నిండుకుండలా జలాశయాలు
ABN , Publish Date - Jul 26 , 2025 | 01:01 AM
ఉమ్మడి నల్లగొం డ జిల్లాలోని జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. నాగార్జున సాగర్ గరిష్ఠ నీటిమట్టానికి చేరువలో ఉండగా శుక్రవారం మూసీ ప్రా జెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
నిండుకుండలా జలాశయాలు
మూసీ రెండు క్రస్టు గేట్లు ఎత్తివేత
1,340 క్యూసెక్కుల నీటి విడుదల
579 అడుగులకు సాగర్ నీటిమట్టం
ఎగువనుంచి 1,20,635 క్యూసెక్కుల వరద
కేతేపల్లి/నాగార్జునసాగర్, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నల్లగొం డ జిల్లాలోని జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. నాగార్జున సాగర్ గరిష్ఠ నీటిమట్టానికి చేరువలో ఉండగా శుక్రవారం మూసీ ప్రా జెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో ఆయా ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎగువన విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వరద తాకిడి పెరగడంతో శుక్రవారం మూసీ ప్రాజెక్టు 2 క్రస్టుగేట్లను అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మూసీ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వారం రోజులుగా ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. 645అడుగుల పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం కాగా, గురువారం రాత్రి 643.50 అడుగులకు చేరింది. ఎగువనుంచి వచ్చే ఇన్‌ఫ్లో పెరుగుతుండటం, ప్రాజెక్టు 645 అడుగుల గరి ష్ఠ నీటిమట్టానికి చేరడంతో అప్రమత్తమైన అధికారులు దిగువ మూసీ కి నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు గురువారం రాత్రి నకిరేకల్, సూర్యాపేట, మిర్యాలగూడ, నల్లగొండ నియోజకవర్గాల పరిధిలోని మూసీ నది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. శుక్రవారం ఉదయం 10సమయంలో నీటిపారుదల శాఖ సూ ర్యాపేట డివిజన్-1 ఈఈ వెంకటరమణ ప్రాజెక్టు 3, 8 నెంబర్ క్రస్టుగేట్లను అడుగు మేర ఎత్తి 1340 క్యూసెక్కుల నీటిని దిగువ మూసీకి విడుదల చేశారు. గురువారం సాయంత్రానికి ఎగువ నుంచి వచ్చే ఇన్ ఫ్లో 1653.2 3క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 643.50 అడుగులు(4.07టీఎంసీ)ల వద్ద నిలకడగా ఉంది.
గేట్లు ఎత్తే సమయంలో లోవోల్టేజీ సమస్య
మూసీ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసే సమయంలో విద్యుత లోవోల్టేజీ సమస్యతో 2, 3 గేట్లు పైకి లేవలేదు. విద్యుత్ లోవోల్టేజీ ఉందని గ్రహించి జనరేటర్ విద్యుత్ సాయంతో ప్రాజెక్టు 3, 8నెంబరు క్రస్టుగేట్లను ఒక అడుగు మేర ఎత్తారు.
579 అడుగులకు సాగర్ నీటిమట్టం
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం శుక్రవారం సాయంత్రానికి 579 అడుగులకు చేరింది. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590అడుగులు (312.0450 టీఎంసీలు), కాగా, శుక్రవారం సాయం త్రానికి 579 అడుగులకు (280.1200 టీఎంసీలు) చేరింది. సాగర్ నుంచి కుడి కాల్వ ద్వారా 511 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 4,287 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి మొత్తం 6,598 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా ఎగువనుంచి 1,20,635 క్యూసెక్కుల నీరు సాగర్‌కు వచ్చి చేరుతోంది. సాగర్ నుంచి వరద కాల్వకు, ప్రధాన జలవిద్యుత కేంద్రానికి ఎలాంటి నీటి విడుదల లేదు.
16 అడుగులకు డిండి రిజర్వాయర్ నీటి మట్టం
డిండి: డిండి ప్రాజెక్టు నీటిమట్టం శుక్రవారం సాయంత్రానికి 16 అడుగులకు చేరింది. గరిష్ఠ నీటిమట్టం 36 అడుగులు(2.4 టీఎంసీ లు) కాగా దుందుబి వాగు నుంచి వస్తున్న వరదతో నీటిమట్టం 16 అడుగులకు చేరింది. ఎగువ నుంచి 220 క్యూసెక్కుల ఇనఫ్లో ఉన్న ట్లు ప్రాజెక్టు ఏఈ సాయికుమార్ తెలిపారు.
డిండి ప్రాజెక్టు ఆయకట్టు రైతుల సమావేశాన్ని శనివారం నీటి పారుదలశాఖ అతిథిగృహంలో నిర్వహిస్తున్నట్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొంతినేని వెంకటేశ్వర్‌రావు శుక్రవారం తెలిపారు. మండల ప రిధిలోని రైతులు ఉదయం 10 గంటలకు సమావేశానికి తప్పకుండా హాజరుకావాలన్నారు. సమావేశంలో డిండి ప్రాజెక్టు నీటి విడుదలపై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు.