Share News

Revanth Reddy: పదవులు ఇంకెప్పుడిస్తారు

ABN , Publish Date - Jun 25 , 2025 | 03:57 AM

క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలకు జిల్లా స్థాయిలో నామినేటెడ్‌ పోస్టులు ఇవ్వడంలో జాప్యం జరుగుతుండడంపై సీఎం రేవంత్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

Revanth Reddy: పదవులు ఇంకెప్పుడిస్తారు

  • జిల్లా స్థాయి నామినేటెడ్‌ పదవులు భర్తీ చేయరా?

  • పేర్లను షార్ట్‌ లిస్ట్‌ చేయడానికి జాప్యం ఎందుకు?

  • జిల్లాల ఇన్‌చార్జి మంత్రులపై సీఎం రేవంత్‌ అసహనం

  • నామినేటెడ్‌ పదవుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలి

  • స్థానిక ఎన్నికలపై కోర్టు తీర్పు రాగానే నిర్ణయం

  • గాంధీభవన్‌లో గొర్రెలతో నిరసన తెలపడమేంటి?

  • టీపీసీసీ పీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు

  • క్రమశిక్షణ కమిటీ భేటీ.. రేపు మరోసారి సమావేశం

హైదరాబాద్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలకు జిల్లా స్థాయిలో నామినేటెడ్‌ పోస్టులు ఇవ్వడంలో జాప్యం జరుగుతుండడంపై సీఎం రేవంత్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటై 18 నెలలు గడిచినా.. జిల్లా స్థాయిల్లోని నామినేటెడ్‌ పోస్టులను ఎందుకు భర్తీ చేయడంలేదని జిల్లాల ఇన్‌చార్జి మంత్రులను ప్రశ్నించారు. గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాలు (పీఏసీ), సలహా కమిటీల ఉమ్మడి సమావేశంలో సీఎం పాల్గొని మాట్లాడారు. ‘‘క్షేత్రస్థాయి నాయకులకు పదవులు వద్దా? జిల్లా స్థాయిల్లో మార్కెట్‌ కమిటీలు, దేవాలయాల పాలక మండళ్లు వంటి నామినేటెడ్‌ పోస్టులకు పేర్లను షార్ట్‌ లిస్ట్‌ చేయడంలో జాప్యం ఎందుకు జరుగుతోంది? అన్నీ నేను చేయలేను కదా? ఇన్‌చార్జి మంత్రులు.. పేర్లను షార్ట్‌ లిస్ట్‌ చేసి ఇస్తే వెంటనే క్లియర్‌ చేస్తాను కదా?’’ అని రేవంత్‌ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. పేర్లను వెంటనే షార్ట్‌ లిస్ట్‌ చేసి ఇవ్వాలని, స్థానికంగా ఉన్న సమస్యలనూ తక్షణమే పరిష్కరించాలని ఆయన సూచించారు. సోమవారం కొందరు యాదవ సంఘాల నేతలు గాంధీభవన్‌లోకి గొర్రెలను, మేకలను తోలుకొచ్చి నిరసన తెలపడంపై సీఎం సీరియస్‌ అయ్యారు. ‘‘గాంధీభవన్‌లోకి ఇట్లాంటివి ఎలా అనుమతించారు? సమస్యలుంటే టీపీసీసీ అధ్యక్షుడికో, నాకో చెప్పవచ్చు. అంతర్గత సమావేశాల్లోనూ చెప్పుకోవచ్చు. గాంధీభవన్‌లో ఇలా ధర్నాలు చేస్తే ఎలా? ఇవాళ యాదవ కులం నేతలు, రేపు ఇంకో కులం నేతలు చేస్తారు’’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. నిరసనలకూ ఒక పరిమితి ఉంటుందని, ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దని అన్నారు. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారన్న భయం ఉండాలన్నారు.


కోర్టు తీర్పు రాగానే స్థానికంపై నిర్ణయం..

