kumaram bheem asifabad- ముగిసిన రెవెన్యూ సదస్సులు
ABN , Publish Date - Jun 25 , 2025 | 11:13 PM
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులు జిల్లాలో విజయవంతంగా ముగిశాయి. పైలెట్ ప్రాజెక్టుగా పెంచికల్‌పేట మండలంలో దరఖాస్తుల స్వీకరణ విజయవంతం కావడంతో ఈనెల 4 నుంచి 20 తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా సదస్సులు నిర్వహించారు. 409 రెవెన్యూ గ్రామాల పరిధిలో రైతుల నుంచి వివిధ సమస్యలపై 3,712 దరఖాస్తులు వచ్చాయి
- కొనసాగుతున్న ఆన్‌లైన్ ప్రక్రియ
- పరిశీలించి పరిష్కరించేందుకు అధికారుల చర్యలు
ఆసిఫాబాద్‌రూరల్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులు జిల్లాలో విజయవంతంగా ముగిశాయి. పైలెట్ ప్రాజెక్టుగా పెంచికల్‌పేట మండలంలో దరఖాస్తుల స్వీకరణ విజయవంతం కావడంతో ఈనెల 4 నుంచి 20 తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా సదస్సులు నిర్వహించారు. 409 రెవెన్యూ గ్రామాల పరిధిలో రైతుల నుంచి వివిధ సమస్యలపై 3,712 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల సత్వర పరిష్కారానికి కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుం టుంది. సదస్సులు ముగిసిన రోజు నుంచే ఆన్‌లైన్ ప్రక్రియ ప్రారంభించారు. మండల స్థాయిలో పరిష్కారానికి నోచుకోని దరఖాస్తులను ఉన్నతాధికారులకు పంపించనున్నారు.
- తహసీల్దార్లకు కీలక బాధ్యతలు..
భూ భారతి చట్టంలో తహసీల్దార్లకే కీలక బాధ్యతలు ప్రభుత్వం అప్పగించింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం భవిష్యత్‌లో సమస్యలు ఉత్పన్నం కాకుండా ధరణి పోర్టల్‌ను తీసుకు వచ్చింది. కానీ ధరణి ఆప్షన్‌లో తహసీల్దార్, ఆర్డీవో ఏసీ కోర్టు లేకపోవడం క్షేత్రస్థాయి నుంచి కాకుండా కలెక్టర్‌కు హక్కులను కల్పించడంతో రైతులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధరణి స్థానంలో భూ భారతి తీసుకువచ్చారు. భూ సంబందిత సమస్యల పరిష్కారంలో తహసీల్దార్ నుంచి ఆర్డీవోలకు కీలక బాధ్యతలను అప్పగిస్తూ ఈ పోర్టల్‌కు రూపకల్పన చేశారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంతో పాటు చిన్నచిన్న సాంకేతిక సమస్యలు కూడా ఉండకూడదనే ఉద్దేశ్యంతో మొదటగా పైలట్ గ్రామాలను ఎంపిక చేసి భూ భారతి రెవెన్యూ సదస్సులను నిర్వహించారు. పైలట్ గ్రామాల్లో విజయవంతం కావడంతో అన్ని గ్రామాల్లో అమలు చేశారు.
- 409 రెవెన్యూ గ్రామాల పరిధిలో..
జిల్లాలోని 409 రెవెన్యూ గ్రామాల పరిధిలో భూ భారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిం చారు. ఇందులో 3,712 మంది రైతులు తమ సమస్యలను పరిష్కారించాలని కోరుతూ దరఖాస్తులు చేసుకున్నారు. మిస్సింగ్ సర్వే నంబరు 656, పెండింగ్ మ్యూటేషన్/కోర్టు ఆర్డర్‌లు 95, డీఎస్ పెండింగ్ 658, తప్పుల సవరణకు సంబంధించి 405, విరాసత్ కోసం 271, నిషేధిత జాబితాలో నమోదైనవి 104, పీవోటీ(అటవీ, ఇతర ప్రభుత్వ భూములు) 321, సాదాబైనామా 415, ఖాతా మెర్జింగ్, ఆధార్ మిస్‌మ్యాచ్, అసైన్డ్, అటవీ, రెవెన్యూ మధ్య వివాదం తదితర వివిధ సమస్యలు 787 దరఖాస్తులు వచ్చాయి. భూములను హోల్డింగ్‌లో ఉంచడం, నిషేధిత జాబితా నుంచి తొలగించాలని, వారసత్వం, అసైన్డ్, భూ యాజమాని తండ్రిపేరు, కులం, ఆధార్ నంబర్ల తప్పులు, మ్యూటేషన్, డిజిటల్ సంతకం, పట్టాదార్ పుస్తకాల్లో భూములు ఎక్కలేదని దరఖాస్తుల్లో వివరించారు.
దరఖాస్తులు పరిశీలించి పరిష్కరిస్తాం..
- వెంకటేష్ దోత్రే, కలెక్టర్
భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరిస్తాం. జిల్లాలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 3,712 మంది రైతులు వివిధ సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు చేసుకున్నారు. మండల స్థాయిలో పరిష్కారం కానీ వాటిని జిలా అధికారులకు పంపిస్తారు. వాటిని పరిశీలించి పరిష్కారం కాకపోవడా నికి గల కారణాలను రైతులకు తెలియజేస్తాం.