Minister Ponguleti Srinivas Reddy: సీసీఎల్‌ఏనా.. మీ సొంత ఆఫీసా?
ABN , Publish Date - Dec 23 , 2025 | 04:20 AM
భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయాన్ని (సీసీఎల్‌ఏ) రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు...
గోడలకు, బీరువాలకు ఉద్యోగ సంఘాల పోస్టర్లు ఏమిటి?
యూనియన్ నేతల ఫొటోలతో ఆఫీసు నింపేయడంపై పొంగులేటి అసహనం
సీసీఎల్‌ఏ కార్యాలయం ఆకస్మిక తనిఖీ.. జనవరిలో మళ్లీ కార్యాలయానికి వస్తా
ఆలోపు శుభ్రం చేయండి.. లేదంటే ఉపేక్షించేది లేదని హెచ్చరిక
హైదరాబాద్, డిసెంబరు 22 (ఆంధ్ర జ్యోతి): భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయాన్ని (సీసీఎల్‌ఏ) రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని గోడలు, తలుపులు, కిటికీలు, బీరువాలకు ఉద్యోగ సంఘాలకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలు అతికించి ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ‘‘ఇది సీసీఎల్‌ఏ కార్యాలయం అనుకుంటున్నారా? లేదంటే మీ సొంత ఆస్తి అనుకుటున్నారా?’’ అంటూ అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. . కార్యాలయ నిర్వహణ సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటించిన పోస్టర్లు, కరపత్రాలను వెంటనే తొలగించాలని.. కార్యాలయాన్ని శుభ్రం చేయాలని ఆదేశించారు. జనవరిలో మరోసారి తనిఖీకి వస్తానని.. ఆలోపు మార్పు కనిపించాలని, యూనియన్ నాయకుల చిత్రాలు, పోస్టర్లు కనిపిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సీసీఎల్‌ఏ ఆదర్శంగా ఉండాలని.. కార్యాలయం పరిశుభ్రంగా ఉండేందుకు ఏం కావాలో చెబితే చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, నిధులు కావాలంటే ప్రతిపాదనలు పంపితే మంజూరు చేస్తామని చెప్పారు. ప్రజలు కార్యాలయంలోకి రాగానే సానుకూల దృక్పథం కలిగేలా వాతావరణం ఉండాలని సూచించారు. సీసీఎల్‌ఏకు సంబంధించి విభాగాల వారీగా సమీక్ష చేస్తానని ఆలోపు సమాచారంతో సిద్ధంగా ఉండాలని సూచించారు. అంతకుముందు సీసీఎల్‌ఏ కార్యాలయంలో మంత్రికి ఉద్యోగ సంఘాలు స్వాగతం పలికాయి. కాగా ట్రెసా అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి నేతృత్వంలో ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ రెవెన్యూలో త్వరలో ప్రక్షాళన చేస్తున్నామని, మార్పు చూస్తారని తెలిపారు. సీసీఎల్‌కు వచ్చిన రెవెన్యూ మంత్రిని పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ కలెక్టర్ల సంఘం తరఫున లచ్చిరెడ్డి , టీజీటీఏ తరఫున రాములు , టీజీఆర్‌ఎ్‌సఏ తరఫున రాంరెడ్డి కోరారు. ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు.