Local Dispute: గ్రామాల్లో ప్రతీకార దాడులు!
ABN , Publish Date - Dec 17 , 2025 | 04:54 AM
రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ముగిసినా.. ప్రతీకార దాడులు ఆగడం లేదు. గ్రామాల్లో పార్టీ నేతల మధ్య ఘర్షణలు చోటు చేసుకోవడం, ఓటు వేయలేదంటూ దాడులకు పాల్పడడం కలకలం రేపుతోంది......
సిద్దిపేట జిల్లాలో గెలిచిన, ఓడిన అభ్యర్థుల మధ్య ఘర్షణ.. ఇద్దరికి గాయాలు
కరీంనగర్ జిల్లాలో ఓటు వేయలేదంటూ దాడి
వికారాబాద్ జిల్లాలో ఇండిపెండెంట్ అభ్యర్థినికత్తితో పొడిచిన ప్రత్యర్థి వర్గం.. కేసు నమోదు
వరంగల్ జిల్లాలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య ఘర్షణ
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ముగిసినా.. ప్రతీకార దాడులు ఆగడం లేదు. గ్రామాల్లో పార్టీ నేతల మధ్య ఘర్షణలు చోటు చేసుకోవడం, ఓటు వేయలేదంటూ దాడులకు పాల్పడడం కలకలం రేపుతోంది. సిద్దిపేట జిల్లాలోని నారాయణరావుపేట మండల కేంద్రంలో 1వ వార్డు సభ్యత్వం కోసం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన సుమలత, కనకలక్ష్మి కుటుంబాల మధ్య సోమవారం రాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. ఎన్నికలో 10 ఓట్ల మెజారిటీ సుమలత విజయం సాధించగా.. ఓడిన అభ్యర్థి కనకలక్ష్మి భర్త యాదగిరి తన ఇంటి ముందు వీధిలో ట్రాక్టర్ నిలిపి బూతులు తిట్టడం ప్రారంభించాడు. అటుగా వెళ్తున్న సుమలత కుటుంబీకులు ఎవరిని తిడుతున్నావంటూ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో సుమలత కుటుంబీకులపై యాదగిరి కర్రతో దాడికి దిగాడు. ఈ క్రమంలోనే అడ్డువచ్చిన సుమలత భర్త స్వామి, తల్లి ఎల్లవ్వ చేతికి తీవ్రగాయాలు కాగా, సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యాదగిరికి సైతం కంటి పక్కన గాయం కావడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఇరువర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్‌లో వార్డు సభ్యురాలిగా పోటీ చేసి ఓడిపోయిన ఖమర్ ఉన్నిసా.. తనకు ఓటు వేయలేదంటూ దాసరి మొగిలి కుటుంబ సభ్యులైన పద్మ, ప్రియాంకపై దాడి చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని రాకొండలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి అర్జున్‌పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. అర్జున్‌కు పొత్తి కడుపు భాగంలో గాయాలవ్వడంతో స్థానికులు వెంటనే పరిగి ఆస్పపత్రికి తరలించారు. ఓడిపోతామనే భయంతో ఓ పార్టీకి చెందిన వ్యక్తులు దాడి చేయించి ఉంటారని అర్జున్ తరపు మద్దతుదారులు ఆరోపించారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం చెరువుకొమ్ముతండాలో సోమవారం అర్ధరాత్రి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. కొందరు కాంగ్రెస్ నాయకులు చలి మంటలు కాగుతుండగా.. అదే సమయంలో బీఆర్‌ఎస్ నాయకులు అటుగా వెళ్తూ తామే గెలుస్తామంటూ నినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటమాట పెరిగి అక్కడే ఉన్న చలి మంటల కర్రలతో దాడి చేసుకున్నారు. పలువురికి గాయాలు కాగా, స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.