Share News

TG BJP President Ramchander Rao: రేవంత్‌కు కిషన్‌రెడ్డి ఫోబియా

ABN , Publish Date - Sep 21 , 2025 | 06:31 AM

సీఎం రేవంత్‌కు ఇప్పటికే బీజేపీ ఫోబియా ఉండగా, తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫోబియా కూడా పట్టుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు.

TG BJP President Ramchander Rao: రేవంత్‌కు కిషన్‌రెడ్డి ఫోబియా

  • ‘ఓట్‌ చోరీ’ అంటూ రాహుల్‌ భయాందోళనల సృష్టి

  • కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణ కోరాలి

  • జూబ్లీహిల్స్‌ ఎన్నికపై త్వరలో బీజేపీ ఎన్నికల కమిటీ

  • మీడియాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌కు ఇప్పటికే బీజేపీ ఫోబియా ఉండగా, తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫోబియా కూడా పట్టుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రేవంత్‌.. కిషన్‌రెడ్డిని, కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని విమర్శించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్‌రావు మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. బోగస్‌ ఓట్ల తొలగింపు బాధ్యత ఎన్నికల సంఘానిదే అని ఆయన స్పష్టం చేశారు. బోగస్‌ ఓట్ల సృష్టికర్త ఎంఐఎం పార్టీ అని, దానికి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మద్దతు ఇస్తున్నాయని మండిపడ్డారు. దేశంలో ఓటు చోరీ అన్న అంశమే లేదని, చాలా మందికి రెండు ప్రాంతాల్లో ఓట్లు ఉన్నాయని తెలిపారు. ‘ఓటు చోరీ వేరు, బోగస్‌ ఓట్లు వేరు. అసలు ఓటు చోరీ అన్న అంశమే ఉత్పన్నం కాదు. ఎందుకంటే, ఓటును ఎలా చోరీ చేస్తారు..? ఓటు హక్కు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ఓటు తొలగింపు మాత్రం ఆన్‌లైన్‌లో సాధ్యం కాదని ఎన్నికల సంఘమే స్పష్టం చేసింది’ అని వివరించారు. ఓటు చోరీ జరిగిందంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ దేశంలో భయాందోళనలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన నష్టానికి సంబంధించి మాత్రమే కాకుండా ఆ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ కోరాలని రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు.


జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారణ తర్వాత రాజకీయ నాయకులను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు సంబంధించి త్వరలో బీజేపీ ఎన్నికల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు రాంచందర్‌రావు తెలిపారు. ఆ కమిటీయే అభ్యర్థిని ఖరారు చేస్తుందని చెప్పారు. మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తేలేదని రాంచందర్‌రావు అన్నారు. ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం రెండూ ఒక్కటేనని స్పష్టం చేశారు. ‘అప్పులు, అవినీతి, నిరుద్యోగంలో తెలంగాణ రైజింగ్‌’ అని రాంచందర్‌రావు విమర్శించారు.

Updated Date - Sep 21 , 2025 | 06:38 AM