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కోర్టు తీర్పు రాగానే నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కోర్టు నుంచి సానుకూల నిర్ణయమే వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు లేకపోవడంతో ఒత్తిడి అంతా ఎమ్మెల్యేలు, మంత్రులపైనే పడుతోందని, త్వరితగతిన స్థానిక ఎన్నికలు జరిపించాలని పలువురు పీఏసీ సభ్యులు కోరడంతో.. సీఎం స్పందించారు. ఇన్‌చార్జి మంత్రులు.. పార్టీ ఎమ్మెల్యేలను, నాయకులను సమన్వయం చేసుకుని స్థానిక ఎన్నికల్లో పార్టీని గెలిపించుకునే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఇక జూబ్లీహిల్స్‌ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు అభ్యర్థిత్వంపై మీడియా ముఖంగా ఎవరూ మాట్లాడొద్దని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఏదైనా చెప్పదలచుకుంటే పార్టీ అంతర్గత వేదికల్లో చెప్పుకోవాలని సూచించారు. ఇప్పటివరకు అభ్యర్థి ఖరారు కాలేదని, ఎవరిని నిలపాలన్నది హైకమాండ్‌ నిర్ణయిస్తుందని చెప్పారు. జిల్లా ఇన్‌న్‌ర్జి మంత్రిగా ఈ ఉప ఎన్నికకు పార్టీ నేతలందరినీ సమన్వయం చేసుకుని రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సూచించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని డివిజన్ల వారీగా సమస్యలను గుర్తించాలని, వాటిని పరిష్కరిద్దామని అన్నారు.


పార్టీ, ప్రభుత్వం జోడెద్దుల్లా పనిచేయాలి..

పార్టీ, ప్రభుత్వం జోడెద్దుల్లా సమన్వయంతో పని చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బూత్‌, గ్రామ, మండల స్థాయిల్లో పార్టీ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బూత్‌ స్థాయిలో పార్టీ బలంగా ఉంటేనే ప్రభుత్వ పథకాలను సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతామని పేర్కొన్నారు. ఈ మేరకు పార్టీ నిర్మాణంపై పీసీసీ దృష్టి పెట్టాలన్నారు. నేతలంతా ఐక్యంగా పనిచేయాలని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను మరోమారు అధికారంలోకి తీసుకొచ్చేలా పనితీరు ఉండాలని అన్నారు. పార్టీ కమిటీల్లో ఉన్న నాయకులు క్షేత్ర స్థాయిలో పని చేయాల్సిందేనని, అలా పనిచేసిన వారికే పదవులు వస్తాయని స్పష్టం చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన వారికి పదవులు ఇచ్చామని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో అనేక సవాళ్లను ఎదుర్కొనబోతున్నామని, నియోజకవర్గాల పునర్విభజన, జమిలి ఎన్నికలు వంటి అంశాలు ముందుకు రాబోతున్నాయని తెలిపారు. నాయకులంతా క్రమశిక్షణతో వ్యవహరించాలన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌ మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడ్డ వారికి తప్పకుండా అవకాశాలు లభిస్తాయన్నారు.

4న ఖర్గే రాక..!

జూలై 4న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యక్రమం హైదరాబాద్‌లో ఉందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ తెలిపారు. ఇందుకు సంబంధించి మరోమారు టీపీసీసీ పీఏసీ సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో అద్భుతమైన ప్రజా పాలన కొనసాగుతోందని కితాబునిచ్చారు. ఏఐసీసీ పిలుపు ఇచ్చిన జైబాపు.. జై భీమ్‌.. సంవిధాన్‌, సంస్థాగత నిర్మాణం తదితర కార్యక్రమాలు రాష్ట్రంలో చాలా బాగా అమలవుతున్నాయని ఏఐసీసీ నేతలు అభినందించినట్లు చెప్పారు. కాగా.. రాష్ట్ర ప్రభుత్వం 18 నెలల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క వివరించారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌.. వివిధ పత్రికల్లో రాసిన వ్యాసాల సంకలనం.. ‘విధ్వంసం నుంచి వికాసం వైపునకు’ పుస్తకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి, మీనాక్షీ నటరాజన్‌, భట్టివిక్రమార్క ఆవిష్కరించారు.

Updated Date - Jun 25 , 2025 | 05:32 AM