CM Revanth Reddy: మత విద్వేషాలను అణచివేస్తాం
ABN , Publish Date - Dec 21 , 2025 | 05:27 AM
తెలంగాణలో మత విద్వేషాలకు తావులేదని, ఎవరి మతాన్ని వారు ఆచరిస్తూనే ఇతర మతాలను గౌరవించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
ఇతర మతాలను కించపరిస్తే కఠిన చర్యలు.. కర్ణాటక తరహాలో చట్టం తెస్తాం
అన్ని మతాలకు సమాన గౌరవం కల్పిస్తాం
ప్రేమను పంచాలి.. శాంతిని పెంచాలనే ప్రభువు బోధనలే ప్రజా ప్రభుత్వానికి దిక్సూచి
సంక్షేమంలో తెలంగాణను నంబర్‌వన్ చేస్తాం
స్మశానాల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం
ఎల్బీస్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన
క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో మత విద్వేషాలకు తావులేదని, ఎవరి మతాన్ని వారు ఆచరిస్తూనే ఇతర మతాలను గౌరవించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మత ప్రాతిపదికన దాడులు చేయాలని చూసిన వారిని, అలాంటి ఘటనలను ప్రభుత్వం అణచివేసిందని తెలిపారు. ఇతర మతాలను కించపరిస్తే శిక్షించే విధంగా కర్ణాటక తరహాలో శాసనసభలో చట్టం తెస్తామని ప్రకటించారు. ఎవరైనా ఇతర మతాలను కించపరిచేలా ప్రసంగించినా, దాడులకు పాల్పడినా కఠినంగా శిక్షించడానికి ఉన్న చట్టాలను కూడా సవరిస్తామని, అన్ని మతాలకు సమాన గౌరవాన్ని కల్పిస్తామని అన్నారు. మానవ సేవయే మాధవ సేవ అని, ద్వేషించే వారిని కూడా ప్రేమించాలన్న ఏసు క్రీస్తు బోధనలే ప్రజా ప్రభుత్వానికి దిక్సూచి అని పేర్కొన్నారు. శనివారం ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై కీలక ప్రసంగం చేశారు. మైనారిటీలకు అందించే సంక్షేమం ఎవరి దయ కాదని, అది వారి హక్కు అని స్పష్టం చేశారు. క్రైస్తవ, ముస్లిం సోదరులు ఎదుర్కొంటున్న స్మశానవాటికల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏసు క్రీస్తు జన్మించిన డిసెంబరు నెల కేవలం క్రైస్తవులకే కాకుండా.. తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి ఒక మిరాకిల్ మంత్ అని సీఎం అభివర్ణించారు. తెలంగాణ ప్రదాత సోనియాగాంధీ పుట్టిన నెల, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నెల కూడా ఇదేనని గుర్తుచేశారు.
అడ్డంకులు ఎదురైనా తగ్గం..
ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎవరు ఎంత దుష్ప్రచారం చేసినా వెనక్కి తగ్గకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘‘రాష్ట్రంలో 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తూ పేదల ఇళ్లలో వెలుగులు నింపాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. అర్హులైన ప్రతి పేద కుటుంబానికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నాం. రాష్ట్రంలోని 3కోట్ల 10 లక్షల మందిని మా కుటుంబ సభ్యులుగా భావించి నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. రుణమాఫీ చేయడంతోపాటు సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చి వ్యవసాయాన్ని పండగలా మార్చాం’’ అని రేవంత్‌రెడ్డి వివరించారు. గతంలో జవహర్‌లాల్ నెహ్రూ విద్యకు, సాగునీటి రంగాలకు ప్రాధాన్యమిస్తే.. క్రిస్టియన్ మిషనరీలు ఒక యజ్ఞంలా విద్య, వైద్య రంగాల్లో పేదలకు విశేష సేవలందించాయని కొనియాడారు. ప్రభుత్వంతో పోటీపడి వారు చేసిన సామాజిక సేవ అభినందనీయమన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ప్రకటించారు. సంక్షేమంలో, అభివృద్ధిలో దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు క్రిస్మస్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, అజారుద్దీన్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.