Share News

CM Revanth Reddy Pledges: ఈ గెలుపుతో బాధ్యత మరింత పెరిగింది

ABN , Publish Date - Nov 15 , 2025 | 04:45 AM

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో గెలుపుతో తమ బాధ్యత మరింత పెరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 51 శాతం ఓట్లతో ప్రజలు కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించారని....

CM Revanth Reddy Pledges: ఈ గెలుపుతో బాధ్యత మరింత పెరిగింది

  • జూబ్లీహిల్స్‌ ఓటర్లు కాంగ్రె్‌సను ఆశీర్వదించారు.. 51ు ఓట్లతో అండగా నిలిచారు

  • హరీశ్‌ అసూయనుకేటీఆర్‌ అహంకారాన్ని తగ్గించుకోవాలి

  • కిషన్‌రెడ్డి తన వ్యవహార శైలిని మార్చుకోవాలి

  • మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి

  • 17న ‘స్థానిక’ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడి

హైదరాబాద్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో గెలుపుతో తమ బాధ్యత మరింత పెరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 51 శాతం ఓట్లతో ప్రజలు కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించారని, రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంటున్న సందర్భంలో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ప్రజలు కాంగ్రె్‌సను ఆశీర్వదించారని తెలిపారు. ‘అభివృద్ధి కార్యాచరణతో ముందుకు వెళ్లండి, బాధ్యతతో కార్యక్రమాలను నిర్వహించండి’ అంటూ దీవించారని పేర్కొన్నారు. తాము దీన్ని బాధ్యతగా స్వీకరిస్తామని, హైదరాబాద్‌ మహా నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఎన్నికల్లో నెగ్గితే పొంగిపోవడం, ఓడితే కుంగిపోవడం కాంగ్రెస్‌కు తెలియదని.. ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యలపై పోరాడడం, ప్రభుత్వంలో ఉంటే సమస్యల పరిష్కారానికి ప్రయత్నించడమే తెలుసని అన్నారు. అందుకే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పార్టీ ఇంకా మనుగడ సాగిస్తూనే ఉందన్నారు. 51ు ఓట్లతో కాంగ్రెస్‌కు ఎన్నడూ లేనంత బలం వచ్చిందని తెలిపారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎ్‌సకు 38ు, బీజేపీకి 8ు ఓట్లు వచ్చాయని వివరించారు. ఉప ఎన్నికలో విజయం సాధించిన అనంతరం రేవంత్‌రెడ్డి శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్‌ యాదవ్‌, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, సీతక్క, వాకిటి శ్రీహరి, వివేక్‌ పాల్గొన్నారు. సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ రాష్ట్రమంతా తిరిగారని, తామూ అలాగే తిరిగామని చెప్పా రు. అప్పుడు ప్రజలు తమకు 65 సీట్లు, బీఆర్‌ఎ్‌సకు 38 సీట్లు ఇచ్చారన్నారు. తమకు 38.5ు ఓట్లు రాగా, బీఆర్‌ఎస్‌కు 37ు ఓట్లు వచ్చాయని చెప్పారు. 8 సీట్లు బీజేపీకి, 7 సీట్లు మజ్లి్‌సకు ఇచ్చారన్నారు. ఆరు నెలల తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తమ ఓట్లు 38.5 నుంచి 41 శాతానికి పెరిగాయని గుర్తుచేశారు. 8 ఎంపీ సీట్లు కాంగ్రె స్‌కు ఇవ్వగా.. 35ు ఓట్లతో 8 సీట్లను బీజేపీకి, ఒక సీటు మజ్లి్‌సకు కట్టబెట్టారని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షే మ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, వాటి అమలుకు కొంత సమయం పడుతుందని, ఈ విషయాలను ప్రజలు అర్థం చేసుకుని తమకు అవకాశం ఇస్తూ వస్తున్నారని చెప్పారు. ‘‘రాష్ట్రంలో 60-65ు ఆదాయం ఈ జంట నగరాల నుంచే వస్తోంది. దాన్ని అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్రం నలుమూలలా ఖర్చు పెడుతున్నాం. ఈ నగరాన్ని కాపాడుకోవడం, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రణాళికలను రచించడం వంటి చర్యలను చేపడుతున్నాం’’ అని అన్నారు


మహానగరంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం

‘‘ప్రజలు మన వ్యవహార శైలిని గమనించి, స్పష్టమైన తీర్పు ఇచ్చారు. హైదరాబాద్‌ను మహా నగరంగా తీర్చిదిద్దుతాం. పెట్టుబడులను ఆకర్షించి నగరాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. నగరంలో చెత్త సమస్య పెరిగిపోయింది. చెరువులు, కుంటల్లో కబ్జాలను తొలగించి, నగరాన్ని సమస్యల రహితంగా చేయడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం’’ అని సీఎం రేవంత్‌ చెప్పారు. బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియాలో తప్పుడు వార్తలతో ప్రభుత్వాన్ని అవమానిస్తూ విష ప్రచారం చేశారని ఆరోపించారు. హైదరాబాద్‌లో గంజాయి, డ్రగ్స్‌ను అరికట్టడానికి ఈగల్‌ ఫోర్స్‌ను, కబ్జాలను తొలగించడానికి హైడ్రాను తీసుకొచ్చామని చెప్పారు. తమ ప్రయత్నాలకు బీఆర్‌ఎస్‌ సహకరించకపోగా.. ప్రతి సందర్భంలో అడ్డు తగిలిందన్నారు. మూసీ నిర్వాసితుల అంశంలో ప్రతి నిమిషం ప్రధాన ప్రతిపక్షం అడ్డు తగిలిందని పేర్కొన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు, నిధుల విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సహాయ నిరాకరణ చేస్తున్నారని ఆరోపించారు.

కిషన్‌రెడ్డి ప్రచారం చేసినా.. బీజేపీకి 17 వేల ఓట్లే!

‘‘కేటీఆర్‌, హరీశ్‌, కిషన్‌రెడ్డిలకు ప్రధాన బాధ్యతలు ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సిన అనుమతులు, నిధులు రాకుండా కిషన్‌రెడ్డి అడ్డు తగులుతున్నారు. మెట్రో, మూసీ ప్రక్షాళన, నగరానికి గోదావరి జలాల తరలింపు, రీజినల్‌ రింగు రోడ్డు విషయంలో అడ్డుపుల్లలు వేస్తున్నారు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. అందుకే పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నియోజకవర్గంలోని ఇదే జూబ్లీహిల్స్‌ సెగ్మెంటులో 65 వేల ఓట్లు కిషన్‌రెడ్డికి వేసిన ప్రజలు.. ఇప్పుడు కిషన్‌రెడ్డే అభ్యర్థిగా మారి, ప్రచారం చేస్తే బీజేపీకి 17 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ పార్టీకి డిపాజిట్‌ గల్లంతైంది. కిషన్‌రెడ్డి తన వ్యవహార శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. 2014, 2019, 2023లలో ఈ ప్రాంతం నుంచి బీజేపీని గెలిపించారు. జంట నగరాల్లో ప్రజలు మెట్రో విస్తరణ, గోదావరి జలాలు, మూసీ ప్రక్షాళన, ఆర్‌ఆర్‌ఆర్‌, రేడియల్‌ రోడ్లను కోరుకుంటున్నారు. ఈ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను ఇతర రాష్ట్రాలకు తీసుకెళుతున్నప్పుడు మీరు అడ్డుకోకుండా ప్రేక్షక పాత్ర పోషించారని ప్రజలు తెలుసుకోవడం వల్లే బీజేపీకి ఇలాంటి పరిస్థితి దాపురించింది. ఇప్పటికైనా కిషన్‌రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి, మహా నగర అభివృద్ధికి సహకరించాలి’’ అని రేవంత్‌ కోరారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు మాట్లాడుతుంది. మిగతా సమయాల్లో రాజకీయాల జోలికి పోదు. కిషన్‌రెడ్డిని సాదరంగా ఆహ్వానిస్తున్నా. సచివాలయానికి రండి. కేంద్రం వద్ద పెం డింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల గురించి చర్చించుకుందాం. మా ఉప ముఖ్యమంత్రికి సూచన చేస్తున్నా. డిసెంబరు 1నుంచి పార్లమెంటు సమావేశాలు జరగబోతున్నాయి. కేంద్రం వద్ద అనుమతుల కోసం ఉన్న ప్రాజెక్టులు, ఇవ్వాల్సిన నిధులపై ఒక నివేదికను ఎంపీలు, కేంద్ర మంత్రులకు ఇవ్వండి. కేంద్ర మంత్రులు సంజయ్‌, కిషన్‌రెడ్డి; బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఎంపీలకు, మన ఎంపీలకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించండి’’ అని సీఎం చెప్పారు.


మీడియా విశ్వసనీయతను కోల్పోవద్దు..

