Retired DSP Nalini: ఆరోగ్యం క్షీణించింది.. మృత్యువుకు చేరువవుతున్నా
ABN , Publish Date - Sep 22 , 2025 | 05:42 AM
రాజకీయవేత్తగా, ఆయుర్వేద ఆరోగ్య సేవికగా, ఆధ్యాత్మికవేత్తగా సాగిన తన జీవితం ముగియబోతోందని, ఆరోగ్యం క్షీణించిందని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన....
మరణ వాంగ్మూలం పేరిట విశ్రాంత డీఎస్పీ నళిని లేఖ
భువనగిరి టౌన్/హైదరాబాద్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): రాజకీయవేత్తగా, ఆయుర్వేద ఆరోగ్య సేవికగా, ఆధ్యాత్మికవేత్తగా సాగిన తన జీవితం ముగియబోతోందని, ఆరోగ్యం క్షీణించిందని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన విశ్రాంత డీఎస్పీ నళిని ఆవేదన వ్యక్తంచేశారు. వీలునామా/మరణ వాంగ్మూలం పేరిట సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన బహిరంగ లేఖ సంచలనంగా మారింది. ‘‘ఎనిమిదేళ్ల క్రితం రుమటాయిడ్ ఆర్థరైటిస్(బ్లడ్, బోన్ క్యాన్సర్) సోకగా.. హరిద్వార్‌లోని రాందేవ్ బాబా పంచకర్మ కేంద్రానికి (నిరామయం) వెళ్లి బాగుచేసుకున్నాను. ఇప్పుడు నిరామయంలో చేరేంత డబ్బు లేదు. తెలంగాణ ఉద్యమ పోరాటంలో నిలువెల్లా గాయాలుకాగా, రాజీనామా ద్వారా నాటి ప్రభుత్వం పన్నిన పద్మవ్యూహంలోంచి బయటపడ్డాను. డిపార్ట్మెంట్ నా వెన్నులో సస్పెన్షన్ అనే బల్లాన్ని కసి తీరా దింపింది. మహర్షి దయానందుని దయతో యజ్ఞ బ్రహ్మగా వీవైపీఎస్ (వేద యజ్ఞ పరిరక్షణ సమితి)సంస్థాపకురాలుగా ఎదిగా. సీఎం రేవంత్‌రెడ్డి నాకు సహాయం చేస్తానని ప్రకటించారు. ఆ తర్వాత నా వినతిపత్రం చెత్త బుట్ట పాలైందని తెలిసింది. బతికుండగా నన్ను ఏ నాయకుడూ సన్మానించలేదు. నా దయనీయ స్థితి కేంద్రప్రభుత్వం దృష్టికి చేరితే సరైన, ఖరీదైన వైద్యం అందితే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతానని ఆశాభావంతో ఉన్నా. నా పేరిట ఉన్న ఇంటి స్థలం వీవైపీఎ్‌సకు చెందుతుంది’’ అని నళిని పేర్కొన్నారు.