Rajasingh Challenges Kishan Reddy: రాజీనామా చేసి.. పోటీ చేద్దాం.. గెలుపెవరిదో చూద్దాం
ABN , Publish Date - Sep 11 , 2025 | 06:11 AM
బీజేపీ రాష్ట్ర కమిటీని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కనుసన్నల్లో వేశారని, ఈ కమిటీతో ప్రభుత్వం ఏర్పడితే తాను రాజకీయ సన్యాసం చేస్తానని గోషామహల్ ఎమ్యెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు....
కిషన్‌రెడ్డికి రాజాసింగ్ సవాల్
ఆయన కనుసన్నల్లోనే కమిటీ ఏర్పాటు
ఈ కమిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రతిన
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర కమిటీని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కనుసన్నల్లో వేశారని, ఈ కమిటీతో ప్రభుత్వం ఏర్పడితే తాను రాజకీయ సన్యాసం చేస్తానని గోషామహల్ ఎమ్యెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. రాజీనామా చేసి, స్వతంత్రంగా పోటి చేసి ఎవరు గెలుస్తారో చూద్దామంటూ ఆయన కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. పార్టీలో తాను ఏ పదవులూ ఆశించలేదని, అయితే పార్టీ నుంచి తనకు ఎలాంటి సహకారమూ లభించలేదన్నారు. అధ్యక్షుడు రాంచందర్‌రావును రబ్బర్ స్టాంప్‌గా మార్చారని, బీజేపీని డమ్మీ చేయడానికి కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ కుట్రలు చేశారని ఆయన చెప్పారు.
వేరే పార్టీల్లో చేరను
ఇతర పార్టీల్లో చేరనని, ఎప్పటికీ బీజేపీలోనే ఉంటానని రాజాసింగ్ స్పష్టం చేశారు. కేంద్ర పెద్దల పిలుపు కోసం ఎదురుచూస్తున్నానని, వారిని కలిసి పార్టీని నాశనం చేస్తున్నది ఎవరో చెబుతానన్నారు. పార్టీ పెద్దలు చెప్పినట్లు నడచుకుంటానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలను పరిరక్షించాలని, మతమార్పిడిలను కఠినంగా అరికట్టాలని కూటమి ప్రభుత్వానికి రాజాసింగ్ సూచించారు. హిందువుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందుతారని చెప్పారు. ముస్లింల కోసం కష్టపడినా వారు ఓట్లు వేయరని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.