‘‘మీడియాకు ముందే చెప్పా. ఎన్నికల సందర్భంగా వాళ్లు ఏదో ప్రచారం చేస్తారు. మీ విశ్వసనీయతను పోగొట్టుకోకండని చానెళ్లు, పేపర్లకు చెప్పా. బీఆర్‌ఎస్‌ ఓడుతుందని, బీజేపీ డిపాజిట్‌ కోల్పోతుందనీ చెప్పా. ఇప్పుడదే జరిగింది కదా? పెయిడ్‌ ఆర్టికల్స్‌ కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. ఓట్ల లెక్కింపులో మూడో రౌండులో బీఆర్‌ఎ్‌సకు 211 ఓట్లు ఎక్కువ రాగానే.. పెద్ద పెద్ద బ్రేకింగులు ఇచ్చారు. ఫలితం మాకు అనుకూలంగా ఉందని తెలుస్తున్నా.. ఆ చానెళ్లు ఇంకా బీఆర్‌ఎ్‌సను బతికించడానికి ఉత్సాహం చూపాయి. మిగతా రాష్ట్రాల మాదిరిగా చానెళ్లను కనిపించకుండా చేయడం ఒక్క నిమిషం పని. చానెళ్లలో ఇంత బరితెగింపు, అడ్డగోలుతనం పనికి రాదు’’ అని మీడియా సంస్థలకు రేవంత్‌ హితవు పలికారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికకు సహకరించిన మీడియా సంస్థలు, ప్రజలు, సీపీఐ, సీపీఎం, మజ్లి స్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయం తన చేతిలో లేదని, కేటీఆర్‌ చేతిలోనూ లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.

కేసీఆర్‌ క్రియాశీల రాజకీయాల్లో లేరు

కేసీఆర్‌ను తప్పించి, ఆ కుర్చీని గుంజుకోవాలని హరీశ్‌, కేటీఆర్‌ పోటీ పడుతున్నారని మరో ప్రశ్నకు సమాధానంగా సీఎం రేవంత్‌ చెప్పారు. కేసీఆర్‌ క్రియాశీల రాజకీయాల్లో లేరు. వారి ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగానే ఉంది. అలాంటి నాయకుణ్ని విమర్శించడం భావ్యం కాదని భావిస్తున్నా’’ అని అన్నారు. 17న క్యాబినెట్‌ సమావేశంలో మంత్రుల సూచనలు తీసుకుని, స్థానిక సంస్థల ఎన్నికలపై ఒక నిర్ణయానికి వస్తామని చెప్పారు.


నవీన్‌ యాదవ్‌కు అభినందనలు

ఉప ఎన్నికలో విజయం సాధించిన నవీన్‌ యాదవ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు అభినందించారు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేశారు.

అసూయ, అహంకారాన్ని తగ్గించుకోవాలి

‘‘బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ అసూయను తగ్గించుకోవాలి. కేటీఆర్‌ అహంకారాన్ని తగ్గించుకోవాలి. నీ వయసు నాకంటే తక్కువే. ఇంకా చాలా రోజుల పాటు మనం రాజకీయాల్లో కొనసాగాల్సి ఉంది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. వారసత్వ సంపదా కాదు. తాతలు, ముత్తాతల ఆస్తిలో ఎన్టీఆర్‌ కల్పించిన హక్కు వల్ల ఆడ పిల్లలు కూడా వాటా అడుగుతున్నారు. ఆస్తి కూడా మనకు పూర్తిగా రాదు. ప్రతిపక్షంగా కొంత సంయమనం పాటించాలి. అసెంబ్లీలో హరీశ్‌రావు కూర్చుని, మావైపు చూసే చూపులను చూస్తే నిజంగానే ఆ చూపులకు శక్తి ఉంటే.. కాంగ్రెస్‌ సీట్లు మాడి మసైపోయి, బూడిదైపోయి, భూమిలో కలిసిపోయేటట్లు ఉంటాయి. రక్తమంతా మొహంలోకి తెచ్చుకుని చూస్తుంటాడు. దాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఇక కేటీఆర్‌కు అహంకారం ఉంది. అధికారం పోయినా ఆయనకు అసూయ, ఈయనకు అహంకారం తగ్గలేదు. ఇంకా ప్రభుత్వానికి మూడేళ్లు ఉంది. రెండేళ్లు ఓపిక పట్టండి. చివరి సంవత్సరంలో రాజకీయాలు చేద్దాం. రెండేళ్ల పాటు ప్రతిపక్షంగా సహకరించండి. సమస్యలను లేవనెత్తండి. ప్రభుత్వానికి సూచనలు చేయండి. అవసరమనుకుంటే సమస్యలపై ధర్నా చేయండి. మాకు అభ్యంతరం లేదు. చట్ట సభల్లో చర్చలు చేయండి. ప్రభుత్వాన్ని ప్రశ్నించండి’’ అని రేవంత్‌ బీఆర్‌ఎస్‌ నేతలకు సూచించారు. ‘‘నువ్వు డబ్బులు పెడుతున్న సోషల్‌ మీడియా నువ్వు చెప్పిందే రాస్తుంది. అదే చదువుకొని, భ్రమలో ఉండి మాట్లాడుతున్నావు. ఫేక్‌ న్యూస్‌ను నువ్వే క్రియేట్‌ చేసి, వాటిని నువ్వే నమ్మి, నువ్వే సర్వేల పేరిట కొంత మందికి నగదు ఇచ్చి మాట్లాడుతున్నావు’’ అని కేటీఆర్‌ను ఎద్దేవా చేశారు.

Updated Date - Nov 15 , 2025 | 04:45 AM