Reservoirs in Krishna and Godavari Basins: ఆ రెండు తప్ప.. ప్రాజెక్టులన్నీ నిండాయి
ABN , Publish Date - Sep 06 , 2025 | 03:19 AM
రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల కింద ఉన్న జలాశయాల్లోకి నిలకడగా నీరు వచ్చి చేరుతోంది...
కృష్ణా, గోదావరిలో నిండుకుండల్లా జలాశయాలు
సింగూరు, తుంగభద్రల్లో నిల్వను తగ్గించిన అధికారులు
హైదరాబాద్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల కింద ఉన్న జలాశయాల్లోకి నిలకడగా నీరు వచ్చి చేరుతోంది. ఫలితంగా జలాశయాలన్నీ నిండుకుండల్లా ఉన్నాయి. సింగూరు, తుంగభద్ర రిజర్వాయర్లు తప్ప మిగిలినవన్నీ నిండిపోయాయి. కృష్ణా బేసిన్‌లో జూరాల ప్రాజెక్టుకు 82 వేల క్యూసెక్కుల వరద రాగా.. 70 వేల క్యూసెక్కులను వదిలారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 1.82 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. 1.84 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలిపెట్టారు. నాగార్జునసాగర్‌కు 1.34 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. 52 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్‌కు 70 వేల క్యూసెక్కులు వస్తుండగా.. 51 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. ఎల్లంపల్లికి 1.44 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 1.13 లక్షల క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. సింగూరు కట్ట ప్రమాదంలో ఉందన్న డ్యామ్ సేఫ్టీ సంస్థ హెచ్చరికలతో నీటి నిల్వను కుదించారు. భారీ వరద వస్తున్నా.. నిల్వను గణనీయంగా తగ్గించుకున్నారు. సింగూరు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా.. 16.64 టీఎంసీలే నిల్వ చేశారు. కట్టకు మరమ్మతుల కోసం సర్కారు నిధులు మంజూరు చేసింది. ఇక తుంగభద్ర రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 105.79 టీఎంసీలు కాగా.. ఈ రిజర్వాయర్ గేట్లు సురక్షితంగా లేవని గుర్తించి, 79.53 టీఎంసీల నిల్వ మాత్రమే చేశారు.
3 వేల మిలియన్ యూనిట్లకు చేరువలో జల విద్యుత్తు ఉత్పత్తి
ఈ సీజన్‌లో ప్రాజెక్టులకు భారీగా వరద చేరడంతో జల విద్యుదుత్పత్తి ఆశాజనకంగా జరిగింది. గురువారం వరకు 2903 మిలియన్ యూనిట్ల జలవిద్యుదుత్పత్తి చేశారు. అత్యధికంగా శ్రీశైలం భూగర్భ జలవిద్యుత్కేంద్రంలో 1199 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేయగా.. నాగార్జునసాగర్‌లో 946, జూరాలలో 285, లోయర్ జూరాలలో 312, సాగర్ ఎడమ కాల్వపై 32, పులిచింతలలో 100, శ్రీరాంసాగర్‌లో 19.55 మి.యూ. విద్యుత్తు ఉత్పత్తి అయింది. సగటున రోజూ 49 మిలియన్ యూనిట్ల జలవిద్యుత్తు ఉత్పత్తి అవుతోంది.