Share News

CM Revanth Reddy: రేషన్‌, ఆధార్‌ సహాఆస్తులనూ లాక్కుంటారు

ABN , Publish Date - Dec 15 , 2025 | 04:32 AM

సమగ్ర ఓటర్‌ జాబితా సవరణ ఎస్‌ఐఆర్‌ పేరుతో దేశంలోని దళితులు, మైనార్టీలు, ఆదివాసీలు, పేదల ఓట్లను కేంద్ర ప్రభుత్వం తొలగిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు....

CM Revanth Reddy: రేషన్‌, ఆధార్‌ సహాఆస్తులనూ లాక్కుంటారు

  • ‘ఓట్‌ చోరీ’ కాంగ్రెస్‌ సమస్య కాదు.. దేశ సమస్య: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

న్యూఢిల్లీ, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): సమగ్ర ఓటర్‌ జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) పేరుతో దేశంలోని దళితులు, మైనార్టీలు, ఆదివాసీలు, పేదల ఓట్లను కేంద్ర ప్రభుత్వం తొలగిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఓట్ల తొలగింపుతో ఎస్‌ఐఆర్‌ ఆగదని.. ఆ తర్వాత ఈ వర్గాల ఆధార్‌, రేషన్‌, భూములు, ఆస్తులనూ లాక్కుంటారని అన్నారు. ‘ఓట్‌ చోరీ’ (ఓట్ల తస్కరణ) కాంగ్రెస్‌ పార్టీ సమస్య కాదని, యావత్‌ భారతదేశ సమస్య అని పేర్కొన్నారు. ఓట్‌ చోరీపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ సాగిస్తున్న పోరాటంలో దేశ ప్రజలంతా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ‘ఓట్‌ చోర్‌ - గద్దీ ఛోడ్‌’ పేరుతో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. ‘దేశ ప్రజల రాజ్యాంగ హక్కుల కోసం రాహుల్‌గాంధీ యుద్ధం చేస్తున్నారు. దీనికి ప్రజలంతా మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. లేదంటే.. ఇది ఓట్‌ చోరీతోనే ఆగేది కాదు. ముందు ఓటర్‌ లిస్టు నుంచి పేరును తొలగిస్తారు. ఆ తర్వాత ఆధార్‌ కార్డు, రేషన్‌కార్డు, భూమి, ఆస్తులను సైతం లాక్కుంటారు. రాజ్యాంగసభలో విస్త్రృతంగా చర్చించి రాజ్యాంగాన్ని రూపొందించారు. నాడు దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, నిరుపేదలకు ఓటు హక్కు కల్పించాలని మహాత్మా గాంధీ, డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ కోరారు. పేదలకు ఓటు హక్కు ఇచ్చి ప్రభుత్వ ఏర్పాటులో వారికి అవకాశం కల్పించారు. కానీ.. ఆర్‌ఎ్‌సఎస్‌ ఈ వర్గాలకు ఓటు హక్కును నిరాకరించింది. ఆర్‌ఎ్‌సఎస్‌ నేత గోల్వాల్కర్‌.. దళిత, గిరిజన, మైనార్టీ వర్గాలకు ఓటు హక్కు ఇవ్వరాదని వాదించారు. ఆయన ఆలోచనా విధానాన్ని ఇప్పుడు అమలు చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రయత్నిస్తున్నారు. అందుకోసమేగత లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు ఇవ్వాలని ప్రజలను అడిగారు. బీజేపీకి 400 సీట్లు వేస్త రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేన్లను రద్దు చేస్తారని రాహుల్‌గాంధీ నాడే చెప్పారు. అందుకే ప్రజలు బీజేపీకి 240 సీట్లతో సరిపెట్టారు. కాబట్టే రాజ్యాంగం రక్షించబడింది. ఒకవేళ వారికి 400 సీట్లు వచ్చి ఉంటే బహిరంగంగానే రాజ్యాంగాన్ని తొలగించేవారు. అన్ని సీట్లు రాలేదు కాబట్టే వారు ఎస్‌ఐఆర్‌, ఓట్‌ చోరీ ద్వారా దళిత, ఆదివాసీ, మైనార్టీ, నిరుపేదల ఓట్లు తొలగించే పనిలో పడ్డారు. గతంలో ఈ వర్గాల కోసం మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌ పోరాడగా.. ఇప్పుడు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే నిలబడ్డారు. ఓట్‌ చోరీ అనేది కాంగ్రెస్‌ సమస్య కాదు. దేశ సమస్య. ఈ యుద్ధంలో మనమంతా రాహుల్‌ గాంధీకి మద్దతుగా నిలవాలి’ అని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.


దావో్‌సకు సీఎం రేవంత్‌

  • జనవరి 19 నుంచి 23 వరకు సదస్సు

ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ నేతలు, పారిశ్రామిక దిగ్గజాలు కలుసుకునే చోటు.. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం స్విట్జర్లాండ్‌లోని దావో్‌సలో ఏటా నిర్వహించే సదస్సు! ఈసారి ‘స్పిరిట్‌ ఆఫ్‌ డైలాగ్‌’ థీమ్‌తో జనవరి 19 నుంచి 23 వరకూ జరగనున్న ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 130 దేశాల నుంచి 3 వేల మంది నాయకులు.. సుమారు 60 మంది దేశాధినేతలు ఈ సదస్సులో పాల్గొననున్నారు. ముఖ్యంగా..ఈసారి భారత్‌ నుంచి ఎక్కువ సంఖ్యలో ప్రాతినిధ్యం ఉండనుంది. దేశంనుంచి నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వంద మందికిపైగా సంస్థల సీఈవోలు హాజరుకానున్నట్టు సమాచారం. 2024, 2025లో దావోస్‌ సదస్సుకు వెళ్లిన తెలంగాన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఈసారి కూడా ఆ సదస్సుకు హాజరుకానున్నట్లు సమాచారం. ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌తోపాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఇక.. భారత్‌ నుంచి హాజరుకానున్న వ్యాపారవేత్తల్లో.. రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, టాటా గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌, బజాజ్‌ గ్రూప్‌కు చెందిన సంజీవ్‌ బజాజ్‌, భారతి గ్రూప్‌ అధినేత సునీల్‌ భారతి మిట్టల్‌తోపాటు , ఇన్ఫోసిస్‌, విప్రో, యాక్సిస్‌ బ్యాంక్‌, పేటీఎం, జెరోధా సంస్థల ప్రతినిధులు, పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల ముఖ్య అధికారులు ఉన్నారు. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్‌ బంగా, ఐఎంఎఫ్‌ అధినేత క్రిస్టలినా జార్జీవా, యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డెర్‌ లేయెన్‌ వంటి ప్రముఖులు కూడా ఈ వేదికపై కనిపించనున్నారు. ప్రభుత్వాలు-ప్రైవేటు రంగం కలిసి భవిష్యత్తును నిర్మించాల్సిన అవసరంపై సదస్సులో చర్చ జరగనుందని సమాచారం.

Updated Date - Dec 15 , 2025 | 04:32 AM