Sarojini Naidu Vanita Mahavidyalaya: ఆ నూనెతో వంటఆరోగ్యానికి పెద్ద తంటా!
ABN , Publish Date - Dec 17 , 2025 | 06:14 AM
రోడ్డు మీద టిఫిన్ సెంటరో, వీధి చివరన మిర్చీలు, బజ్జీల స్ట్రీట్ ఫుడ్ దుకాణమో ఉంటుంది.. రుచిగా ఉంటాయని వెళ్లి ఆబగా లాగించేస్తుంటాం....
మళ్లీ మళ్లీ వేడి చేసిన నూనెలతో క్యాన్సర్ల ముప్పు.. నూనె తగ్గితే అందులోనే తాజా నూనె పోస్తూ వాడకం
3, 4 సార్లకు మించి వాడితే ప్రమాదం
వాటిలో కార్సినోజెనిక్ రసాయనాలు
మహిళల్లో పెరుగుతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్
సరోజనినాయుడు వనితా మహా విద్యాలయ పరిశోధకుల అధ్యయనం
హైదరాబాద్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రోడ్డు మీద టిఫిన్ సెంటరో, వీధి చివరన మిర్చీలు, బజ్జీల స్ట్రీట్ ఫుడ్ దుకాణమో ఉంటుంది.. రుచిగా ఉంటాయని వెళ్లి ఆబగా లాగించేస్తుంటాం. కానీ చాలా మంది ఒకే నూనెను మళ్లీ మళ్లీ మరిగిస్తూ, అందులోనే తినుబండారాలన్నీ వేయిస్తుంటారు. ఇలా మళ్లీ మళ్లీ మరిగిస్తూ ఉపయోగిస్తున్న నూనెలతో కేన్సర్ల ముప్పు పొంచి ఉందని తాజా అధ్యయనం తేల్చింది. చాలా టిఫిన్ సెంటర్లు, స్ట్రీట్ ఫుడ్ షాపుల్లో నూనెలు ఏమాత్రం కూడా భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ) నిర్దేశించిన ప్రమాణాల మేరకు లేవని గుర్తించింది. హైదరాబాద్‌లోని సరోజనినాయుడు వనిత మహావిద్యాలయ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పీజీ న్యూట్రిషియన్ డైటెటిక్స్‌కు చెందిన చొల్లేటి వెన్నెల చోల్లెటి, అయ్యగారి వసుంధర నేతృత్వంలో జరిగిన అధ్యయనం నివేదిక తాజాగా ఇన్ఫోమేటిక్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. అధ్యయనంలో భాగంగా నల్లగొండ పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న టిఫిన్ సెంటర్లు, స్ట్రీట్‌ఫుడ్ కేంద్రాల నుంచి వాడుతున్న నూనెల శాంపిళ్లను సేకరించారు. నూనె వాడకంపై వాటి నిర్వాహకులకు అవగాహన తేల్చడానికి పలు ప్రశ్నలు అడిగి, వివరాలు తీసుకున్నారు. సేకరించిన నూనెల్లో టిఫిన్ సెంటర్ (పామాయిల్), సమోసా షాపు (పామాయిల్), మిర్చిబజ్జి బండి (పామాయిల్), ఆలూ చిప్స్ షాపు (పొద్దుతిరుగుడు నూనె), స్వీట్ షాపు (పామాయిల్) ఉన్నాయి. ప్రయోగశాలలో పరీక్షలు చేసి, ప్రమాదకర రసాయనాల మోతాదులను పరిశీలించారు.
పరిమితికి మించి ప్రమాదకర రసాయనాలు
టిఫిన్ సెంటర్లు, స్ట్రీట్‌ఫుడ్ షాపుల నుంచి సేకరించిన నూనెలలో టోటల్ పోలార్ కంపౌండ్స్ (టీపీసీ - నూనెను మరిగించినప్పుడు ఏర్పడే రసాయన సమ్మేళనాలు) 38శాతం ఉన్నట్టు గుర్తించారు. ఆహార భద్రత ప్రమాణాల ప్రకారం.. టీపీసీ 25శాతంలోపే ఉండాలి. లేకుంటే ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదకరం. వంట నూనెను మళ్లీ మళ్లీ వేడి చేస్తూ వాడితో.. అందులో ఫ్రీ రాడికల్స్, ట్రాన్స్ ఫ్యాట్స్, ఆల్డిహైడ్స్ వంటి హానికర రసాయన సమ్మేళనాలు ఉత్పత్తి అవుతాయని.. అవి శరీరంలో వాపు (ఇన్‌ఫ్లమేషన్), ఆక్సీకరణ ఒత్తిడి (ఆక్సిడేటివ్ స్ట్రెస్)ను పెంచి గుండెజబ్బులు, ధమనుల్లో కొవ్వు పేరుకుపోవడంతోపాటు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
చాలా మందిలో అవగాహన తక్కువే..
వంట నూనె వినియోగంపై చాలా మందికి సరైన అవగాహన లేదని, దానితో మళ్లీ మళ్లీ వినియోగిస్తున్నారని అధ్యయనంలో వెల్లడైంది. దీనిపై అవగాహన ఉన్న, విద్యావంతులైన కొంత మంది మాత్రం నూనెలను మార్చుతున్నారని గుర్తించింది. ఈ క్రమంలో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, స్ట్రీట్ ఫుడ్ విక్రేతలకు వంట నూనెల వినియోగంపై అవగాహన, శిక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని అధ్యయన నివేదిక పేర్కొంది.
ఇలా ఉంటే.. మార్చేయాలి!
నూనె ముదురు గోధుమ లేదా నల్లగా మారితే..
కాలినట్లు, మాడిపోయినట్టు వాసన వచ్చినా..
సాధారణ వేడి వద్దే అధికంగా పొగ వస్తే..
నూనె చిక్కగా, నురగగా మారితే..
పైన చెప్పినట్టు ఏవీ లేకున్నా.. 3-4 సార్లు మించి వాడొద్దు
వాడిన ప్రతిసారి కచ్చితంగా వడగట్టాలి.
చేపలు వేయించిన నూనెలను మళ్లీ వాడొద్దు
ఆ పొగను పీల్చినా ముప్పే..
వంటనూనెలను పదేపదే వాడటం వల్ల వాటిలో విషపూరిత రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఆ నూనె నుంచి వెలువడే పొగలోనూ అవి ఉంటాయి. ఆ పొగ పీల్చడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. పలు దేశాల్లో చేసిన అధ్యయనాల్లో ఇది రుజువైంది కూడా. సిగరెట్, బీడీ వంటివి అలవాటు లేని మహిళల్లోనూ ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులను చూస్తున్నాం. దానికి కారణం నూనె పొగలు కూడా. వంటగదిలో నుంచి పొగ సరిగా బయటికి వెళ్లని పరిస్థితిలో ఆ పొగలను పీల్చి ఆరోగ్య సమస్యల బారినపడుతున్నారు.
- డాక్టర్ గీతా నాగశ్రీ, సీనియర్ సర్జికల్
అంకాలజిస్టు, కేర్ కేన్సర్ సెంటర్, హైదరాబాద్