CM Revanth Reddy: బతుకమ్మ కుంటకు పునరుజ్జీవం
ABN , Publish Date - Sep 26 , 2025 | 06:45 AM
కబ్జాలతో కుచించుకుపోయి.. ముళ్లకంపలు, పిచ్చి మొక్కలతో నిండిపోయి ఒకప్పుడు అది జలకళతో ఉట్టిపడిన కుంట అని చెబితే ఏమాత్రం నమ్మలేని స్థితి....
కబ్జాలు, పిచ్చిమొక్కలతో నిండిన ఆ కుంటకు జీవం పోసిన హైడ్రా
14ఎకరాల్లో చెరువు.. కబ్జాలతో 5.15 ఎకరాలకు.. రూ.7.15 కోట్లతో పునరుద్ధరణ
పిక్నిక్ స్పాట్‌గా సర్వాంగసుందరంగా ముస్తాబు.. నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): కబ్జాలతో కుచించుకుపోయి.. ముళ్లకంపలు, పిచ్చి మొక్కలతో నిండిపోయి ఒకప్పుడు అది జలకళతో ఉట్టిపడిన కుంట అని చెబితే ఏమాత్రం నమ్మలేని స్థితి నుంచి ఆ కుంట మళ్లీ జీవం పోసుకుంది. కబ్జాలతో విస్తీర్ణం తగ్గినా మరింత నష్టం జరకుండా హైడ్రా ఊపిరిపోయడంతో జలకళతో పూర్వవైభవం సంతరించుకుంది. ఇదంతా బాగ్‌అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట గురించే. గ్రామ సర్వే నంబర్ 563లో 1962-63 రెవెన్యూ రికార్డుల ప్రకారం 14.06 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట ఉండేది. బఫర్ జోన్‌లతో కలిపి ఆ విస్తర్ణం 16.13 ఎకరాలు. అయితే రానురాను ఆక్రమణలతో కుంట 5.15 ఎకరాలకు కుచించుకుపోయింది. ఆ భూమి కూడా తనదేనంటూ కొందరు కోర్టుకెక్కారు. ప్రభుత్వ విభాగాల రికార్డుల ఆధారంగా వినిపించిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఆ స్థలం ప్రైవేటు వ్యక్తులదనే వాదనను తోసిపుచ్చుతూ సర్కారుకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. అనంతరం రూ.7.15 కోట్లతో కుంట పునరుద్ధరణ పనులను హైడ్రా పూర్తి చేసింది. కుంట చుట్టూ వాకింగ్ ట్రాక్.. పిల్లల ఆట స్థలం.. పర్యాటక ప్రియులు సరదాగా కబుర్లు చెప్పుకునేలా కుర్చీలు, ఇతరత్రా ఏర్పాట్లతో పిక్నిక్ స్పాట్‌లా మార్చింది.. తాజాగా బోటింగ్ కూడా ఏర్పాటు చేశారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన బతుకమ్మకుంటను శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా అక్కడ బతుకమ్మ వేడుకల నిర్వహణకూ ఏర్పాట్లు చేశారు.