సన్నబియ్యం ధరలు
సగటున క్వింటాలుకు రూ.వెయ్యి దాకా..
ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత సన్నబియ్యం వల్లే..
రేషన్‌లో దొరుకుతుండడంతో తగ్గిన సన్నాల కొనుగోళ్లు
హైదరాబాద్, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): సన్నబియ్యం కొనుగోలుదారులకు గొప్ప ఊరట. బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఆరు నెలల క్రితం క్వింటాలుకు రూ.ఐదారు వేలు పెడితేగానీ దొరకని సన్నబియ్యం.. ఇప్పుడు రూ.నాలుగైదు వేల లోపే లభ్యమవుతున్నాయి. సగటున అన్నిరకాల సన్నబియ్యం ధర క్వింటాలుకు రూ.వెయ్యి దాకా తగ్గింది. ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తుండడమే ఇందుకు కారణం. ఇదివరకు రేషన్ షాపుల్లో ఇచ్చే దొడ్డుబియ్యం తీసుకొని, దళారులకు అమ్ముకొని, ఆ డబ్బులకు మరింత సొమ్ము జమచేసి.. సన్నబియ్యం కొనుగోలు చేసే వారంతా ఈ ప్రక్రియకు స్వస్తి చెప్పారు. పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు ప్రభుత్వం పంపిణీ చేసిన సన్నబియ్యాన్నే తింటున్నారు. ఈ ప్రభావం బహిరంగ మార్కెట్‌పై పడటంతో సన్నబియ్యం కొనుగోళ్లు, ధరలు తగ్గిపోయాయి. ఆరు నెలల క్రితం సన్నబియ్యం ధరలు భారీగా ఉండేవి. సామాన్యులు కొనుగోలు చేయాలంటే కష్టంగా ఉండేది. మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉండే జైశ్రీరాం నాణ్యమైన పాత బియ్యమైతే క్వింటాలుకు రూ.7 వేల నుంచి రూ.7,600 వరకు ఉండేది. ఇప్పుడు ఆ బియ్యం ధర రూ.6 వేలకు పడిపోయింది. కాస్త తక్కువ నాణ్యత ఉన్న కొత్త బియ్యమైతే ఇదివరకు క్వింటాలుకు రూ.6,500 ఉండేది. ఇప్పుడవే బియ్యం రూ.5,500 నుంచి రూ.5,600కు లభ్యమవుతున్నాయి. ఇక హెచ్‌ఎంటీ బియ్యం ధర ఆరు నెలల క్రితం క్వింటాలుకు రూ.6 వేలు ఉండగా.. ఇప్పుడు రూ.4,500 నుంచి రూ.4,700 కు పడిపోయింది. బీపీటీ ధర ఇదివరకు రూ.5 వేల నుంచి రూ.5,500 వరకు ఉండగా.. ఇప్పుడు రూ.4,300 నుంచి రూ.4,400కు మార్కెట్లో దొరుకుతున్నాయి. మార్కెట్లో సింహభాగం అమ్ముడుపోయే ఆర్‌ఎన్‌ఆర్ (తెలంగాణ సోనా) బియ్యం రూ.4,600 నుంచి రూ.4,700 వరకు లభ్యమవుతున్నాయి. ఆరు నెలల క్రితం వరకు ఆర్‌ఎన్‌ఆర్ ధర క్వింటాలుకు రూ.5,500 నుంచి రూ.6 వేల వరకు ఉండేది. ఇక సోనా మసూరి బియ్యమైతే క్వింటాలుకు రూ.4,300 చొప్పున దొరుకుతుండడం గమనార్హం. అయినా.. పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు సన్నబియ్యం కొనుగోళ్లకు దాదాపుగా దూరమయ్యారు. రేషన్ షాపుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే సన్నబియ్యం ఉచితంగా ఇస్తుండటంతో.. ప్రజలు వాటినే తింటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 99,70,832 తెల్ల రేషన్ కార్డులుండగా.. వీటిపై 3,20,57,710 మంది లబ్ధిదారులున్నారు. వీరికి ప్రతినెలా 2 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం రేషన్ షాపుల ద్వారా పంపిణీ అవుతున్నాయి.
నిల్వలు, ధరలు తగ్గించిన బియ్యం వ్యాపారులు..
గతంలో ట్రేడర్లు కనీసం రెండు నెలలకు సరిపడా స్టాక్ (బియ్యం నిల్వలు) చేసేవారు. ఇప్పుడు కొనుగోళ్లు తగ్గిపోవడంతో నిల్వలు తగ్గించారు. ఒక నెలకు సరిపడే బియ్యం నిల్వలతోనే అమ్మకాలు సాగిస్తున్నారు. సాధారణంగా జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో మార్కెట్లో బియ్యానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయని, కానీ.. ఇప్పుడు సన్నబియ్యం కొనుగోళ్లు మందగించాయని ఈసీఐఎల్‌కు చెందిన బియ్యం వ్యాపారి వెంకటేశ్వరరావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. గతంలో నెలకు 1,200 మెట్రిక్ టన్నుల నుంచి 1,500 మెట్రిక్ టన్నుల బియ్యం విక్రయించేవాడినని, ఇప్పుడు కొనుగోళ్లు తగ్గటంతో 60 రోజుల స్టాక్‌కు బదులుగా 30 రోజుల స్టాక్ మాత్రమే మెయింటెయిన్ చేస్తున్నామని సదరు వ్యాపారి చెప్పారు. గతంలో జైశ్రీరాం పాత (రెండేళ్ల) బియ్యం క్వింటాలుకు రూ.7,100 చొప్పున అమ్మిన దాఖలాలు ఉన్నాయని, కానీ.. ఇప్పుడు పాత బియ్యం ధరలు కూడా క్వింటాలుకు రూ.1000 చొప్పున తగ్గిపోయాయని మియాపూర్‌కు చెందిన మరో బియ్యం వ్యాపారి రాము తెలిపారు. అయితే ఉన్నత వర్గాలకు చెందిన ప్రజలు సన్నబియ్యం కొనుగోళ్లు యథావిధిగా చేస్తున్నారని, మార్కెట్లో ధరలు తగ్గిపోవటంతో వారికి కూడా లాభం కలుగుతోందని బియ్యం వ్యాపారులు చెబుతున్నారు. కాగా, గత జూన్‌లో మూడు నెలల (జూన్, జూలై, ఆగస్టు) బియ్యం కోటా ఏకకాలంలో పంపిణీ చేయగా.. తాజాగా రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ మళ్లీ ప్రారంభమైంది.
నిలిచిపోయిన బియ్యం రీ-సైక్లింగ్..
ప్రజలు తినగలిగే బియ్యాన్నే ప్రభుత్వం పంపిణీ చేస్తుండటంతో.. లబ్ధిదారులు అవే బియ్యం తింటున్నారు. గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేసినప్పుడు కిలోకు రూ.9 నుంచి రూ.10 చొప్పున దళారులకు అమ్ముకునేవారు. రేషన్ డీలర్లు కూడా కిలోకు రూ.10 చొప్పున చేతిలో పెట్టి లబ్ధిదారుల నుంచి బియ్యాన్ని వారే తీసుకునేవారు. ఆ బియ్యాన్ని దళారులు, ట్రేడర్లు, రైస్‌మిల్లర్లకు విక్రయించేవారు. చివరకు భారత ఆహార సంస్థ(ఎ్‌ఫసీఐ)కి కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) రూపంలో ఇవే పీడీఎస్ బియ్యాన్ని రైస్‌మిల్లర్లు అంటగట్టేవారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున రీ-సైక్లింగ్ బియ్యం దందా జరిగేది. 70 శాతం నుంచి 80 శాతం దొడ్డుబియ్యం బ్లాక్ మార్కెట్లోకి వెళ్లేవి. ఇప్పుడు సన్నబియ్యం పంపిణీ పథకం గేమ్ చేంజర్‌లా వచ్చింది. ప్రస్తుతం 80 శాతం మంది వినియోగదారులు పీడీఎస్ ద్వారా పంపిణీ చేసిన సన్నబియ్యమే తింటున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. రేషన్ కార్డులున్న రైతులు మాత్రం తమ పొలాల్లో పండించిన సన్నబియ్యాన్నే తినటానికి ఇష్టపడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన సన్నబియ్యాన్ని ఇతర పిండివంటలకు వినియోగిస్తున్నారు. అయితే 25 శాతం నూకలతో రాష్ట్ర ప్రభుత్వం రైస్‌మిల్లర్ల నుంచి సన్నబియ్యం సేకరణ చేస్తోంది. బియ్యంలో నూకల శాతాన్ని 25 నుంచి 10 శాతానికి తగ్గిస్తే లబ్ధిదారులకు మరింత మేలు జరుగుతుందని, ఒక సీజన్‌లో ఉత్పత్తి చేసిన బియ్యాన్ని వెంటనే పంపిణీ చేయకుండా, నాలుగైదు నెలల తర్వాత పంపిణీ చేయటం ద్వారా అన్నం నాణ్యంగా ఉంటుందని, ముద్దలాగా మారదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.